Share News

మూలపొలంలో ఆక్వా అదుర్స్‌

ABN , Publish Date - Jan 17 , 2026 | 12:21 AM

Aquaculture ఆ గ్రామం పేరు మూలపొలం. పేరుకు తగ్గట్టు సోంపేట మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలోని గొల్లవూరు పంచాయతీ పరిధిలో ఓ మూలన ఉంది ఈ ఊరు. మహేంద్ర తనయ నదికి ఆనుకుని ఉన్న ఈ కుగ్రామంలో కేవలం 45 కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇది రాష్ట్రంలో గుర్తింపు పొందింది. ఇందుకు ప్రధాన కారణం ఆక్వా ఉత్పత్తులే.

మూలపొలంలో ఆక్వా అదుర్స్‌
మూలపొలంలో రొయ్యలసాగు చెరువు

  • పెరిగిన మత్స్య ఉత్పత్తులు

  • 36 ఎకరాల్లో సాగు

  • స్థానికులకు ఉపాధి

  • ఆనందం వ్యక్తం చేస్తున్న గ్రామస్థులు

  • సోంపేట రూరల్‌, జనవరి 16(ఆంధ్రజ్యోతి): ఆ గ్రామం పేరు మూలపొలం. పేరుకు తగ్గట్టు సోంపేట మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలోని గొల్లవూరు పంచాయతీ పరిధిలో ఓ మూలన ఉంది ఈ ఊరు. మహేంద్ర తనయ నదికి ఆనుకుని ఉన్న ఈ కుగ్రామంలో కేవలం 45 కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇది రాష్ట్రంలో గుర్తింపు పొందింది. ఇందుకు ప్రధాన కారణం ఆక్వా ఉత్పత్తులే. జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు(ఎన్‌ఎఫ్‌డీబీ).. వైరస్‌ రహిత రొయ్యల పరిశ్రమ ఏర్పాటు కోసం 2006లో ఇక్కడ వంద ఎకరాల భూమిని రైతుల నుంచి కొనుగోలు చేసింది. అయితే 18 ఏళ్ల వరకు ఎటువంటి పరిశ్రమ ఏర్పాటు చేయకుండా అధికారులు ఆ భూములను అలాగే వదిలేశారు. ఈ నేపథ్యంలో రెండేళ్ల కిందట కలెక్టర్‌, కూటమి నేతలు చొరవ తీసుకొని ఇక్కడ మత్స్యకారుల కోసం ఏదో ఒకటి చేయాలని ఆలోచన చేశారు. సముద్ర తీరానికి ఈ భూములు ఆనుకొని ఉండడం వల్ల ఇక్కడ మత్స్యసంపద పెంచి తద్వారా ఈ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఉదయ్‌ ఆక్వా ప్రైవేటు సంస్థకు లీజుకు ఇచ్చారు. ఇంటిగ్రేటెడ్‌ కోస్టల్‌ ఆక్వా కల్చర్‌ ఫెసిలిటీ సెంటర్‌ పూర్తిస్థాయిలో వినియోగంలోకి రావడంతో ఈ ప్రాంతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

  • మొదటి విడతగా 36 ఎకరాల్లో..

  • మొదటి విడతగా 36 ఎకరాల్లో ఖరీదైన రొయ్యలు, పండుగొప్పలు, చందువాలు, పీతలు పెంచేందుకు 16 చెరువులు 64 నర్సరీ ట్యాంక్‌లను ఏర్పాటు చేశారు. నాలుగు ట్యాంకుల్లో సివిడ్‌ ఉత్పత్తులు ప్రారంభించారు. ఇక్కడకు సమీపంలో ఉన్న బట్టిగల్లూరు తీరం నుంచి సముద్రపు నీరు పైపుల ద్వారా రొయ్యలు చెరువులకు నర్సరీలకు సరఫరా అవుతుంది. ఉప్పలాం పంచాయతీ పరిధిలో పలువురు మత్స్యకారులు రొయ్యల సాగు చేస్తున్నప్పటికీ మూలపొలంలో సాగు చేసే పద్ధతులు శాస్ర్తీయంగా ఉండడంతోపాటు ఇక్కడ చెరువుల్లో పెరిగే రొయ్యలు కూడా రుచిగా ఉంటున్నాయని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉత్పత్తి అవుతున్న పండుగొప్ప, చందువా, పీతలు, రొయ్యలకు మార్కెట్‌లో గిరాకీ ఎక్కువగా ఉంది. కిలో 35 కౌంట్‌ చొప్పున రొయ్యలు సాగు అవుతుండగా, పండుగొప్ప రెండు కిలోలు, పీతలు కిలోన్నర బరువుకు పెరిగాయని సైట్‌ నిర్వాహకులు చెబుతున్నారు. ఇక్కడ పరిశ్రమ కాపలాదారులుగా, ల్యాబ్‌ టెక్నీషియన్‌లుగా 22 మంది స్థానికులు పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ ఉత్పత్తులకు ఆన్‌లైన్‌లో ఉదయ్‌ ఆక్వాకు ఆర్డర్లు వస్తాయని ఇంటర్నేషనల్‌ సైట్‌ లీడ్‌ తులసీరామ్‌ తెలిపారు.

  • ఆనందంగా ఉంది..

  • ఎంఎస్‌సీ పూర్తయిన వెంటనే మూలపొలంలో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన రొయ్యల పరిశ్రమలో టెక్నీషియన్లగా తమకు ఉద్యోగాలు దొరకడం ఆనందంగా ఉందని ఎర్రముక్కాం, సోంపేట, హరిపురం ప్రాంతాలకు చెందిన కోడ కరుణ, తాటిపాకల సుప్రజ, సొర్ర తనూషా, బారువాకు చెందిన సతీష్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత చదవులకు తగ్గట్టు ఉద్యోగాలు దొరకలేదనే అసంతృప్తి తమకు లేదన్నారు. టెక్నీషియన్లుగా అనుభవం పెరిగితే భవిష్యత్‌లో మంచి అవకాశాలు దక్కించుకుంటామన్న నమ్మకం ఉందన్నారు.

  • హామీలు నెరవేర్చారు..

  • ఇక్కడ భూములు ఇచ్చిన వారికి ఉపాధి కల్పిస్తామని అప్పట్లో అధికారులు హామీ ఇచ్చారని బట్టిగళ్లూరుకు చెందిన మత్స్యకారులు సూరాడ సాకేష్‌, మాదా, కృష్ణారావు, జి.నాగేశ్వరరావు, తాతారావు చెప్పారు. ఆ హామీ మేరకు ఉదయ్‌ ఆక్వా ఇంటర్నేషనల్‌ కంపెనీ స్థానిక మత్స్యకారులకు అవకాశాలు కల్పించిందన్నారు. రోజుకు రూ.500 నుంచి రూ.900 వరకు ఆదాయం లభిస్తుండడంతో కుటుంబాలను పోషించేందుకు ఇబ్బందులు తొలగాయన్నారు. సముద్రంలో చేపలు పట్టే అలవాటు ఇక్కడ ఉపయోగ పడిందన్నారు.

  • గుర్తింపు లభించింది..

  • మా ఊరు పేరుతో ఇక్కడ మత్స్య సంపద పెంచే పరిశ్రమ ఏర్పాటు చేయడం వల్ల గ్రామానికి రాష్ట్రంలో గుర్తింపు లభించడం ఆనందంగా ఉందని మూలపొలం గ్రామస్థులు అంటున్నారు. గ్రామానికి చెందిన చాలామంది ఇక్కడ సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారని తెలిపారు.

Updated Date - Jan 17 , 2026 | 12:21 AM