సీఎం పర్యటనకు ఏర్పాట్లు
ABN , Publish Date - May 13 , 2026 | 12:07 AM
CM tour at narasannapeta నరసన్నపేటలో సీఎం పర్యటనకు సంబంధించి చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ నెల 16న సీఎం చంద్రబాబు నరసన్నపేటలో ‘స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొనున్నారు.
నరసన్నపేటలో ప్రతివార్డును శుభ్రంగా ఉంచాలి
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
పారిశుధ్య నిర్వహణ పనులు పరిశీలన
నరసన్నపేట/ కోటబొమ్మాళి/ కలెక్టరేట్, మే 12(ఆంధ్రజ్యోతి): నరసన్నపేటలో సీఎం పర్యటనకు సంబంధించి చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ నెల 16న సీఎం చంద్రబాబు నరసన్నపేటలో ‘స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొనున్నారు. జమ్ము జంక్షన్ నుంచి సత్యవరం జంక్షన్ వరకు పట్టణంలో మెయిన్‌రోడ్డు మీదుగా పర్యటించనున్నారు. చెత్త సంపద కేంద్రాన్ని పరిశీలించి.. ప్లాస్టిక్ రీసైక్లింగ్ యంత్రాన్ని ప్రారంభిస్తారు. అలాగే ప్రజలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 20 వార్డుల్లో తడిచెత్త పొడిచెత్త వేరు చేసి గ్రీన్ అంబాసిడర్‌కు అందించే విధానంపై అవగాహన కల్పించారు. కొంతమంది వ్యాపారులు రోడ్డుపై చెత్తవేయడంతో దుకాణాల వద్ద డస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేయించారు. మెయిన్ రోడ్డు డివైడర్‌పై మొక్కలు నాటారు. ఇరువైపులా శుభ్రం చేశారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం నరసన్నపేటలోని జమ్ముజంక్షన్, ఇందిరానగర్‌తో పాటు పలు వీధుల్లో పారిశుధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. సీఎం సభాస్థలం, హెలీప్యాడ్, ఇందిరానగర్, హడ్కోకాలనీలో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాలతోపాటు ఎస్‌డబ్ల్యూపీసీలో తడిచెత్త, పొడిచెత్త వేరుచేసేవిధానం, ప్లాస్టిక్ రీసైక్లింగ్ యంత్రం ప్రారంభం తదితర అంశాలపై ప్రత్యేక అధికారులకు బాధ్యతలను అప్పగించారు. నరసన్నపేటలో ప్రతివార్డును పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టాలని జడ్పీ సీఈవో వెంకట్రామన్, డీపీవో స్వరూపరాణికి ఆదేశించారు.
సమర్థవంతంగా విధులు నిర్వహించాలి
సీఎం చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా అధికారులకు కేటాయించిన విధులు సమర్థవంతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, ఆర్డీవోలు, తహసీల్దార్లు, డీఆర్వో విశ్వేశ్వరరావు, ఉప కలెక్టర్లు పద్మావతి, లక్ష్మణరావు, పౌరసరఫరాల మేనేజర్ వేణుగోపాల్, ఆర్‌్క్షబీ ఎస్‌ఈ పి.సత్యనారాయణ, సీపీఓ లక్ష్మీ ప్రసన్న, ఏపీసీ వేణుగోపాలరావు, అదనపు డీఎంహెచ్‌వో మేరీ క్యాథరీన్, ఇరిగేషన్ ఎస్‌ఈ సుధాకర్, డిటీసీ విజయసారథి, డీఎస్‌వో సూర్యప్రకాష్, కలెక్టరేట్ ఏవో సూర్యనారాయణ పాల్గొన్నారు.
పర్యటన విజయవంతం చేయాలి : మంత్రి అచ్చెన్న
సీఎం పర్యటన ఏర్పాట్లుపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. మంగళవారం కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో కలిసి సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. అలాగే కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో ఫోన్‌లో మాట్డాడి.. అన్నిశాఖల అధికారుల సమన్వయంతో సీఎం పర్యటన విజయవంతం చేయాలని సూచించారు. స్వచ్ఛ నరసన్నపేట దిశగా అధికారులు పనిచేయాలని తెలిపారు. ‘ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి. ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వాహనాల పార్కింగ్, రాకపోకలపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి. భద్రత, పారిశుధ్యం, తాగునీరు, ప్రజలకు సౌకర్యాలు తదితర వాటిపై దృష్టి సారించాల’ని మంత్రి అచ్చెన్న ఆదేశించారు. కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకుడు కింజరాపు హరిప్రసాద్, టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి బగ్గు అర్చన పాల్గొన్నారు.