రోడ్డు నిర్మించమంటే దాడి
ABN , Publish Date - Jul 02 , 2026 | 12:33 AM
రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరినందుకు వైసీపీ నేతలు దాడికి దిగారు.
.
- ఇబ్రహీంబాద్‌లో వైసీపీ నేతల దాష్టీకం
- ముగ్గురు టీడీపీ వర్గీయులకు గాయాలు
ఎచ్చెర్ల రూరల్, జూలై 1(ఆంధ్రజ్యోతి): రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరినందుకు వైసీపీ నేతలు దాడికి దిగారు. ఈ ఘటనలో టీడీపీకి చెందిన ముగ్గురు గాయపడగా, వైసీసీకి చెందిన ఓ వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. ఇబ్రహీంబాద్ గ్రామంలో మండల పరిషత్ నిధులతో బుధవారం సిమెంట్ కాలువ, రోడ్డు పనులు చేస్తున్నారు. స్థానిక వైసీపీ నాయకులు ఈ పనులు చేపడుతున్నారు. మురుగు నీరు నిలిచిపోతుందని, కాలువ పూర్తిచేసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని స్థానిక టీడీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు సూర వెంకటరమణ, సీపాన సత్తిరాజు, కృష్ణవేణి కోరారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాట పెరిగింది. పాతకక్షలతో ఒక్కసారిగా వైసీపీ వర్గీయులు దాడిచేశారు. దీంతో టీడీపీకి చెందిన వెంకటరమణ, సత్తిరాజు, కృష్ణవేణి గాయపడ్డారు. టీడీపీ వర్గీయుల దాడిలో వైసీపీకి చెందిన సీపాన తేజేశ్వరరావు గాయపడ్డారు. వీరు ప్రస్తుతం శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. శ్రీకాకుళం డీఎస్పీ వివేకనంద, సీఐ అవతారం, ఎస్‌ఐ లక్ష్మణరావు ఇబ్రహింబాద్ వెళ్లి ఘర్షణకు కారణమైన నిర్మాణాలను పరిశీలించారు. వైద్య నివేదిక ఆధారంగా కేసునమోదు చేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
కక్షసాధింపు రాజకీయాలు మంచివి కావు...
రిమ్స్‌లో చికిత్స పొందుతున్న టీడీపీ వర్గీయులను ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు బుధవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందజేయాలని సూచించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో వైసీపీ పాలనలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని, ప్రస్తుతం సైతం నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. నేర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కక్షసాధింపు రాజకీయాలు మంచివి కావన్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఆయన వెంట టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి, పార్టీ మండల అధ్యక్షుడు బెండు మల్లేశ్వరరావు, నాయకులు లంక శ్యామలరావు, అన్నెపు భవనేశ్వరరావు, వావిలపల్లి రామకృష్ణ, పైడి అన్నంనాయుడు ఉన్నారు.