నేటి నుంచి ఏపీఈఏపీ సెట్
ABN , Publish Date - May 12 , 2026 | 12:42 AM
Conducting exams in four centers ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో 2026-27 విద్యా సంవత్సరంలో ప్రవేశానికిగానూ ఏపీ ఈఏపీ సెట్ మంగళవారం ప్రారంభం కానుంది. జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో ఈ నెల 12 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాలు జారీచేశారు.
జిల్లాలో నాలుగు కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు
నిమిషం ఆలస్యమైనా.. అనుమతించరు
శ్రీకాకుళం/ ఎచ్చెర్ల/ నరసన్నపేట, మే 11(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో 2026-27 విద్యా సంవత్సరంలో ప్రవేశానికిగానూ ఏపీ ఈఏపీ సెట్ మంగళవారం ప్రారంభం కానుంది. జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో ఈ నెల 12 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. శ్రీ శివానీ ఇంజనీరింగ్ కళాశాల (చిలకపాలెం), శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల (ఎచ్చెర్ల), కోర్ టెక్నాలజీ(నరసన్నపేట), ఆదిత్య ఇనిస్టిట్యూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంటు(టెక్కలి) కళాశాలను పరీక్షా కేంద్రాలుగా కేటాయించారు. మొత్తం 9,503 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. వీరిలో అత్యధికంగా ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 6,782 మంది విద్యార్థులు ఉన్నారు. అగ్రికల్చర్, ఫార్మసీకి సంబంధించి 2,701 మంది పరీక్ష రాయనున్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌కు కలిపి మరో 20 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 12,13,14,15,18 వతేదీల్లో ఇంజనీరింగ్ విద్యార్థులకు 19,20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తారు. జేఎన్‌టీయూ (కాకినాడ) పర్యవేక్షణలో టీసీఎస్ సాంకేతిక సాయంతో ప్రతి రోజు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండు షిఫ్ట్‌ల్లో పరీక్ష జరుగుతుంది. నిర్ణీత సమయానికి నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని నిర్వాహకులు తెలిపారు. హాల్‌టికెట్‌పై ఫొటో, కళాశాల ప్రిన్సిపాల్ సంతకం ఉండాలని, ఒరిజినల్ గుర్తింపుకార్డు తీసుకురావాలని సూచించారు. అలాగే కంప్యూటర్ ఆధారిత పరీక్ష కావడంతో నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. తాగునీటితోపాటు వైద్యసేవలు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసుగస్తీ సిద్ధం చేశారు.