Share News

క్యాన్సర్‌ బాధితులు తొమ్మిది మందేనా?

ABN , Publish Date - Mar 23 , 2026 | 12:17 AM

Health Department survey ‘జిల్లాలో క్యాన్సర్‌ బాధితులు కేవలం తొమ్మిది మందేనా..? ఇలాగేనా ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నార’ని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులపై మండిపడ్డారు.

క్యాన్సర్‌ బాధితులు తొమ్మిది మందేనా?
మాట్లాడుతున్న రాష్ట్ర పీయూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌

వైద్యఆరోగ్యశాఖ సర్వేపై పీయూసీ చైర్మన్‌ కూన రవి మండిపాటు

జడ్పీస్థాయీ సంఘాలకు సగం మంది అధికారులు డుమ్మా

గైర్హాజరైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

శ్రీకాకుళం, మార్చి 22(ఆంధ్రజ్యోతి): ‘జిల్లాలో క్యాన్సర్‌ బాధితులు కేవలం తొమ్మిది మందేనా..? ఇలాగేనా ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నార’ని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులపై మండిపడ్డారు. ఆదివారం జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో జడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ అధ్యక్షతన స్థాయీసంఘాల సమావేశం నిర్వహించారు. సమావేశంలో క్యాన్సర్‌ బాధితుల ప్రస్తావన రాగా.. పీయూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌ జిల్లాలో ఇంటింటా సర్వే ద్వారా ఎంతమంది క్యాన్సర్‌ బాధితులు ఉన్నట్టు గుర్తించారని ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన వైద్యఆరోగ్యశాఖ అధికారులు.. 41 శాతం ఇంటింటా సర్వే పూర్తయిందని.. తొమ్మిది మంది మాత్రమే క్యాన్సర్‌ రోగులు ఉన్నట్లు తేలిందని చెప్పారు. దీంతో సర్వే సక్రమంగా చేపట్టడం లేదంటూ రవికుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో క్యాన్సర్‌ ఆసుపత్రుల్లో ఎంతమంది బాధితులు చికిత్స పొందుతున్నారనే వివరాలను పరిశీలించి తనకు నివేదిక ఇవ్వాలని కోరారు. అలాగే ‘సహకారశాఖకు సంబంధించి 14 సొసైటీల్లో నిధులు గోల్‌మాల్‌ జరిగితే ఎందుకు చర్యలు తీసుకోలేదు. సంకిలి సొసైటీలో ఏకంగా రూ.1.73 కోట్లు నిధులు స్వాహా అయితే విచారణ చేపట్టి.. ఆడిట్‌ అధికారితో సహా మిలాఖత్‌ అవ్వడమేంట’ని సహకారశాఖ అధికారులను ప్రశ్నించారు. సెంట్రల్‌ బ్యాంక్‌, పీఏసీఎస్‌లు కలసి కొన్నిచోట్ల అక్రమాలకు పాల్పడినట్టు ఆధారాలున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. అలాగే ఈ సమావేశానికి సగం మంది అధికారులు డుమ్మా కొట్టడంతో.. గైర్హాజరైన వారిపై చర్యలకు ఉన్నతాధికారులకు లేఖలు రాయాలని డిమాండ్‌ చేశారు. జడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ మాట్లాడుతూ జిల్లాలోని అభివృద్ధి పథకాల అమలులో వేగం పెంచాలని, ప్రభుత్వ నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత పాటించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు సూచించిన పనులను ప్రాధాన్య క్రమంలో పూర్తిచేసి నివేదికలను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. సమీక్షలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌, జడ్పీ సీఈవో డి.సత్యనారాయణ, జడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2026 | 12:17 AM