‘ఆర్నబ్’ బీభత్సం
ABN , Publish Date - Oct 29 , 2026 | 12:04 AM
జిల్లాపై ఆర్నబ్ తుఫాన్ విరుచుకుపడింది. మంగళ, బుధ వారాల్లో ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలు, భీకర ఈదురు గాలులతో సిక్కోలు అతలాకుతలమైంది.
- అతలాకుతలమైన సిక్కోలు
- 6,652 హెక్టార్లలో నీటమునిగిన పంటలు
- 378 గ్రామాల్లో 14,905 మంది రైతులకు నష్టం
- కోటబొమ్మాళి, టెక్కలి, సంతబొమ్మాళి మండలాల్లో తీవ్ర ప్రభావం
- ఉద్యాన, విద్యుత్ శాఖలకు అపార నష్టం
- కుప్పకూలిన విద్యుత్ స్తంభాలు
- ఉగ్రరూపం దాల్చుతున్న నాగావళి, వంశధార నదులు
శ్రీకాకుళం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాపై ఆర్నబ్ తుఫాన్ విరుచుకుపడింది. మంగళ, బుధ వారాల్లో ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలు, భీకర ఈదురు గాలులతో సిక్కోలు అతలాకుతలమైంది. రోడ్లు, వ్యవసాయ పొలాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రైతులను తుఫాన్ కోలుకోలేని దెబ్బ కొట్టింది. విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఉద్యానవన శాఖకు భారీ నష్టం వాటిల్లింది. జిల్లాలో కురిసిన వర్షాలకు తోడు ఎగువన ఒడిశాలో కురుస్తున్న వర్షాలతో వంశధార, నాగావళి నదులు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. గురువారం కూడా ఈదురుగాలులు, భారీ వర్షాల ప్రభావం అధికంగా ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో కలెక్టర్ అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
అన్నదాతను ముంచేసింది..
చేతికొచ్చిన పంటను తుఫాన్ ముంచేయడంతో జిల్లా రైతాంగం కన్నీరుమున్నీరవుతోంది. జిల్లాలోని 23 మండలాల్లో ఉన్న 378 గ్రామాలపై తీవ్ర ప్రభావం పడింది. మొత్తం 14,905 మంది రైతులు నష్టపోయారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 6,652.22 హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. ఇందులో అత్యధికంగా 6,641.37 హెక్టార్లలో వరికి నష్టం వాటిల్లింది. పత్తి 5.85 హెక్టార్లు, పెసర 3 హెక్టార్లు, మినుము 2 హెక్టార్లలో దెబ్బతింది. కోటబొమ్మాళి మండలంలో అత్యధికంగా 1,580 హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. టెక్కలిలో 1,249 హెక్టార్లు, సంతబొమ్మాళిలో 1,036 హెక్టార్లలో పంట దెబ్బతింది. పంటలన్నీ పూత దశ, గింజ కట్టే దశ నుంచి కోతకొచ్చిన దశలో ఉండటంతో నష్టం తీవ్రత మరింత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
విరిగిన కొబ్బరి చెట్లు.. కూలిన విద్యుత్ స్తంభాలు
ఈదురుగాలుల బీభత్సానికి ఉద్యాన, విద్యుత్ శాఖలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఉద్దాన ప్రాంతమైన కంచిలి, కవిటి, సోంపేట తదితర ప్రాంతాల్లో ఏకంగా 600 కొబ్బరి చెట్లు విరిగిపోయాయి. ఎచ్చెర్ల, కోటబొమ్మాళి, పలాస, పొందూరు మండలాల్లో 150 హెక్టార్లలో కూరయగాల పంటలు దెబ్బతిన్నాయి. మొత్తంగా ఉద్యానవన శాఖకు రూ. 15 లక్షల మేర నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. విద్యుత్ శాఖకు రూ. 35.59 లక్షల నష్టం వాటిల్లింది. ఈదురు గాలుల ధాటికి 54 (33 కేవీ) ఫీడర్లు, 70 (11 కేవీ) ఫీడర్లు దెబ్బతిన్నాయి. 124 కరెంటు స్తంభాలు నేలకూలగా, 23 ట్రాన్స్‌ఫార్మర్లు పాడయ్యాయి. దీంతో పలు గ్రామాల్లో అంధాకరం అలుముకుంది. యుద్ధప్రాతిపదికన చెట్లను తొలగించి.. మరమ్మతు పనులు చేపట్టారు.
ప్రతి రైతుకూ న్యాయం జరగాలి: మంత్రి అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): తుఫాన్‌తో జిల్లాలో వ్యవసాయ, ఉద్యానవన పంటలకు జరిగిన నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి, వాస్తవ వివరాలతో నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, అధికారులను వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. బుధవారం ఆయన నిమ్మాడలోని తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి తుఫాన్ ప్రభావం, పంటల పరిస్థితి, రైతులకు అందించాల్సిన సహాయక చర్యలపై సమీక్షించారు. పంట నష్టాన్ని సాధ్యమైనంత మేరకు తగ్గించడంతో పాటు నష్టపోయిన రైతులకు అండగా నిలిచేందుకు వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పంటల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు అందించాలని స్పష్టం చేశారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటలు, కోత కోసిన అనంతరం పొలాలు, కళ్లాల్లో ఉన్న పంట తడవకుండా రైతులకు తగిన జాగ్రత్తలు వివరించాలని పేర్కొన్నారు.