బాబూ.. మమ్మల్ని వదిలి వెళ్లిపోయావా!
ABN , Publish Date - May 07 , 2026 | 12:21 AM
బాబూ.. మమ్మల్ని వదిలి వెళ్లిపోయావా. ఇప్పుడేకదా మాతో సరాదాగా మాట్లాడావు. అంతలోనే విధి నిన్ను బలితీసుకుందా.. అంటూ ఆ తల్లితో పాటు భార్యాబిడ్డలు కన్నీరుమున్నీరుగా విలపించారు.
- గుండెపోటుతో కుమారుడి మృతి
- కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు
- బిడ్డ చితికి నిప్పంటించిన తల్లి
పలాస, మే 6 (ఆంధ్రజ్యోతి): బాబూ.. మమ్మల్ని వదిలి వెళ్లిపోయావా. ఇప్పుడేకదా మాతో సరాదాగా మాట్లాడావు. అంతలోనే విధి నిన్ను బలితీసుకుందా.. అంటూ ఆ తల్లితో పాటు భార్యాబిడ్డలు కన్నీరుమున్నీరుగా విలపించారు. నవమాసాలు మోసి కని పెంచి ప్రయోజకుడిని చేసిన కుమారుడు గుండె పోటుతో మృతి చెందాడు. దీంతో కుమారుడి చితికి ఆ తల్లి తన చేతుల మీదుగా నిప్పంటించి బాధ్యత తీర్చుకుంది. పలాస ఎల్లమ్మవీధికి చెందిన తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్‌చార్జి ఇప్పిలి చాణుక్య(45) బుధవారం తీవ్ర గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన తండ్రి ఇప్పటికే మరణించగా, తల్లి చంద్రావతి, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, భర్త అంతక్రియలను భార్య చేయకూడదని పెద్దలు చెప్పారు. చాణుక్యకు ఓ సోదరుడు ఉండగా, ఆయన భార్య ప్రస్తుతం గర్భిణి. దీంతో ఆయన కూడా అంత్యక్రియలు చేయడానికి వీలుపడలేదు. దీంతో ఎవరూ లేకపోవడంతో తల్లి చంద్రావతి పురుషోత్తపురం శ్మశానవాటికలో కుమారుడి చితికి నిప్పంటించి అంత్యక్రియలను పూర్తి చేసింది. చాణక్య స్థానిక టీడీపీలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఆయన మృతిపై ఎమ్మెల్యే గౌతు శిరీష, నియోజకవర్గ ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకన్నచౌదిరి, ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు తదితరులు సంతాపం తెలిపారు.