బాహుదా ఉగ్రరూపం
ABN , Publish Date - Oct 30 , 2026 | 12:45 AM
15 villages cut off by floodwaters ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఇచ్ఛాపురం నియోజకవర్గంలో వరద బీభత్సం నెలకొంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు ఒడిశాలోని భగలట్టి డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో బాహుదా నది ఉగ్రరూపం దాల్చింది. నదిలో 84568 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుండటంతో పరివాహక ప్రాంతాల్లోని 15 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
నదిలో 84568 క్యూసెక్కుల ప్రవాహం
15 గ్రామాలు జలదిగ్బంధం.. అల్లాడుతున్న ప్రజలు
జాడుపూడి వద్ద రైల్వే పట్టాలపైకి చేరిన నీరు.. రైళ్లు రద్దు
ఆర్టీసీ గ్రామీణ సర్వీసులు నిలిపివేత.. రోడ్లపై నిలిచిన వాహనాలు
ఇళ్లలోకి వరదనీరు.. ఆహారం, తాగునీటి కోసం బాధితుల అవస్థలు
ఇచ్ఛాపురం, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఇచ్ఛాపురం నియోజకవర్గంలో వరద బీభత్సం నెలకొంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు ఒడిశాలోని భగలట్టి డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో బాహుదా నది ఉగ్రరూపం దాల్చింది. నదిలో 84568 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుండటంతో పరివాహక ప్రాంతాల్లోని 15 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జాడుపూడి వద్ద రైల్వే పట్టాలపైకి వరదనీరు చేరడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. బాహుదా, భీమ సముద్రం, పద్మాపురం గెడ్డలు పొంగిపొర్లడంతో వేలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. పంట చేతికందే సమయంలో తుఫాన్ తమకు నష్టం కలిగించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైళ్లు, ఆర్టీసీ సర్వీసులు రద్దు కావడంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జలదిగ్బంధంలో గ్రామాలు
ఇచ్ఛాపురం మండలంలోని తులసిగాం, ధర్మపురం, ఈన్నేసుపేట, లొద్దపుట్టి, జగన్నాథపురం, శాసనాం, అరకబద్ర, టి.బరంపురం గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లపైకి వరదనీరు చేరడంతో రత్తకన్న, మశాఖపురం, బీ.తోటూరు, తేలుకుంచి, కొళిగాం, పాయితారి, కీర్తిపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లొద్దపుట్టిలో భారీగా వరదనీరు చేరడంతో ఇళ్లు నీట మునిగాయి. వరదలో చిక్కుకున్న గ్రామస్థులను ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇళ్లలోకి నీరు చేరడంతో నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలు తడిచిపోయాయని బాధితులు వాపోతున్నారు. ఆకలితో అలమటిస్తున్నామని, రాత్రికైనా పూర్తిస్థాయిలో భోజనాలు అందించాలని కోరుతున్నారు. మశాఖపురంలో ఇళ్లు సగం వరకు నీట మునిగాయి. బెల్లుపడలో మాలరేవు గెడ్డ నీరు గ్రామంలోకి చేరడంతో పలు ఇళ్లు ముంపునకు గురయ్యాయి. బెల్లుపడ జాతీయ రహదారిపై పాత టోల్‌గేట్ వద్దకు వరదనీరు చేరడంతో సాయంత్రం వరకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. బెల్లుపడ, బెల్లుపడ కాలనీ, పండా కాలనీ, విలేఖర్ల కాలనీ, సంతపేటల్లోకి వరదనీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. బెల్లుపడ మాలరేవు పక్కన ఉన్న ఇళ్లలోకి వరద నీరు చేరడంతో పలువురు చిక్కుకున్నారు. శ్రీకాకుళం అగ్నిమాపక, రెస్క్యూటీం సభ్యులు వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
రైళ్లు, ఆర్టీసీ సర్వీసులు రద్దు
తుఫాన్ ప్రభావంతో భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై వెళ్లే పలు రైళ్లను రైల్వేశాఖ రద్దు చేసింది. ప్యాసింజర్ రైళ్లు కూడా నిలిచిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. అప్పటికే బయలుదేరిన రైళ్లను పలాస, ఇచ్ఛాపురం, బ్రహ్మపురం స్టేషన్లలో నిలిపివేశారు. ప్రయాణికులకు రైల్వేశాఖ అధికారులు ఆహారం, తాగునీరు సరఫరా చేశారు. పలాస నుంచి రిలీఫ్ వ్యాన్, భారీ జనరేటర్లు, సిబ్బందిని బాహుదా రైల్వే వంతెన వద్దకు పంపించారు. వరదనీరు తగ్గిన తర్వాతే రాకపోకలు పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. వాగులు, గెడ్డలు పొంగి ప్రవహించడంతో పలాస డిపో నుంచి ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు నడిచే గ్రామీణ ఆర్టీసీ సర్వీసులను రద్దు చేశారు. దీంతో ప్రజలకు రవాణా కష్టాలు తప్పలేదు.
నిలిచిన సమాచార వ్యవస్థ
గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సమాచార వ్యవస్థ ఒక్కసారిగా స్తంభించింది. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో టెలికం కంపెనీల సిగ్నళ్లు నిలిచిపోవడంతో వినియోగదారులు ఆందోళనకు గురయ్యారు. నెట్‌వర్క్ సరిగా లేక డిజిటల్ లావాదేవీలు కూడా నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరా లేకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. సాయంత్రానికి పునరుద్ధరించడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.
ఉధృతంగా మహేంద్రతనయ
శ్రీకాకుళం జిల్లాతోపాటు ఒడిశాలో కురిసిన వర్షాలకు మహేంద్రతనయ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. మెళియాపుట్టి మండలం కొసమాళ వద్ద రహదారిపైకి వరదనీరు చేరడంతో పర్లాఖిమిడి-పలాస మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మహేంద్రతనయ వంతెనపై కూడా రాకపోకలను నిలిపివేశారు.
కొసమాళలోని జగనన్న కాలనీలోకి భారీగా వరదనీరు చేరడంతో తహసీల్దార్ రాము, ఎంపీడీవో ప్రసాద్‌పండా, ఎస్‌ఐ అమీర్‌ఆలీ అక్కడికి చేరుకుని స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చాపర, మెళియాపుట్టి, కొసమాళ, రట్టిణి, నడసందర, పెద్దపద్మాపురం గ్రామాల్లో వందలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. గోకర్ణపురంలో రాధాసాగరం నీరు అధికంగా చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
పట్టుపురం-గారబంద, పలాస-పర్లాఖిమిడి, టెక్కలి-మెళియాపుట్టి, పాతపట్నం-మెళియాపుట్టి రహదారులు దెబ్బతిన్నాయి. సుమారు 30 చెరువులకు గండ్లు పడ్డాయి.
ఎక్కడి వాహనాలు అక్కడే!
ఇచ్ఛాపురం వద్ద బాహుదా నది వరదలో గురువారం నాలుగు లారీలు చిక్కుకున్నాయి. దీంతో అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. గురువారం ఉదయం 8 గంటల నుంచే జాతీయ రహదారిపై లారీలు, బస్సులు, ఇతర వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఒడిశాలోని సుర్లారోడ్, పలాస వద్ద లక్ష్మీపురం టోల్‌ప్లాజా నుంచి వాహనాలను ముందుకు వెళ్లనివ్వలేదు. కాశీబుగ్గ సీఐ అప్పారావు సిబ్బందితో లక్ష్మీపురం టోల్‌ప్లాజా వద్ద పహారా కాస్తూ వాహనాలను నిలువరించారు. రాత్రి వరకు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. కోల్‌కతా, హైదరాబాద్ నుంచి వస్తున్న బస్సుల్లోని ప్రయాణికులు కూడా రహదారిపైనే చిక్కుకుపోయారు. తాగునీరు, ఆహారం అందడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. బాహుదా నది ప్రవాహ ప్రాంతంలో రోడ్డుపై చేరిన నీటిని మళ్లించేందుకు జిల్లా రెవెన్యూ, పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టింది.
ఉధృతంగా వంశధార
వంశధార నది ఉధృతంగా ప్రవహిస్తోంది. బుధవారం నుంచి నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గొట్టా బ్యారేజీ వద్ద ఇరవై రెండు గేట్లను పైకెత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు, సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గురువారం రాత్రి 8 గంటల సమయానికి గొట్టా బ్యారేజీ వద్దకు 75109 క్యూసెక్కుల వరదనీరు వచ్చిందని అధికారులు తెలిపారు. ఒడిశా పరీవాహక ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయని, నదిలో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం లేదని డీఈఈ సరస్వతి వెల్లడించారు.


