హైదరాబాద్‌లో ఆర్మీ జవాన్ మృతి
ABN , Publish Date - Jul 27 , 2026 | 12:50 AM
ప్రమా దంలో గాయ పడి... హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందిన కొమనాపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ కనుసు శేఖర్ (37)కి స్వగ్రామంలో ఆదివారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
జలుమూరు, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ప్రమా దంలో గాయ పడి... హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందిన కొమనాపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ కనుసు శేఖర్ (37)కి స్వగ్రామంలో ఆదివారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామస్థుల కథనం మేరకు... కొమనాపల్లి గ్రామానికి చెందిన కనుసు శేఖర్ సైన్యంలో అసోంలో మెడికల్ డిపార్టుమెంట్‌లో పనిచేస్తుండేవాడు. ఇటీవల హైదరాబాద్ బదిలీ కావడంతో ఈనెల 15న కొమనాపల్లి వచ్చి 20న తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయాడు. 21న మంగళవారం విధుల్లో చేరి... తిరిగి వస్తుండగా ఆటో ఢీకొని గాయపడ్డాడు. హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 25న మృతి చెందాడు. శేఖర్ భౌతిక కాయాన్ని ఆదివారం స్వగ్రామం కొమనాపల్లికి తరలించి... అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అతనికి భార్య భార్గవి, కుమారుడు యశ్వంత్, కుమార్తె కావ్యతో పాటు తల్లిదండ్రులు అమ్మన్న, చిన్నారావు ఉన్నారు. కుటుంబాన్ని పోషించే కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. శేఖర్ మృతితో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. ఇదిలా ఉండగా...శేఖర్ మృతి విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆదివారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట సర్పంచ్ కనుసు రవి, మండల పార్టీ క న్వీనర్ బగ్గు గోవిందరావుఉ, సాధు ఉమ, గ్రామస్థులు పాల్గొన్నారు.
మూడు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లి...
విగతజీవిగా కాలువలో తేలి!
ఎల్.ఎన్.పేట/సరుబుజ్జిలి, జూలై 26 (ఆంధ్రజ్యోతి): బొర్రంపేట గ్రామానికి చెందిన గొడ్డు. సూర్యనారాయణ(43) సరుబుజ్జిలి మండలం బొప్పడాం గ్రామానికి సమీపంలోని వంశధార నది కుడి ప్రధాన కాలువలో పడి మృతిచెందాడు. గ్రామస్థులు, సరుబుజ్జిలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సూర్యనారాయణ ఈ నెల 24న బహిర్భూమికి వెళతానని తల్లి లక్ష్ముమ్మకు చెప్పి వెళ్లారు. ఎంతకూ ఇంటికి రాకపోవటంతో కుటుంబ సభ్యులు వెతికారు. అయినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం బొప్పడాం గ్రామ సమీపంలోని వంశధార నది కుడి ప్రధాన కాలువలోని గుర్రపు డెక్కల మధ్య మృతదేహం బయట పడింది. దీంతో స్థానికులు వెంటనే సరుబుజ్జిలి పోలీసులకు సమాచారమందించారు. సరుబుజ్జిలి పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీయించి...కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు మృతుడు సూర్యనారాయణగా గుర్తించారు. మృతునికి భార్య పార్వతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్యాభర్తల మధ్య కలహాల కారణంగా భామిని మండలం సింగిడి గ్రామంలోని కన్నవారింటిలో ఉంటోందని స్థానికులు తెలిపారు. సూర్యనారాయణ గ్రామంలో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవించేవాడని తెలిపారు. మృతుని తల్లి లక్ష్ముమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ చంద్రినాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.