ఆక్వాకు మరో షాక్!
ABN , Publish Date - Mar 09 , 2026 | 12:30 AM
Stop Aqua exports ఆక్వా రంగానికి ఏదో ఒక రూపంలో ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. కొన్నాళ్ల కిందట అమెరికాలో ట్రంప్ సుంకాల కారణంగా ఆక్వా రంగం ప్రమాదంలో పడింది. దీనిపై అమెరికా సుప్రీంకోర్టు ఆదేశాలతో సుంకాలు రద్దయ్యాయి. దీంతో అమెరికాకు ఆక్వా ఎగుమతులు ఊపందుకోగా.. ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణంతో మరోసారి ఇబ్బంది ఎదురైంది.
పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో ఇబ్బందులు
యూరప్ దేశాలకు నిలిచిన ఎగుమతులు
హర్మోజ్ జలసంధి వద్ద సంక్షోభం
ఎక్కడికక్కడే నిలిచిపోయిన కంటైనర్లు
ఆందోళనలో నిర్వాహకులు, మత్స్యకారులు
రణస్థలం, మార్చి 8(ఆంధ్రజ్యోతి): ఆక్వా రంగానికి ఏదో ఒక రూపంలో ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. కొన్నాళ్ల కిందట అమెరికాలో ట్రంప్ సుంకాల కారణంగా ఆక్వా రంగం ప్రమాదంలో పడింది. దీనిపై అమెరికా సుప్రీంకోర్టు ఆదేశాలతో సుంకాలు రద్దయ్యాయి. దీంతో అమెరికాకు ఆక్వా ఎగుమతులు ఊపందుకోగా.. ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణంతో మరోసారి ఇబ్బంది ఎదురైంది. గల్ఫ్ దేశాల మీదుగా జల రవాణా నిలిచిపోవడంతో విశాఖ పోర్టులో సీఫుడ్స్ ఉండిపోయాయి. మరికొన్ని మార్గమధ్యంలో కంటైనర్లలో నిలిచిపోయాయి. ఆ ప్రభావం జిల్లాలో ఆక్వారంగంపై పడుతోందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో రొయ్యతోపాటు ఇతర సముద్రపు ఉత్పత్తుల కొనుగోలు తగ్గడంతో తమకు నష్టాలు తప్పడం లేదని వాపోతున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో 11 తీర మండలాల్లో 4 వేల హెక్టార్లలో ఆక్వా సాగవుతోంది. 1500 మంది చేపల చెరువులు నిర్వహిస్తున్నారు. వాటిలో 10 వేల మంది వరకూ పని చేస్తున్నారు. ఏడాదికి రూ.200 కోట్ల క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. రణస్థలం, ఎచ్చెర్ల, గార, సంతబొమ్మాళి, సోంపేట, ఇచ్ఛాపురం, వజ్రపుకొత్తూరు, పోలాకి మండలాల్లో ఆక్వాలో భాగంగా చేపల చెరువులు సాగు చేస్తున్నారు. ఎక్కువగా అమెరికా, ఇతర విదేశాలకు ఇక్కడి నుంచే రొయ్యలను వ్యాపారులు కొనుగోలు చేసి ఎగుమతి చేస్తుంటారు. అమెరికాలో రొయ్యలపై 3 నుంచి 4 శాతం సుంకం మాత్రమే విధించేవారు. కాగా కొన్నాళ్ల కిందట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 26 శాతానికి సుంకాలు పెంచడంతో ఎగుమతులపై ప్రభావం చూపాయి. జిల్లాలో చేపల ధర కూడా తగ్గింది. కొన్నాళ్ల తర్వాత అక్కడి కోర్టు ఆదేశాలతో సుంకాలు రద్దయ్యాయి. దీంతో ఎగుమతులు ఊపందుకున్నాయి. కానీ ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం జరగడంతో ఎగుమతులు నిలిచిపోయాయి. గతంలో అమెరికాతోపాటు యూరప్‌కు నేరుగా ఆక్వా ఉత్పత్వులు ఎగుమతి చేసేవారు. కానీ దుబాయ్, ఖతార్‌లో అత్యాధునిక వసతులతో పోర్టులు నిర్మించడంతో యూరప్ దేశాలతోపాటు అమెరికా.. ఆ పోర్టుల మీదుగా దిగుమతి చేసుకుంటున్నాయి. కానీ ప్రస్తుతం ఇరాన్ సమీపంలో హర్మోజ్ జలసంధి వద్ద రాకపోకల నిలిపివేతతో అన్నిరకాల ఉత్పత్తుల రవాణా నిలిచిపోవడంతో తమకు మళ్లీ కష్టాలు తప్పడం లేదని ఆక్వా నిర్వాహకులు వాపోతున్నారు.
గత నెలలోనే నిషేధం ఎత్తివేత..
గత నెల మొదటి వారంలో రొయ్యల ధర పెరిగింది. యూరప్ దేశాలకు ఎగమతులు ప్రారంభమయ్యాయి. అంతకుముందు సాగులో యాంటీబయోటిక్స్ వినియోగించడంతో మన రొయ్యిని యూరోపియన్ దేశాలు నిషేధించాయి. ఈ నేపథ్యంలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అథారిటీ(ఎంపెడా) రొయ్యల సాగులో యాంటీ బయోటిక్స్ వినియోగించవద్దని రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించింది. దీంతో యాంటీ బయోటిక్స్ లేకుండా రొయ్యల సాగు చేపట్టారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో యూరోపియన్ దేశాలు మన రొయ్యను కొనుగోలు చేయడం ప్రారంభించాయి. ప్రధానంగా 60 నుంచి 70 కౌంటు రొయ్యలు బాగానే అమ్ముడయ్యాయి. అప్పటివరకూ 100 కౌంట్ ధర రూ.230 వరకూ ఉండగా.. గత నెల మొదటి వారంలో రూ.270కు పెరిగింది. టన్నుకు రూ.4 లక్షల వరకూ ఆదాయం సమకూరేది. ఇప్పుడు ఎగుమతి నిలిచిపోవడం, రవాణా స్తంభించడంతో భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. దేశీయంగా మార్కెట్, గిట్టుబాటు కల్పిస్తే తప్ప ఆక్వాకు సంక్షోభాలు విడిచే అవకాశం లేదని పేర్కొంటున్నారు. ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకచర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
దెబ్బతిన్న ఆక్వా రంగం
ఆక్వా రంగం దారుణంగా దెబ్బతింది. కోలుకుంటున్న ప్రతిసారి ఏదో ఒక గడ్డు పరిస్థితి వెంటాడుతునే ఉంది. మొన్న ట్రంప్ సుంకాల వ్యవహారం, ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పడింది. సంక్షోభాలతో పని లేకుండా దేశీయంగా మార్కెట్, రవాణా కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి.
- బసవ గోవిందరెడ్డి, రొయ్యల సాగు రైతు, కొచ్చెర్ల
దేశీయంగా మార్కెట్ కల్పించాలి
జిల్లాలో తీరప్రాంతంలోని 11 మండలాల్లో చేపల చెరువులు సాగు చేస్తున్నారు. ఇందులో మత్స్యకారులే అధికం. తీరంలో వేట గిట్టుబాటు కావడం లేదు. చేపల చెరువులతో ఉపాధి పొందుతామన్నా.. వీలులేకుండా పోతోంది. అందుకే ఆక్వా ఉత్పత్తులకు దేశీయంగా మార్కెట్ కల్పించాలి. గిట్టుబాటు ధరను ప్రభుత్వమే ప్రకటించాలి.
- దుమ్ము అశోక్, మత్స్యకార నాయకుడు, జీరుపాలేం