నిధుల గోల్‌మాల్‌పై చర్యలేవీ?
ABN , Publish Date - Feb 21 , 2026 | 12:03 AM
నరసన్నపేట పట్టణంలో నాలుగేళ్ల కిందట జగనన్న వెలుగు మహిళా మార్ట్‌ను డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
- మహిళా మార్టులో రూ.23లక్షలు స్వాహా
- రెండేళ్లవుతున్నా బాధ్యులపై చర్యలు శూన్యం
- విచారణ చేపట్టి వదిలేసిన అధికారులు
- సీఎంవో, లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తామంటున్న సభ్యులు
నరసన్నపేట, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): నరసన్నపేట పట్టణంలో నాలుగేళ్ల కిందట జగనన్న వెలుగు మహిళా మార్ట్‌ను డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ మార్ట్ కోసం అధికారులు స్వయం సహాయక సభ్యులతో బలవంతంగా రూ.23లక్షల పెట్టుబడి పెట్టించారు. దీనిపై గతేడాది మార్చి 21న ‘మహిళా మార్టులో అనకొండలు’ అనేకథనం ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించింది. దీంతో అప్పట్లో ఉన్నతాధికారులు సమగ్రంగా విచారణ చేపట్టారు. కొందరు అధికారులు ఇష్టారీతిన నిధులు స్వాహా చేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో కొందరు జిల్లాస్థాయి అధికారుల పాత్ర ఉన్నట్లు తేలింది. దీంతో బాధ్యులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. ఆ తరువాత ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ వ్యవహారంలో సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి డీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. దీంతో తొలుత హడావుడి చేసిన అధికారులు.. ఆ తర్వాత మీనమేషాలు లెక్కిస్తున్నారు.
అంతా స్వాహా..
మహిళా మార్టు కోసం 2022 సెప్టెంబరులో 47 గ్రామసమాఖ్య సంఘాలకు చెందిన 22,500 మంది స్వయం సహాయక సభ్యుల నుంచి రూ.110 చొప్పున రూ.24 లక్షల షేర్ క్యాపిటల్ వసూలు చేశారు. సుమారు రూ.4లక్షలతో ఫర్నీచర్, కంప్యూటర్లు, మరో రూ.20లక్షలతో సరుకులు కొనుగోలు చేసి 2022 డిసెంబరులో మార్టును ప్రారంభించారు. ఇందులో వచ్చిన లాభాలను ప్రతి సంవత్సరం సభ్యులకు పంచుతామని అధికారులు చెప్పారు. రెండేళ్లు బాగా నడిచింది. టర్నోవర్ ద్వారా మార్టుకు రూ.12 లక్షల వరకు ఆదాయం కూడా వచ్చింది. కానీ, ఒక్క రూపాయి కూడా సభ్యులకు పంచలేదు. అయితే, ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేనాటికి మార్టులో అనకొండలు పడ్డాయి. కొందరు అధికారుల నుంచి మహిళ సమాఖ్య సభ్యుల వరకు దొరికినకాడకు దోచుకున్నారు. టర్నోవర్ సొమ్ము, సరుకుల విలువ కలిపి మొత్తం రూ.32 లక్షల వరకు ఉండాలి. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటికి రూ.4 లక్షల వరకు ట్రేడర్లకు బాకీ చూపించి చేతులు ఎత్తేశారు. ఈ వ్యవహారంపై పత్రికల్లో కథనాలు రావడంతో ఉన్నతాధికారులు సమగ్రంగా విచారణ చేపట్టి నిధులు గోల్‌మాల్ అయినట్లు గుర్తించారు. గతేడాది ఏప్రిల్‌లో మార్టును మూసివేశారు. ఏడాదిన్నర పాటు విచారణ సాగడం, ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో సభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి చొరవతో ఈ ఏడాది మార్టును పునఃప్రారంభించారు. అయితే, మరలా సభ్యుల నుంచి షేర్ మూలధనం వసూలు చేయాలని జిల్లా ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సీఎం కార్యాలయానికి ఫిర్యాదు
మహిళ మార్టు నిధుల స్వాహాపై సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేసేందుకు కొందరు స్వయం సహాయ సభ్యులు సిద్ధమవుతున్నారు. వసూలు చేసిన మూలధనం తిరిగి తమకు చెల్లించడంతో పాటు లాభాలు కూడా పంచాలని, లేదంటే మానవ హక్కుల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేస్తామని వారు అంటున్నారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని లోకాయుక్తను ఆశ్రయిస్తామని సభ్యులు చెబుతున్నారు.