Share News

ఆర్నబ్‌.. హైఅలర్ట్‌

ABN , Publish Date - Oct 28 , 2026 | 12:38 AM

Rain in Srikakulam district బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. ‘ఆర్నబ్‌’ తుఫాన్‌గా మార్పుచెందింది. మంగళవారం వేకువజాము నుంచి జిల్లావ్యాప్తంగా వర్షం కురుస్తూనే ఉంది. సంతబొమ్మాళిలో అత్యధికంగా 101.75 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అత్యధిక ప్రాంతాల్లో 60 మి.మీ వర్షపాతం నమోదైంది.

ఆర్నబ్‌.. హైఅలర్ట్‌
శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణలో నిలిచిన వర్షపునీరు

  • జిల్లావ్యాప్తంగా కుండపోత వర్షం

  • కొన్ని మీటర్లమేర ముందుకొచ్చిన సముద్రం

  • నేడు మరింత ఉధృతం

  • పరిస్థితిపై కేంద్ర, రాష్ట్రమంత్రుల ఆరా

  • లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

  • శ్రీకాకుళం, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. ‘ఆర్నబ్‌’ తుఫాన్‌గా మార్పుచెందింది. మంగళవారం వేకువజాము నుంచి జిల్లావ్యాప్తంగా వర్షం కురుస్తూనే ఉంది. సంతబొమ్మాళిలో అత్యధికంగా 101.75 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అత్యధిక ప్రాంతాల్లో 60 మి.మీ వర్షపాతం నమోదైంది. మరోవైపు ఈదురు గాలుల ప్రభావంతో జిల్లావాసుల్లో అలజడి రేగింది. గత నెల కురిసిన అకాల వర్షంతో రైతులు ఇప్పటికీ తేరుకోలేదు. తాజా తుఫాన్‌తో పొలాల్లో వర్షపునీరు చేరడంతో పంటకు ముంపు నష్టం తప్పదని భీతిల్లుతున్నారు. ఈదురుగాలుల ధాటికి ఉద్దానంలో కొబ్బరి, జీడిమామిడి, అరటి పంటలకు కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

  • బుధవారం అత్యంత భారీ వర్షాలు కురవనున్నాయని.. వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. జిల్లా అంతటా హైఅలర్ట్‌ ప్రకటించారు. బుధవారం నాటి పరిస్థితులను ఎప్పటికప్పుడు తట్టుకునేందుకు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ప్రత్యేక బృందాలను నియమించారు. మంగళవారం రాత్రి 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు జిల్లాలో ప్రజలు ఇళ్లనుంచి బయటకురావొద్దని ప్రత్యేక ప్రకటన జారీచేశారు. ప్రజలు భద్రత దృష్ట్యా వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.

  • వరద నీటి ఉధృతి

  • సముద్రం అల్లకల్లోలంగా మారి కొన్ని మీటర్ల మేర ముందుకొచ్చింది. నాగావళి, వంశధార నదుల్లో కూడా వరదనీటి ఉధృతి పెరుగుతోంది. దీంతో సముద్ర, నదీ తీర ప్రాంత వాసులు ఆందోళన చెందారు. నదీపరివాహక ప్రాంతాలను, అలాగే బూర్జ మండలం అల్లెన గ్రామంలో గతనెల ముంపునకు గురైన ప్రాంతాన్ని మరోమారు అధికారులు పరిశీలించి.. సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ప్రజలకు సూచించారు.

  • కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఆరా...

  • జిల్లాలో తుఫాన్‌ కారణంగా ఏ ఒక్క ప్రాణనష్టం సంభవించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు.. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ను ఆదేశించారు. అన్ని మండలాలు, గ్రామాల్లో అధికారులను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యలు.. మత్స్యకారులు.. రైతులకు అందించాల్సిన తక్షణ సహాయంపై శాఖలవారీగా ఆరా తీశారు. తుఫాను ప్రభావం తగ్గేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

  • నదీతీర ప్రాంతాల్లో అప్రమత్తం

  • ‘వంశధార, నాగావళి నదీ పరివాహక ప్రాంతాల్లో రాబోయే ఐదు రోజుల్లో ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. నదీ తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాల’ని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు. ప్రధానంగా ఈ నెల 28, 29 తేదీల్లో వరదనీటి ప్రవాహం గరిష్ఠస్థాయికి చేరుకోనున్నట్టు కేంద్ర జలసంఘం, నీటిపారుదల శాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయన్నారు. ఆమదాలవలస, బూర్జ, ఎచ్చెర్ల, పొందూరు, శ్రీకాకుళం, నరసన్నపేట, జలుమూరు, పోలాకి, కొత్తూరు, గార తదితర మండలాల్లో నదీ తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అత్యవసర సమాచారం లేదా సహాయం కోసం మండల, జిల్లా కేంద్రాల్లోని కం ట్రోల్‌ రూమ్‌లను సం ప్రదించాలని కోరారు.

  • నేడు విద్యాసంస్థలకు సెలవు

  • ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఇబ్బందుల దృష్ట్యా బుధవారం కూడా జిల్లాలో అన్ని విద్యాసంస్థలకు సెలవు దినంగా కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ప్రకటించారు. అంగన్‌వాడీ కేంద్రాలతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ, పీజీ కళాశాలలు తెరవరాదని స్పష్టం చేశారు.

  • మంగళవారం నమోదైన వర్షపాతం (మిల్లీమీటర్లలో):

  • --------------

  • సంతబొమ్మాళి 101.75

  • కోటబొమ్మాళి 101.25

  • నరసన్నపేట 98.5

  • జలుమూరు 92.25

  • లావేరు 91.25

  • పలాస 88.75

  • రణస్థలం 88.25

  • ఆమదాలవలస 82.31

  • శ్రీకాకుళం 82.0

  • ఎచ్చెర్ల 80.57

  • ఎల్‌.ఎన్‌.పేట 76.25

  • సరుబుజ్జిలి 75.0

  • మందస 68.25

  • గార 67.5

  • పోలాకి 66.5

  • పొందూరు 65.25

  • నందిగాం 58.75

  • జి.సిగడాం 58.25

  • టెక్కలి 58.28

  • మెళియాపుట్టి 58.0

  • కంచిలి 55.0

  • వజ్రపుకొత్తూరు 53.25

  • హిరమండలం 44.75

  • బూర్జ 41.25

  • కవిటి 40.25

  • ఇచ్ఛాపురం 38.25

  • పాతపట్నం 37.6

  • కొత్తూరు 36.46

  • సోంపేట 33.5

  • సారవకోట 33.5

Updated Date - Oct 28 , 2026 | 12:38 AM