Share News

‘చింతాడ’తో పాటు 24 మందికి బెయిల్‌ మంజూరు

ABN , Publish Date - Aug 18 , 2026 | 12:07 AM

బూర్జ ఎస్‌ఐ ప్రవల్లికపై దాడి కేసులో జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న ప్రధాన నిందితుడు, వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చింతాడ రవికుమార్‌తో పాటు మరో 24 మందికి సోమవారం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరైంది.

 ‘చింతాడ’తో పాటు 24 మందికి బెయిల్‌ మంజూరు

ముగిసిన 11 మంది కస్టడీ

ఆమదాలవలస, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): బూర్జ ఎస్‌ఐ ప్రవల్లికపై దాడి కేసులో జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న ప్రధాన నిందితుడు, వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చింతాడ రవికుమార్‌తో పాటు మరో 24 మందికి సోమవారం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరైంది. గత నెల 30న వైసీపీ అధినేత జగన్‌ జిల్లా పర్యటన సందర్భంగా కొత్తరోడ్డు సమీపంలో విధుల్లో ఉన్న ఎస్‌ఐ ప్రవల్లికపై దాడి ఘటనలో 27 మందిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇద్దరికి శుక్రవారం బెయిల్‌ మంజూరు చేసిన ఆమదాలవలస జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి బి.రమ్య సోమవారం మిగిలిన 25 మందికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు. బెయిల్‌పై విడుదలైన నిందితులు రెండు నెలలు ప్రతి శనివారం ఆమదాలవలస పోలీస్‌స్టేషన్‌లో హాజరై సంతకాలు చేయాల్సి ఉంటుందని, లేదా పోలీసులు కేసుకు సంబంధించిన చార్జిషీట్‌ నివేదికను కోర్టుకు సమర్పించేటంత వరకు షరతులు వర్తిస్తాయని న్యాయాధికారి ఆదేశించారు. దీంతో ఈ కేసుకు సంబంధించి చింతాడతో పాటు 26 మందికి కోర్టులో ఊరట లభించింది.

ముగిసిన కస్టడీ...

ఎస్‌ఐ ప్రవల్లికపై దాడి కేసులో అరెస్టు, రిమాండ్‌లో ఉన్న 25 మంది నిందితులలో మొదట 14 మందిని పోలీస్‌ కస్టడీకి తీసుకొని తిరిగి రిమాండ్‌కు పంపించారు. మిగిలిన 11 మంది నిందితులను ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు న్యాయాధికారి పోలీస్‌ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలివ్వడంతో జిల్లా జైలు నుంచి ఆమదాలవలస పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. సోమవారం ఉదయంతో పోలీస్‌ కస్టడీ సమయం ముగియడంతో తిరిగి నిందితులకు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపరిచి తిరిగి రిమాండ్‌కు తరలించారు.

మహిళా ఎస్‌ఐపై దాడి అబద్ధం

ఆమదాలవలస వైసీపీ ఇన్‌చార్జి చింతాడ

శ్రీకాకుళం అర్బన్‌, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): మహిళా ఎస్‌ఐపై దాడి చేశాననే ఆరోపణలు అబద్ధమని ఆమదాలవలస వైసీపీ ఇన్‌చార్జి చింతాడ రవికుమార్‌ అన్నారు. ఈ కేసుకు సంబంధించి జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న ఆయన సోమవారం బెయిల్‌పై విడుదలయ్యారు. అనంతరం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో కలిసి మీడియాతో మాట్లాడారు. గతనెల 30న మాజీ మంత్రి అప్పలరాజును పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి జిల్లాకు వచ్చారని.. ఆమదాలవలస పరిధిలోని కొత్తరోడ్డు జంక్షన్‌ వద్ద వేలాది మంది జనం తరలిరాగా ఆ రద్దీలో ఎస్‌ఐ ప్రవల్లిక అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. ఆమె ఆరోగ్యం దృష్ట్యా మానవత్వంతో పక్కకు తీసుకువెళ్లాము తప్ప ఆమె పట్ల ఎలాంటి అగౌరవం గానీ, దాడి గానీ జరగలేదన్నారు. అయితే అధికార టీడీపీ నాయకులు వారి సోషల్‌ మీడియాలో ఒక మహిళను అడ్డుపెట్టుకుని తమపై బురదజల్లే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఎమ్మెల్యే రవికుమార్‌ అక్రమాలను, ఇసుక, భూదందాలను ప్రశ్నిస్తున్నామనే అక్కసుతోనే అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. ఎలాంటి డ్రగ్‌ అనాలసిస్‌, నార్కోటిక్‌ టెస్టులకైనా తాము సిద్ధమని పేర్కొన్నారు.

Updated Date - Aug 18 , 2026 | 12:07 AM