Share News

అసిరితల్లి సిరిమాను సంబరం

ABN , Publish Date - Apr 29 , 2026 | 12:32 AM

Sirimanu Sambaram అరసవల్లిలో వెలసిన శ్రీ అసిరితల్లి అమ్మవారి సిరిమాను అంబరాన్నంటాయి. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సిరిమానోత్సవాన్ని శ్రీకాకుళం శాసనసభ్యుడు గొండు శంకర్‌ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. దుర్గమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైన ఉత్సవం మాడవీధులలో కోలాహలంగా, ఉత్సాహ భరితంగా సాగింది.

అసిరితల్లి సిరిమాను సంబరం
అసిరితల్లి సిరిమానోత్సవంలో పాల్గొన్న భక్తులు

అరసవల్లిలో ఘనంగా సిరిమానోత్సవం

అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం

అరసవల్లి/ శ్రీకాకుళం క్రైం, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): అరసవల్లిలో వెలసిన శ్రీ అసిరితల్లి అమ్మవారి సిరిమాను అంబరాన్నంటాయి. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సిరిమానోత్సవాన్ని శ్రీకాకుళం శాసనసభ్యుడు గొండు శంకర్‌ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. దుర్గమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైన ఉత్సవం మాడవీధులలో కోలాహలంగా, ఉత్సాహ భరితంగా సాగింది. మహిళలు పెద్ద ఎత్తున కళశాలతో అమ్మవారికి ముర్రాటలు సమర్పించారు. దారిపొడవునా చీరెలు పరిచి ఘటాలతో వచ్చే వారి పాదాలకు నమస్కరిస్తూ ఆశీర్వాదాలను తీసుకున్నారు. అరసవల్లి మిల్లు జంక్షన్‌ నుంచి అరసవల్లి వరకు రహదారులు నిండి పోయాయి. ఉత్సవం వెలమవీధి, కోవెలవీధి, శ్రీశయనవీధి, మెయిన్‌ రోడ్డు మీదుగా పెద్దతోట వద్దకు చేరుకుని, మరలా కళింగరోడ్డు మీదుగా ఆదిత్యాలయ ఆర్చి దాటుకుని అసిరితల్లి అమ్మవారి కోవెలకు చేరుకుంది. గిరిజన నృత్యాలు, కోలాటాలు, తప్పెటగుళ్ల ప్రదర్శనలు సంబరాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వేల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో అరసవల్లి భక్తజన సంద్రమైంది. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు అమ్మవారికి పూజలు చేశారు.

పటిష్ఠ పోలీస్‌ బందోబస్తు

అరసవల్లిలో అసిరితల్లి సిరిమానోత్సవం సందర్భంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహించారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాకుళం టౌన్‌ డీఎస్పీ సీహెచ్‌ వివేకానంద పర్యవేక్షణలో సిరిమానోత్సవం సాగింది. భారీస్థాయిలో భక్త జనసందోహం ఉన్నా.. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌కు క్రమబద్దీకరించారు. డ్రోన్లు, సీసీ కెమేరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. కాగా అరసవల్లి చేరుకునే మార్గాలు వాహనాలు, భక్తులు, ప్రజలతో కిటకిటలాడాయి. మిల్లు జంక్షన్‌ వద్ద అరసవల్లి వెళ్లే మార్గంలో పోలీసులు బారికేడ్లు వేసి, ట్రాఫిక్‌ను నియంత్రించే చర్యలు చేపట్టారు.

Updated Date - Apr 29 , 2026 | 12:32 AM