Share News

మరో సైబర్‌ మోసం

ABN , Publish Date - Mar 20 , 2026 | 12:26 AM

Retired DMHO caught in 'digital arrest' జిల్లాకేంద్రంలో మరో భారీ సైబర్‌ మోసం వెలుగుచూసింది. ‘డిజిటల్‌ అరెస్ట్‌’ పేరుతో సైబర్‌ కేటుగాళ్లు ఓ విశ్రాంత ఉన్నతాధికారిని బురిడీ కొట్టించి అక్షరాలా రూ.56 లక్షలు కాజేశారు.

మరో సైబర్‌ మోసం

‘డిజిటల్‌ అరెస్ట్‌’ వలలో విశ్రాంత డీఎంహెచ్‌వో

ముంబై పోలీసులమంటూ కేటుగాళ్ల బెదిరింపులు

హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ కేసులో ఇరికిస్తామంటూ బ్లాక్‌మెయిల్‌

‘సెక్యూరిటీ బాండ్‌’ పేరిట దఫదఫాలుగా రూ.56 లక్షల దోపిడీ

శ్రీకాకుళం టూటౌన్‌ పీఎస్‌లో కేసు నమోదు

శ్రీకాకుళం, మార్చి 19(ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రంలో మరో భారీ సైబర్‌ మోసం వెలుగుచూసింది. ‘డిజిటల్‌ అరెస్ట్‌’ పేరుతో సైబర్‌ కేటుగాళ్లు ఓ విశ్రాంత ఉన్నతాధికారిని బురిడీ కొట్టించి అక్షరాలా రూ.56 లక్షలు కాజేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం నగరంలోని పీఎన్‌ కాలనీకి చెందిన విశ్రాంత జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కృష్ణమోహన్‌ ఈ సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుకుని భారీ మూల్యం చెల్లించుకున్నారు. సైబర్‌ నేరగాళ్లు కృష్ణమోహన్‌కు ఫోన్‌ చేసి తాము ముంబై పోలీసులమని పరిచయం చేసుకున్నారు. ‘‘మీకు హ్యూమన్‌ ట్రాఫికింగ్‌(మానవ అక్రమ రవాణా) ముఠాతో సంబంధాలు ఉన్నాయి. మీపై కేసు నమోదైంది. మిమ్మల్ని డిజిటల్‌ అరెస్ట్‌ చేస్తున్నాం’’ అంటూ తీవ్రస్థాయిలో బెదిరించారు. తనకు అలాంటి వారితో ఎలాంటి సంబంధం లేదని, తాను ఎలాంటి తప్పు చేయలేదని కృష్ణమోహన్‌ ఎంత మొత్తుకున్నా వారు వినిపించుకోలేదు. ఈ కేసు నుంచి బయటపడాలంటే ‘సెక్యూరిటీ బాండ్‌’ కింద వెంటనే నగదు చెల్లించాల్సిందేనని, లేకపోతే అరెస్ట్‌ చేసి జైలుకు పంపుతామని భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో ఆందోళనకు గురైన కృష్ణమోహన్‌.. వారు చెప్పిన విధంగా గత ఏడాది డిసెంబరు 17 నుంచి పలు దఫాలుగా బ్యాంక్‌ ఖాతాలకు నగదు బదిలీ చేశారు. ఇలా ఏకంగా రూ.56 లక్షల వరకు సైబర్‌ నేరగాళ్లు సూచించిన ఖాతాల్లో జమ చేశారు.

కుటుంబ సభ్యుల ఆరాతో వెలుగులోకి..

కొద్దిరోజులపాటు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన బాధితుడు, చివరకు తన భార్యకు తెలియజేశారు. కుటుంబ సభ్యులు అప్రమత్తమై దీనిపై ఆరా తీయగా.. ముంబైలో ఎలాంటి కేసు లేదని, ఇది పూర్తిగా ‘డిజిటల్‌ అరెస్ట్‌’ పేరుతో దేశవ్యాప్తంగా జరుగుతున్న మోసమని నిర్ధారించుకున్నారు. వెంటనే జాతీయ సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 1930కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు. అనంతరం బాధితుడు కృష్ణమోహన్‌ శ్రీకాకుళం టూటౌన్‌ పోలీసులను ఆశ్రయించారు. సైబర్‌ మోసంపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు టూటౌన్‌ ఎస్‌ఐ మధుసూదనరావు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

‘పోలీసులు, సీబీఐ, ఈడీ లేదా కస్టమ్స్‌ అధికారులమని చెప్పి ఫోన్లో బెదిరిస్తూ డబ్బులు అడిగితే ఎవరూ స్పందించవద్దు. భారత చట్టాల్లో ‘డిజిటల్‌ అరెస్ట్‌’ అనే విధానమే లేదు. ఎవరైనా ఫోన్లో లేదా వీడియో కాల్‌లో బెదిరించి డబ్బులు డిమాండ్‌ చేస్తే భయపడకుండా వెంటనే స్థానిక పోలీసులకు కానీ, 1930 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు కానీ ఫిర్యాదు చేయాల’ని పోలీసులు సూచించారు.

Updated Date - Mar 20 , 2026 | 12:26 AM