వైసీపీ నాయకుల అరాచకం
ABN , Publish Date - Nov 06 , 2026 | 01:18 AM
Attempted attack on MLA Shankar in Kishtappapeta జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో వైసీపీ నాయకులు పలుచోట అరాచకాలకు పాల్పడ్డారు. పోలింగ్ కేంద్రాల వద్ద కర్రలు, రాళ్లతో దాడులకు బరితెగించారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌పై సైతం దాడికి యత్నించారు.
కిష్టప్పపేటలో ఎమ్మెల్యే శంకర్‌పై దాడియత్నం
శాలిహుండంలోనూ రెచ్చిపోయిన వైనం
కర్రలు, రాళ్లతో దాడులు
నలుగురు టీడీపీ కార్యకర్తలకు గాయాలు
శ్రీకాకుళం అర్బన్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో వైసీపీ నాయకులు పలుచోట అరాచకాలకు పాల్పడ్డారు. పోలింగ్ కేంద్రాల వద్ద కర్రలు, రాళ్లతో దాడులకు బరితెగించారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌పై సైతం దాడికి యత్నించారు. గురువారం శ్రీకాకుళం మండలం కిష్టప్పపేటలో పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేసేందుకు ఎమ్మెల్యే శంకర్ క్యూలో నిల్చున్నారు. అదే సమయంలో.. వైసీపీకి చెందిన ఎంపీటీసీ అభ్యర్థి రుప్ప దివ్య భర్త ఎచ్చెర్ల శ్రీధర్, అనుచరులు ఎమ్మెల్యేపై దాడికి యత్నించారు. వెంటనే ఎమ్మెల్యే సిబ్బంది, స్థానిక పార్టీ శ్రేణులు అప్రమత్తమై అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు బలగాలు భారీగా మోహరించి పరిస్థితిని అదుపు చేశాయి.
గార మండలం శాలిహుండాంలో కూడా వైసీపీ నేతలు, కార్యకర్తలు పోలింగ్ కేంద్రం వద్ద కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో నలుగురు టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి వైసీపీ నాయకులు జల్లు అయ్యప్పనాయుడు, చింతల హరిప్రసాద్, చంద్రమహంతి తిరిబాబు, చింతల ఎరకయ్య, చింతల తిరుపతి, చింతల బాలకృష్ణ తదితరులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో పోలింగ్ కేంద్రం వద్ద కూటమి శ్రేణులపై పలువురు దాడి చేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలు యాళ్ల రమణ, యాళ్ల సాయి, గానుగుల రమణ, గుండ రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. తోటి కార్యకర్తలు వారిని హుటాహుటిన ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా టీడీపీ ఎన్నికల పరిశీలకుడు మహ్మద్ నజీర్.. ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.
ఇవి పిరికిపంద చర్యలు
ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ప్రజాదరణ కోల్పోయి పరాజయం తప్పదన్న భయంతోనే వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఇవి పిరికిపంద చర్యలుగా అభివర్ణించారు. కూటమి శ్రేణులపై దాడులకు పాల్పడిన వైసీపీ శ్రేణులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
దొంగ ఓట్లు వేయిస్తున్నారని..
మందస మండలం నారాయణపురం ఎంపీయుపీ పాఠశాల పోలింగ్ కేంద్రంలో వైసీపీ, టీడీపీ నాయకులు బాహాబాహీకి దిగారు. తీవ్ర ఉద్రిక్తత ఏర్పడగా.. పోలీసులు వారందర్నీ చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది. పోలింగ్‌బూత్‌లో వైసీపీ ఏజెంట్ కె.ధర్మారావు ఉండగా.. బాలకృష్ణ అనే వ్యక్తి భోజనానికి బయటకు వస్తున్న సమయంలో ‘మీరు దొంగ ఓట్లు వేయిస్తున్నార’ని వైసీపీ ఏజెంట్లు ఆరోపించారు. ఈ విషయాన్ని అక్కడున్న టీడీపీ ఏజెంట్ జి.భోగరాజు.. పార్టీ కార్యకర్తలకు చెప్పాడు. దీంతో పాఠశాల గేటు వద్ద వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుని ఒకరికొకరు తోసుకున్నారు. ఈక్రమంలో ఓ టీడీపీ కార్యకర్త చొక్కా చిరిగిపోగా.. కొందరు కింద పడిపోయారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారితీయగా.. కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతి, ఎస్‌ఐ డి.గౌరి అక్కడకు చేరుకున్నారు. ఇరువర్గాలను అక్కడ నుంచి పంపించేయడంతో గొడవ సద్దుమణిగింది. అనతరం యథాతఽథంగా పోలింగ్ నిర్వహించారు.
టెక్కలిలో వైసీపీ కవ్వింపు చర్యలు
టెక్కలి మండలంలో తొలుసూరుపల్లి, తిర్లంగి, చాకిపల్లి, టెక్కలి పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. మరోవైపు టీడీపీ శ్రేణులు రిగ్గింగ్ చేస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. తొలుసూరుపల్లికి చెందిన పలువురు ఓటర్లతోపాటు మండలంలో కొంతమంది ఎంపీటీసీ అభ్యర్థులు, వారి అనుచరులు గురువారం మధ్యాహ్నం సబ్‌కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. ఈ నిరసనలో వైసీపీ బహిష్కృత నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూడా ఉన్నారు. మరోవైపు టెక్కలి సీఐ విజయ్‌కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆర్డీవో ఎం.కృష్ణమూర్తికి, డీఎస్పీ లక్ష్మణరావుకు వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పేడాడ తిలక్ ఫిర్యాదు చేశారు.
చినంచలలో ఇరువర్గాల మధ్య తోపులాట
పలాస మండలం చినంచల గ్రామంలో వైసీపీ,టీడీపీ వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టడంతో వివాదం తగ్గుముఖం పట్టింది.
గోకర్నపల్లిలో స్వల్ప ఘర్షణ
పొందూరు మండలం గోకర్నపల్లి గ్రామంలో స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. టీడీపీ శ్రేణులు తమకు ఓటు వేయకుండా అడ్డుకుంటున్నారంటూ పోలీసులు ఆరోపించారు. ఈ క్రమంలో పోలీసులతో సైతం వాగ్వాదం చేశారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
హిరమండలం మండలం కొండరాగోలు పోలింగ్ కేంద్రంలో వైసీపీ, టీడీపీ ఏజెంట్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వైసీపీకి చెందిన పోలింగ్ ఏజెంట్ మూకళ్ళ గణేష్ కుమార్ కొంతమంది వృద్ధులను పోలింగ్ కేంద్రంలోకి తీసువెళ్లి దగ్గర ఉండి ఓటు వేయించగా.. టీడీపీ పోలింగ్ ఏజెంట్ తూలుగు సుధాకర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ సమయంలో గణేష్ కుమార్ పిడిగుద్దులతో ముఖంపై దాడి చేయగా.. సుధాకర్ గాయపడ్డాడు. దీనిపై హిరమండలం పోలీసుస్టేషన్‌లో సుధాకర్ ఫిర్యాదు చేశాడు.