Share News

రోగులు భద్రమేనా?

ABN , Publish Date - Sep 16 , 2026 | 11:33 PM

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజనాసుపత్రి(రిమ్స్‌)కి రోగుల తాకిడి అధికంగా ఉంటుంది. జిల్లా నలుమూలల నుంచి ఇక్కడకు వస్తుంటారు.

రోగులు భద్రమేనా?
ఆసుపత్రిలోని ఓ వార్డు

- రిమ్స్‌లో సమస్యల తిష్ట

- ప్రమాదాలు జరిగితే పరిస్థితి ఏంటి?

- మొరాయిస్తున్న వీల్‌చైర్లు, స్ట్రచర్లు

- వేధిస్తున ్న సిబ్బంది కొరత

- నేడు ప్రపంచ రోగి భద్రత దినోత్సవం

జిల్లాలోని చాలా ఆస్పత్రుల్లో సరైన సౌకర్యాలు లేవు. చాలీచాలని మంచాలు, విరిగిన వీల్‌చైర్లు, పని చేయని స్ట్రెచర్లే దర్శనమిస్తున్నాయి. మరుగుదొడ్లు కంపుకొడుతున్నాయి. సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది. ఇన్ని సమస్యల నడుమ రోగుల భద్రత గాలిలో దీపంలా మారుతుంది. ఆసుపత్రుల్లో వైద్యసేవలు పొందు తున్న సమయంలో మానవ తప్పిదాలవల్ల గానీ, ఇతర కారణాలతో గానీ రోగికి ఎటువంటి హాని కలగకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత యాజమాన్యాలదే. ప్రధానంగా జిల్లా పెద్దాసుపత్రి(రిమ్స్‌)లో సమస్యలు తిష్ట వేశాయి. గురువారం ప్రపంచ రోగి భద్రత దినోత్సవం సందర్భంగా కథనం.

- సోంపేటకు చెందిన లోకనాథం కాలుకు ఇన్‌ఫెక్షన్‌ కావడంతో అతని కుటుంబం బుధవారం రిమ్స్‌కు తీసుకొచ్చారు. వీల్‌చైర్‌ అవసరం కావడంతో అక్కడున్న సెక్యూరిటీని అడిగితే సమకూర్చారు. ఆ వీల్‌చైర్‌పై లోకనాథంను కూర్చొబెట్టి కుటుంబసబ్యులే తోసుకుంటూ వెళ్తుండగా అది మొరాయించింది. ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఇంకో రోగి అప్పుడే వీల్‌చైర్‌ను ఖాళీ చేయడంతో లోకనాథంను అందులోకి మార్పించడానికి నానా ఇబ్బంది పడ్డారు.

- రాజాం మండలం బొద్దాంకు చెందిన శంకర్‌ విశాఖపట్నంలోని ఓ అపార్ట్‌మెంట్‌కు పెయిం టింగ్‌ చేస్తుండగా అక్కడి నుంచి జారిపడడంతో రెండు కాళ్లు విరిగిపోయాయి. వైజాగ్‌లో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందిన తరువాత సొంతూరు వచ్చేశారు. తరువాత రిమ్స్‌లో చేరడంతో కాళ్లకు శస్త్రచికిత్స చేసి పేట్లు అమర్చారు. ఇతనిని వార్డుకు తరలించడానికి ఆయన తల్లే కొడుకుని వీల్‌చైర్‌పై కూర్చొబెట్టుకొని తోసుకుంటూ వెళ్లింది.

శ్రీకాకుళంకల్చరల్‌, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజనాసుపత్రి(రిమ్స్‌)కి రోగుల తాకిడి అధికంగా ఉంటుంది. జిల్లా నలుమూలల నుంచి ఇక్కడకు వస్తుంటారు. అయితే, ఆస్పత్రిలో రోగుల భద్రత గాలిలో దీపంగానే ఉంటుందనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల ఇక్కడ ఒక లేబరేటరీలో స్వల్ప షార్ట్‌సర్క్యూట్‌ జరిగింది. దానిని సిబ్బంది సకాలంలో గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అదే రోగుల వార్డుల్లో ఈ ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇది ఒక్కటే కాదు డ్రగ్స్‌, ఇన్‌ఫెక్షన్‌ నియంత్రణ, సురక్షిత శస్త్రచికిత్స, ఖచ్చితమైన రోగనిర్ధారణ, రక్తం, ఆక్సిజన్‌, చికిత్స, భవనం, పారిశుధ్యం, డ్రైనేజి కూడా రోగి భద్రత కిందే వస్తాయి. చికిత్సలో తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని వ్యవస్థను మెరుగుపరుచుకోవడం వంటి విషయాలను సమన్వయం చేసుకుంటూ రోగిని కాపాడుకోవాలి. రోగి భద్రతతో పాటు డాక్టర్‌, సిబ్బంది భద్రత కూడి ఇందులో ఇమిడి ఉంటుంది.

ఇదీ పరిస్థితి..

వైద్య కళాశాల సీట్లకు తగ్గ పడకలు ఆస్పత్రిలో ఉండాలి. వైద్యకళాశాలలో 200 సీట్లు ఉండడంతో దానికి అనుబంధమైన రిమ్స్‌లో 930 వరకు బెడ్‌లు ఉండాలి. కానీ, 850 వరకూ మాత్రమే ఇక్కడ ఉన్నాయి. మిగతావి మరమ్మతులకు గురయ్యాయి. దీంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఐసీయూ, సీసీయూ ఇతర ఆపరేషన్‌ థియేటర్ల దగ్గరి నుంచి రోగులను వార్డులకు తరలించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీల్‌చైర్లు వంద వరకూ ఉన్నా వీటిలో సగం పని చేయడం లేదు. ఉన్న వాటిని వినియోగించే సిబ్బంది ఒక్కరు కూడా లేరు. దీంతో ఎంఎన్‌వోలే రోగులను వీల్‌చైర్లలో వార్డులకు తరలిస్తున్నారు. ఎంఎన్‌వోలు కూడా బెడ్‌లకు తగ్గట్టులేరు. షిఫ్ట్‌కు వందమంది చొప్పున మూడు షిఫ్ట్‌లకు 300 మంది వరకు ఉండాలి. కానీ, కేవలం 27 మందే ఉన్నారు. దీంతో ఒక్కో ఎంఎన్‌వో మూడు, నాలుగు వార్డులను చూసుకోవలసి వస్తోంది. ఫలితంగా వారిపై పని భారం పడుతోంది. వీల్‌చైర్లు, స్ట్రెచర్లపై రోగులను వార్డులకు తీసుకెళ్లలేక పోతున్నారు. ఈ పరిస్థితుల్లో రోగుల అటెండర్లే దిక్కవుతున్నారు. ఇలాంటి సమయంలో రోగికి ఏదైనా జరిగితే అతని భద్రత ఏమిటన్నది ప్రశ్నార్ధకమే.

- రిమ్స్‌లో స్ట్రెచర్లు 45 వరకు ఉన్నాయి. ఇవి చాలా ఎత్తుగా ఉండడంతో వాటిపై రోగిని పడుకోబెట్టి తీసుకెళ్లడానికి ప్రయాస పడాల్సి వస్తోంది. కొందరి పేషెంట్లకు ఈ స్ట్రెచర్లు ఉపయోగపడవు. అటువంటప్పుడు స్ట్రెచర్‌కమ్‌బెడ్‌తో కూడినవి అవసరమవుతాయి. ఇవి రిమ్స్‌లో కేవలం మూడు మాత్రమే ఉన్నాయి. అదీ ఎమర్జెన్సీ దగ్గర మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రోగిని ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి వార్దుకు తరలించడానికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా ఉండడంలేదు. వార్డులకు ఆనుకొని ఉన్న కొన్ని మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉంటున్నాయి.

రిమ్స్‌లో కమిటీ..

రోగి భద్రతతో పాటు దీనితో ముడిపడే ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని సమీక్షించడానికి రిమ్స్‌లో ఒక కమిటీ ఉంది. రోగి భద్రతా నోడల్‌అధికారిగా అత్యవసర విభాగం హెచ్‌వోడీ పి.శ్రీనివాసరావు వ్యవహరిస్తున్నారు. ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. ఈ కమిటీ ప్రతీ రెండునెలలకు ఒకసారి సమావేశమవుతుందని తెలిపారు. ఎక్కడ సమస్యలు ఉన్నాయో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

Updated Date - Sep 16 , 2026 | 11:33 PM