అప్పలరాజు చర్యలు అమానవీయం
ABN , Publish Date - Jul 17 , 2026 | 12:05 AM
యాదవ సామాజిక వర్గానికి చెందిన దుబ్బ దానయ్య విషయంలో మాజీమంత్రి అప్పలరాజు అమానవీయంగా వ్యవహరించారని జిల్లా యాదవ సామాజిక వర్గ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుమారుడిపై ఉన్న శ్రద్ధ మృతుడిపై చూపలేదు
యాదవ సామాజిక వర్గ ప్రతినిధుల ఆగ్రహం
బాధిత కుటుంబానికి రూ.50వేల ఆర్థిక సాయం
కాశీబుగ్గ, జూలై 16 (ఆంధ్రజ్యోతి): యాదవ సామాజిక వర్గానికి చెందిన దుబ్బ దానయ్య విషయంలో మాజీమంత్రి అప్పలరాజు అమానవీయంగా వ్యవహరించారని జిల్లా యాదవ సామాజిక వర్గ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పలరాజు కుమారుడు బైక్‌తో ఢీకొనడంతో మృతి చెందిన దానయ్య కుటుంబాన్ని వారు గురువారం పరామర్శించి రూ.50వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాధ్యతాయుతమైన రాజకీయ నేతగా అప్పలరాజు వ్యవహరించలేదని మండిపడ్డారు. తన కుమారుడిపై చూపిన శ్రద్ధ మృతుడిపై చూపకపోవడం దారుణమన్నారు. ప్రజాక్షేత్రంలో ఉన్న నాయకుడికి ఇది తగునా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా యాదయ్య కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. అప్పలరాజు కుమారుడు చిన్న పిల్లోడు.. బైక్ యాక్సిడెంట్ చేసి ఎవరినో ఢీకొట్టాడని జాలి చూపించారని, కానీ మృతి చెందిన దానయ్య.. జగన్‌కు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగకపోతే పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరక్టర్ ఇప్పిలి జగదీశ్వరరావు, రాష్ట్ర బీసీ సెల్ ప్రదాన కార్యదర్శి లొడగల కామేశ్వరరావు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు కలగ జగదీశ్వరరావు, రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరక్టర్ దాసరి తాతారావు, యాదవ సంఘ నాయకులు సబ్బి జానకిరావు, కె.తాతయ్య, నరసింహనాయుడు, మురళిధర్, సప్ప నవీన్, దడియాల నరసింహులు, కొండె నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.