Share News

‘ఆర్నాబ్‌’ నష్టం రూ.262 కోట్లు

ABN , Publish Date - Oct 08 , 2026 | 12:17 AM

గత నెలలో సంభవించిన ‘ఆర్నాబ్‌’ తుఫాన్‌తో జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లింది.

  ‘ఆర్నాబ్‌’ నష్టం రూ.262 కోట్లు
తుఫాన్‌ సమయంలో బూర్జ మండలంలోని మదనాపురం జంక్షన్‌-అల్లెన రోడ్డు దుస్థితి ఇదీ

- ఇది కేవలం నాలుగు శాఖల పరిధిలోనే..

- అస్తవ్యస్తమైన రోడ్లు, సాగునీటి వ్యవస్థలు

- దెబ్బతిన్న ఇరిగేషన్‌, వంశధార కట్టడాలు

- ప్రభుత్వానికి నివేదికలు పంపిన అధికారులు

శ్రీకాకుళం, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): గత నెలలో సంభవించిన ‘ఆర్నాబ్‌’ తుఫాన్‌తో జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లింది. తుఫాన్‌ కారణంగా గత నెల 22 నుంచి 25 వరకు పడిన కుండపోత వర్షాల కారణంగా వంశధార, నాగావళి నదులతో పాటు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో ఎక్కడికక్కడే జనజీవనం స్తంభించింది. వరద ఉధృతికి చాలాచోట్ల రోడ్లు, వంతెనలు, ప్రాజెక్టుల కట్టలు దెబ్బతిన్నాయి. వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. రవాణా, సాగునీటి వ్యవస్థలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. రోడ్లు భవనాలు(ఆర్‌అండ్‌బీ), పంచాయతీరాజ్‌, ఇరిగేషన్‌, వంశధార ప్రాజెక్టుల పరిధిలో జరిగిన నష్టంపై ఆయా శాఖల అధికారులు సమగ్ర నివేదికలు రూపొందించారు. కేవలం ఈ నాలుగు శాఖల పరిధిలోనే సుమారు రూ.262 కోట్లకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లు క్షేత్రస్థాయి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఆర్‌అండ్‌బీ వ్యవస్థ అతలాకుతలం...

తుఫాన్‌ ప్రభావానికి జిల్లాలో ఆర్‌అండ్‌బీ వ్యవస్థ అతలాకుతలమైంది. ఏకంగా 412.36 కిలోమీటర్ల మేర రోడ్ల ఉపరితలం దెబ్బతినట్లు ఆశాఖ అధికారులు నిర్ధారించారు. వరద ఉధృతికి 45 కల్వర్టులు ధ్వంసం కాగా, రెండు చోట్ల రోడ్లు భారీగా కోతకు గురయ్యాయి. 21 చోట్ల రోడ్ల పైనుంచి వరద ప్రవహించగా, 20 ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గాలుల తీవ్రతకు 90 భారీ వృక్షాలు నేలకొరిగాయి. దెబ్బతిన్న ఈ రోడ్లు, కల్వర్టులకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టేందుకు రూ.18.67 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇక వీటికి శాశ్వత ప్రాతిపదికన పరిష్కారం చూపించి పునరుద్ధరించాలంటే ఏకంగా రూ.110.51 కోట్లు కావాలని తమ నివేదికలో పేర్కొన్నారు.

పంచాయతీరాజ్‌ రోడ్లు సైతం..

భారీ వర్షాలకు పంచాయతీరాజ్‌ రోడ్లు సైతం తీవ్రంగా దెబ్బతిన్నాయి. పంచాయతీరాజ్‌ నివేదిక ప్రకారం.. ఎన్‌హెచ్‌-16 నుంచి జద్యాడ వెళ్లే మార్గంలో కొత్తఅగ్రహారం వద్ద ఉన్న కల్వర్టు (ఇరిగే షన్‌ శాఖకు చెందినది) పూర్తిగా కుప్పకూలింది. రాయనంగారిపేట వద్ద ఉన్న కాజ్‌ వే పూర్తిగా దెబ్బతినడంతో ఆ ప్రాంతానికి రాకపోకలు నిలిచిపోయాయి. (ఇక్కడ రూ.15 కోట్లతో హైలెవల్‌ బ్రిడ్జి నిర్మించేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపారు.) రెల్లిగడ్డ వరద ప్రవాహానికి పక్కనే ఉన్న రోడ్డు కోతకు గురైంది. (ఇక్కడ శాశ్వత పునరుద్ధరణకు 300 మీటర్ల మేర ఆర్సీసీ వాల్‌ నిర్మించాల్సి ఉంది). ఇలా పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో దెబ్బతిన్న రోడ్లు, వంతెనల తాత్కాలిక పునరుద్ధరణకు రూ. 29.20 లక్షలు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. మొత్తంగా పంచాయతీరాజ్‌ శాఖకు రూ. 21.26 కోట్ల మేర నష్టం వాటిల్లింది.

ఇరిగేషన్‌కు కోలుకోలేని దెబ్బ...

జిల్లాలోని సారవకోట, కోటబొమ్మాళి, టెక్కలి, పాతపట్నం, ఇచ్ఛాపురం, కవిటి తదితర 28 మండలాల పరిధిలో మైనర్‌, మేజర్‌ ఇరిగేషన్‌కు కోలుకోలేని దెబ్బతగిలింది. ఏకంగా రూ.100.52 కోట్ల మేర నష్టం వాటిల్లింది. తుఫాన్‌తో 379 పనులు, కట్టడాలకు భారీగా నష్టం జరిగింది. చెరువుల కట్టలు తెగిపోవడం, అలుగులు ధ్వంసం కావడం, గెడ్డలకు గండ్లు పడడం వంటివి చోటుచేసుకున్నాయి. వీటిని తాత్కాలికంగా పూడ్చి రైతాంగాన్ని ఆదుకోవడానికి రూ. 13.58 కోట్లు ఖర్చవుతుందని ఇరిగేషన్‌ శాఖ అంచనా వేసింది. శాశ్వతంగా కట్టలు పటిష్టపరిచి పునరుద్ధరించ డానికి రూ.86.93 కోట్లు అవసరమని లెక్కగట్టింది.

వంశధార పరిధిలో..

వంశధార అధికారులు ప్రభుత్వానికి అందజేసిన నివేదిక మేరకు.. వివిధ డివిజన్ల పరిధిలో 84 చోట్ల కాలువలకు గండ్లు పడ్డాయి. కట్టలు కోతకు గురయ్యాయి. నరసన్నపేట మెయింటెనెన్స్‌ డివిజనల్‌ పరిధిలోనే అత్యధికంగా 60 చోట్ల నష్టం వాటిల్లగా... ఇక్కడ రూ. 10 కోట్లు అవసరమని నివేదించారు. ఆమదాలవలస డివిజన్‌-1 పరిధిలో 7 పనులకు గాను రూ.53.20లక్షలు, హిరమండలం కన్‌ స్ట్రక్షన్‌ డివిజన్‌లో 4 పనులకు రూ.55 లక్షలు, టెక్కలి మెయిన్‌ కెనాల్‌ డివిజన్‌లో 13 చోట్ల జరిగిన నష్టానికి రూ.31.60 లక్షల చొప్పున నిధుల అవసరమని ప్రాజెక్టు అధికారులు అంచనాలు రూపొందించారు. మొత్తంగా వంశధార ప్రాజెక్టు పరిధిలో సుమారు రూ. 11.39 కోట్ల మేర నష్టం జరిగింది. ప్రభుత్వ యంత్రాంగం సత్వరమే స్పందించి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తేనే జిల్లాలో ఈ వ్యవస్థలన్నీ తిరిగి గాడిలో పడే అవకాశం ఉంది.

Updated Date - Oct 08 , 2026 | 12:17 AM