Share News

ఆ రహదారులకు.. ‘జాతీయ’ మార్గమేదీ?

ABN , Publish Date - Jan 20 , 2026 | 12:13 AM

Roads that have not seen expansion జిల్లాలోని పలు ఆర్‌అండ్‌బీ రహదారులు వాహనాల రద్దీతో కిటకిటలాడుతున్నా.. వాటిని జాతీయ రహదారులుగా తీర్చిదిద్దడంలో కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. 2021 సెప్టెంబరులో రాష్ట్రవ్యాప్తంగా 31 రహదారులను ఎన్‌హెచ్‌(నేషనల్‌ హైవే)గా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.

ఆ రహదారులకు..  ‘జాతీయ’ మార్గమేదీ?
చిలకపాలెం- రాయఘడ రహదారి

  • విస్తరణకు నోచుకోని కళింగపట్నం, చిలకపాలెం, గార రూట్లు

  • నాలుగున్నరేళ్లుగా ప్రతిపాదనల్లోనే..

  • ప్రజలకు తప్పని ట్రాఫిక్‌ ఇబ్బందులు

  • శ్రీకాకుళం, జనవరి 19(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు ఆర్‌అండ్‌బీ రహదారులు వాహనాల రద్దీతో కిటకిటలాడుతున్నా.. వాటిని జాతీయ రహదారులుగా తీర్చిదిద్దడంలో కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. 2021 సెప్టెంబరులో రాష్ట్రవ్యాప్తంగా 31 రహదారులను ఎన్‌హెచ్‌(నేషనల్‌ హైవే)గా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఇందులో జిల్లాకు సంబంధించి కళింగపట్నం, చిలకపాలెం, గార ఆర్‌అండ్‌బీ రహదారులు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఆర్‌అండ్‌బీ రోడ్డులో ట్రాఫిక్‌ 10వేల పీసీయూ(ప్యాసింజర్‌ కార్‌ యూనిట్‌)కిపైగా ఉంటే నాలుగు లేన్లగా విస్తరించాలి. కాగా.. పై మూడు రహదారుల్లో నిబంధనలకు మించి పీసీయూ అత్యధికంగా ఉన్నా.. కేంద్రం నుంచి స్పందన కరువవుతోంది. జిల్లా నుంచి ఒడిశాకు, పశ్చిమ ప్రాంతాలకు అనుసంధానం కలిగించే ఈ రహదారులకు జాతీయ యోగం ఏళ్ల తరబడి ప్రతిపాదనలకే పరిమితమవుతోంది.

  • ట్రాఫిక్‌ ఎక్కువ.. రోడ్డు వెడల్పు తక్కువ..

  • కళింగపట్నం - రాయఘడ రోడ్డు 145 కి.మీ విస్తరించాల్సి ఉంది. కళింగపట్నం నుంచి ఆమదాలవలస, పాలకొండ, పార్వతీపురం మీదుగా రాయగడకు నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ మార్గంలో అత్యధికంగా 16,538 పీసీయూల వాహన రద్దీ నమోదైంది. రాష్ట్రం మొత్తం మీద పంపిన జాబితాలో అత్యధిక రద్దీ ఉన్న టాప్‌-2 రోడ్డు ఇదే కావడం విశేషం.

  • చిలకపాలెం- రాయఘడ రోడ్డు 100 కి.మీ. విస్తరించాల్సి ఉంది. ఎచ్చెర్ల మండలం చిలకపాలెం జంక్షన్‌ నుంచి రాజాం, రామభద్రపురం, పార్వతీపురం మీదుగా రాయగడకు ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువ. ఈ రోడ్డులోనూ 15,997 పీసీయూల వాహన రద్దీ ఉంది.

  • గార - గుణుపూర్‌ రహదారి 118 కి.మీ విస్తరించాల్సి ఉంది. గార నుంచి అలికాం, బత్తిలి మీదుగా ఒడిశాలోని గుణుపూర్‌ వరకు నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇంతటి రద్దీ ఉన్నా ఇవి ఇంకా రెండు వరుసల (కొన్ని చోట్ల సింగిల్‌) రాష్ట్ర రహదారులుగానే మిగిలిపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటితోపాటు విజయనగరం జిల్లాతో ముడిపడి ఉన్న పాలకొండ డివిజన్‌ వాసులకు కీలకమైన విజయనగరం - పాలకొండ (70.31 కి.మీ) రోడ్డు కూడా ఈ జాబితాలో ఉంది.

  • కేంద్రం కరుణిస్తేనే.. కష్టాలు తీరేది..

  • నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ ఫైలుకు మోక్షం కలిగించాల్సిన బాధ్యత ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై ఉంది. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలే అధికారంలో ఉన్నందున.. ఎంపీలు, మంత్రులు ప్రత్యేక చొరవ చూపి కేంద్రమంత్రి గడ్కరీ దృష్టికి తీసుకెళ్తే జిల్లా రహదారుల రూపురేఖలు మారుతాయి. జాతీయ రహదారులకు ఆమోదం తెలిపితే.. కేంద్ర నిధులతో కనీసం పది మీటర్ల వెడల్పుతో విస్తరిస్తారు. రద్దీ ఎక్కువగా ఉన్న చిలకపాలెం, కళింగపట్నం రూట్లను నాలుగు వరుసలుగా మార్చే అవకాశం ఉంది. ఆమదాలవలస, పాలకొండ, రాజాం వంటి పట్టణాలు, రద్దీగా ఉండే గ్రామాల మధ్య ఇబ్బంది లేకుండా బైపాస్‌లు నిర్మిస్తారు. డేంజర్‌ స్పాట్స్‌ వద్ద వంపులు సరిచేయడం, శిఽథిల వంతెనల స్థానంలో కొత్తవి నిర్మించే అవకాశం ఉంది.

Updated Date - Jan 20 , 2026 | 12:13 AM