Share News

జనజీవన స్రవంతిలోకి ఆజాద్‌

ABN , Publish Date - Aug 20 , 2026 | 12:26 AM

మావోయిస్టు అగ్రనేత దున్న కేశవరావు అలియాస్‌ ఆజాద్‌ ఎట్టకేలకు జనజీవన స్రవంతిలోకి వచ్చారు.

జనజీవన స్రవంతిలోకి ఆజాద్‌
తల్లి కాములమ్మ, భార్య, బంధువులతో కేశవరావు

- 25ఏళ్ల అజ్ఞాతంలో మావోయిస్టు అగ్రనేత

- 15 ఏళ్ల జైలు జీవితం

- 68కేసుల నుంచి విముక్తి

- ఒడిశా జైలు నుంచి విడుదల

- స్వగ్రామం నల్లబొడ్లూరుకు చేరిక

హరిపురం, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు అగ్రనేత దున్న కేశవరావు అలియాస్‌ ఆజాద్‌ ఎట్టకేలకు జనజీవన స్రవంతిలోకి వచ్చారు. 15 ఏళ్లుగా ఒడిశా రాష్ట్రం జార్పడ జైలులో మగ్గుతున్న ఆయనకు ఇన్నాళ్లకు స్వేచ్ఛా వాయువులు లభించాయి. మంగళవారం సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యారు. అక్కడి నుంచి నేరుగా తన స్వగ్రామం మందస మండలం నల్లబొడ్లూరుకు బుధవారం చేరుకున్నారు. ఆయనున్న చూసి తల్లి, భార్య, బంధువులు తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు.

25ఏళ్ల పాటు అజ్ఞాతం..

కేశవరావు చిన్నతనంలోనే మావోయిస్టు ఉద్యమాల పట్ల ఆకర్శితులయ్యారు. 1990కి ముందే పీపుల్స్‌ వార్‌ గ్రూపులో చేరారు. ఆ తర్వాత కాలంలో ఆజాద్‌ పేరుతో సీపీఐ(మావోయిస్టు) ఒడిశా రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, వంశధార డివిజనల్‌ కమిటీ సెక్రటరీగా, ఆంధ్రా-ఒడిశా బోర్డర్‌ స్పెషల్‌ జోనల్‌ కమిటీలో అగ్రనేతగా ఎదిగారు. పలు కేసుల్లో ఈయన్ని పోలీసులు నిందితునిగా చేర్చారు. అప్పట్లో ఈయనపై రూ10లక్షల రివార్డు ఉండేది. అనంతరం ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు 2011లో అప్పటి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు ఆధ్వర్యంలో అప్పటి డీజీపీ అరవిందరావు సమక్షంలో పోలీసులకు లొంగిపోయారు. ఆంధ్రాలో 16, ఒడిశాలో 52కేసులు పెండింగ్‌లో ఉండడంతో లొంగిపోయిన పది రోజుల్లోనే ఆయన్ను ఒడిశా పోలీసులు మళ్లీ అరెస్టు చేసి భువనేశ్వర్‌లోని జార్పడా జైలుకు తరలించారు. ఈయనపై నమోదైన 68కేసుల్లోనూ సుప్రీం కోర్డు ఆదేశాల మేరకు ఆయా రాష్ట్రాల్లో విచారించి నిర్దోషిగా విడుదల చేశారు. జార్పడ జైలు నుంచి మంగళవారం సాయంత్రం విడుదలై బుధవారం ఉదయం తన స్వగ్రామం నల్లబొడ్లూరు చేరుకున్నారు. సుమారు 40 ఏళ్ల తరువాత కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులను కలుసుకోవడంతో ఉద్విగ్న భరిత క్షణాలను అనుభవించారు.

అండగా ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి

2011లో ఒడిశా పోలీసులు ఆజాద్‌ను అరెస్ట్‌ చేసి భువనేశ్వర్‌లోని జార్పడ జైలుకు తరలించారు. తనకు జరిగిన అన్యాయంపై అక్కడి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసు విచారణ జరగకపోవడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అనంతరం కోర్టులోనే నిరాహార దీక్ష చేపట్టారు. విషయం తెలుసుకున్న ఆయన తల్లి దున్న కాములమ్మ 2015లో అప్పటి ఎమ్మెల్యే గౌతు శివాజీ సూచనలతో న్యాయ పోరాటం చేపట్టారు. కాములమ్మ తన బంధువు తులసయ్యతో కలసి హైదరాబాద్‌ వెళ్లి అక్కడ ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి లైవ్‌ టీవీ ప్రోగాంలో పాల్గొని తన కుమారుడికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమం అప్పట్లో సంచలనంగా మారింది. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ త్వరితగతిన చేపట్టి ఆంధ్రాలో కేసుల విచారణకు శ్రీకాకుళంలో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు. ఒడిశాలోని కేసులను భువనేశ్వర్‌లో విచారణ చేపట్టారు. అన్ని కేసుల్లోనూ నిర్దోషిగా తేలి విడుదలయ్యారు. తమ కుమారుడి విడుదలకు సహకరించిన వారందరికీ కాములమ్మ కృతజ్ఞతలు తెలియజేశారు.

Updated Date - Aug 20 , 2026 | 12:26 AM