Share News

చదువులకు ఆసరాగా..

ABN , Publish Date - Jul 23 , 2026 | 12:36 AM

‘Thalliki Vandanam’ funds credited కూటమి ప్రభుత్వం చదువులకు ఆసరాగా.. తల్లికి వందనం పథకం కింద నగదు జమ చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

చదువులకు ఆసరాగా..
మెళియాపుట్టిలో ఆనందం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు

  • ‘తల్లికి వందనం’ నిధులు జమ

  • జిల్లాలో 1,81,243 మందికి మంజూరు

  • విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆనందం

  • శ్రీకాకుళం ఎడ్యుకేషన్‌/ రణస్థలం/ మెళియాపుట్టి, జూలై 22(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం చదువులకు ఆసరాగా.. తల్లికి వందనం పథకం కింద నగదు జమ చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు రూ.13 వేలు చొప్పున వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో బుధవారం నిధులు జమచేసింది. జిల్లాలో 2,74,893 మంది విద్యార్థులకు సంబంధించి 1,81,243 మంది తల్లుల ఖాతాల్లో సుమారు రూ.357 కోట్లు మంజూరయ్యాయి. ఈ డబ్బులు తమ పిల్లల చదువులకు ఎంతో ఉపయోగపడతాయని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. గతేడాది జమయైున డబ్బులతో చాలా మంది తమ పిల్లలకు సైకిళ్లను కొనుగోలు చేశారు. కొందరు ట్యూషన్లకు వినియోగించారు. ఎన్నికల హామిని నెరవేర్చిన సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

  • విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా : మంత్రి అచ్చెన్నాయుడు

  • రాష్ట్రంలో ఏ విద్యార్థి కూడా ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం విద్యార్థుల భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పథకం పేద కుటుంబాల విద్యార్థులకు వరంగా మారిందన్నారు. అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో ఈ నెల 24 వరకు రూ.13వేలు చొప్పున నిధులు జమ కానున్నాయని తెలిపారు.

  • రెండు కుటుంబాల్లో నలుగురికి చొప్పున

  • మెళియాపుట్టిలోని రెండు కుటుంబాల్లో నలుగురేసి విద్యార్థులకుగానూ.. తల్లికి వందనం పథకం కింద రూ.52వేలు చొప్పున వారి తల్లుల ఖాతాల్లో జమైంది. మెళియాపుట్టికి చెందిన సయ్యద్‌ రజియా, మోసే దంపతులకు నలుగురు సంతానం. మెళియాపుట్టిలోని జడ్పీ పాఠశాలలో వీరి పిల్లలు ఒనిశా తొమ్మిదో తరగతి, రెహనా ఏడో తరగతి, ఫాతిమా ఐదో తరగతి, నసీమా మూడో తరగతి చదువుతున్నారు. అలాగే షేక్‌ రాజ, రజిత దంపతులకు కూడా నలుగురు పిల్లలు. నబీన పదో తరగతి, రహీంతుల ఎనిమిదో తరగతి, రహీం ఏడో తరగతి, ఫాతిమా ఆరో తరగతి చదువుతున్నారు. వీరు కూడా మెళియాపుట్టిలోని జడ్పీ పాఠశాలలోనే విద్యనభ్యసిస్తున్నారు. తల్లికి వందనం పథకం కింద నలుగురేసి పిల్లలకు రూ.52వేలు చొప్పున జమకావడంతో ఆ రెండు కుటుంబాల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ డబ్బులు తమ పిల్లల చదువులు, ఇతర అవసరాలకు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొంటున్నారు. వారిని జిల్లా టీడీపీ కార్య నిర్వహణ కార్యదర్శి అనపాన రాజశేఖర్‌రెడ్డి, టీడీపీ నాయకుడు ఎరుసు శ్రీనివాసరెడ్డి కలిసి అభినందనలు తెలిపారు.

  • సంచార కుటుంబంలో ఆనందం

  • వారిది సంచార కుటుంబం. తల్లిదండ్రులు గ్రామాల్లో ఇనుప రేకులు విక్రయిస్తుంటారు. ఆ ముగ్గురు పిల్లలు నాన్నమ్మ వద్ద ఉండి చదువుతున్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ‘తల్లికి వందనం’ నిధు లు జమ కావడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లి విరిసింది. వివరాలిలా ఉన్నాయి. తండ్రి జి.సవారి, తల్లి లక్ష్మి ఇనుప రేకులతో జల్లెళ్లు, చేటలు, ఇతర ఇనుప పరికరాలు తయారు చేసి గ్రామాల్లో విక్రయి స్తుంటారు. వీరికి ఐదుగురు పిల్లలు. వీరిలో ముగ్గు రు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. పెద్ద కుమార్తె త్రిషకు వివాహం చేశారు. రెండో అమ్మాయి కుమారి పదో తరగతి పాసైంది. ఆ తరువాత చదువు మానే సి తల్లిదండ్రులకు తోడుగా ఉంటోంది. మూడో కుమార్తె జి.రాహెల్‌ 9వ తరగతి, కుమారుడు అమోష్‌ ఆరో తరగతి రణస్థలం జడ్పీ ఉన్నత, మరో కుమారుడు సువర్ణరాజు 3వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. తల్లిదండ్రులు వలస జీవులు కావడంతో వీరు ముగ్గురూ రణస్థలంలో నాన్నమ్మ నాగమ్మ వద్ద ఉండి చదువుకుంటున్నారు. తల్లిదండ్రులు వలస వెళ్లి 10 రోజులకు ఒకసారి ఇంటికి వస్తుంటారు. నాన్నమ్మే వారి బాగోగులు చూసుకుంటుంది. ఈ ముగ్గురికి తల్లికి వందనం పథకం కింద రూ.39 వేలు మంజూరు కావడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది.

Updated Date - Jul 23 , 2026 | 12:36 AM