మరోసారి ఉప్పొంగిన బాహుదా
ABN , Publish Date - Nov 20 , 2026 | 11:54 PM
Bahuda... increased flood flow బాహుదా నదిలో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో ఇచ్ఛాపురం పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. ఎగువ ప్రాంతాలతో పాటు ఒడిశాలో కురిసిన భారీ వర్షాలకు నదిలోకి పెద్దఎత్తున వరద నీరు చేరింది. ఒక దశలో ప్రవాహం 40వేల క్యూసెక్కులకు చేరడంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తమయ్యారు.
ఎగువన వర్షాలతో ఒక్కసారిగా పెరిగిన వరద ప్రవాహం
నదిలోకి 40 వేల క్యూసెక్కుల నీరు
ముంపు భయంతో పరివాహక ప్రాంతాల ప్రజల్లో ఆందోళన
ప్రవాహం తగ్గడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు, ప్రజలు
ఇచ్ఛాపురం, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): బాహుదా నదిలో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో ఇచ్ఛాపురం పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. ఎగువ ప్రాంతాలతో పాటు ఒడిశాలో కురిసిన భారీ వర్షాలకు నదిలోకి పెద్దఎత్తున వరద నీరు చేరింది. ఒక దశలో ప్రవాహం 40వేల క్యూసెక్కులకు చేరడంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తమయ్యారు. అయితే క్రమంగా నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అక్వాన్ తుపాను దిశ మార్చుకుని ఒడిశా వైపు పయనిస్తోందని వాతావరణ శాఖ ప్రకటించింది. తీరానికి చేరుకునే క్రమంలో బలహీనపడింది. తొలుత ఒడిశా, ఏపీ సరిహద్దుల్లోని కవిటి, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో తుపాను తీరం దాటుతుందని భావించడంతో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో పలాస డివిజన్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడంతోపాటు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. శుక్రవారం మధ్యాహ్నానికి వాతావరణం ఒక్కసారిగా మారి పొడి వాతావరణం నెలకొన్నప్పటికీ.. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల ప్రభావంతో బాహుదాలో వరద ఉధృతి పెరిగింది. ఇచ్ఛాపురం పట్టణ పరిసర ప్రాంతాల్లోకి నీరు చేరడంతో ముంపు భయాలు వ్యక్తమయ్యాయి. గత నెలలో భారీ వర్షాలకు బాహుదా ఉప్పొంగి జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయిన ఘటనను గుర్తుచేసుకుని ప్రజలు ఆందోళన చెందారు. ఆ సమయంలో నదిలోకి రికార్డు స్థాయిలో 80 వేల క్యూసెక్కుల నీరు చేరింది. ప్రస్తుతం మరోసారి 40 వేల క్యూసెక్కుల వరకు ప్రవాహం పెరగడం కలవరపరిచింది. గత అనుభవాల దృష్ట్యా ముంపు ప్రాంతాల్లో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. అయితే వర్షాలు తగ్గడం, వరద ప్రవాహం క్రమంగా దిగిరావడంతో ముప్పు తప్పింది.
అధికారుల పరిశీలన
జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ హరిహోం, ప్రత్యేక అధికారి వేణుగోపాలరావు బాహుదా నది వద్ద పరిస్థితిని పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేసి, అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. కేంద్రాల్లో తాగునీరు, ఆహారం, విద్యుత్, వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. నీటిలో మునిగిన రహదారులు, వంతెనలపై రాకపోకలను నిలిపివేయాలని, నదిలో నీటిమట్టం, ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఎగువ ప్రాంతాల నుంచి ఆకస్మికంగా వరదనీరు వచ్చే ప్రమాదం ఉన్నందున వర్షాలు తగ్గినా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎన్.వెంకటరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.