Share News

మళ్లీ బ్యాంకు ఉద్యోగుల సమ్మె!

ABN , Publish Date - Sep 23 , 2026 | 12:21 AM

Bank employees' strike from the 28th! బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మెబాటకు సన్నద్ధమవుతున్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ ఇప్పటికే వివిధ బ్యాంకుల ఉద్యోగులు ఈ నెల 11న సమ్మె చేసిన విషయం తెలిసిందే. అయిప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి.

మళ్లీ బ్యాంకు ఉద్యోగుల సమ్మె!

28 నుంచి 30 వరకు నిర్వహణకు పిలుపు

26, 27 తేదీల్లో సాధారణ సెలవులు

ఐదురోజులపాటు నిలిచిపోనున్న లావాదేవీలు

పింఛన్ల పంపిణీ ఆలస్యమయ్యే అవకాశం

శ్రీకాకుళం ఎడ్యుకేషన్‌, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మెబాటకు సన్నద్ధమవుతున్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ ఇప్పటికే వివిధ బ్యాంకుల ఉద్యోగులు ఈ నెల 11న సమ్మె చేసిన విషయం తెలిసిందే. అయిప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఈ క్రమంలో ఈ నెల 28 నుంచి 30 వరకూ ఉద్యోగుల ఐక్యవేదిక యూఎఫ్‌బీయూ మరోసారి సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో ఆ మూడు రోజులు బ్యాంకులు పనిచేయవు. అలాగే ఈనెల 26, 27 తేదీల్లో (శని, ఆదివారం) బ్యాంకులకు సాధారణ సెలవులు. ఈ నేపథ్యంలో సమ్మె జరిగితే.. ఈ నెలాఖరులో వరుసగా ఐదు రోజులపాటు బ్యాంకులు మూతపడనున్నాయి. దీనివల్ల వినియోగదారులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ప్రధానంగా బ్యాంకులకు వెళ్లి నిర్వహించే వివిధ రకాల రుణాల సంప్రదింపులు ప్రొసిసెంగ్‌ వ్యవహారాలు, నగదు లావాదేవీలు, చెక్కుల క్లియరెన్స్‌ వంటి పనులకు ఆటంకం కలుగనుంది. మరోవైపు అక్టోబరులో ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద సామాజిక పింఛన్ల పంపిణీ కూడా ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రతీ నెలాఖరున అధికారులు బ్యాంకుల నుంచి నగదు విత్‌డ్రా చేసి.. 1న పింఛన్ల నగదు పంపిణీ చేసేవారు. ఈసారి వరుస ఐదురోజులు బ్యాంకులు మూతపడనుండడంతో పింఛన్ల పంపిణీ జాప్యమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Updated Date - Sep 23 , 2026 | 12:21 AM