Share News

నేడే ‘అన్నదాత సుఖీభవ’

ABN , Publish Date - Jun 20 , 2026 | 12:36 AM

కూటమి ప్రభుత్వం ఈ ఏడాదికి సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లోకి శనివారం మొదటి విడత నగదు జమచేయనుంది.

నేడే ‘అన్నదాత సుఖీభవ’

- రైతుల ఖాతాల్లోకి నిధులు

- ఒక్కొక్కరికి రూ.7వేలు జమ చేయనున్న ప్రభుత్వం

- జిల్లాలో 2,79,100 మందికి లబ్ధి

- ఏర్పాట్లు పూర్తిచేసిన యంత్రాంగం

నరసన్నపేట, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఈ ఏడాదికి సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లోకి శనివారం మొదటి విడత నగదు జమచేయనుంది. ఈ మేరకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పెట్టుబడి సాయంగా పీఎం కిసాన్‌-అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు రూ.20 వేలు అందజేస్తున్నాయి. మొదటి విడతగా కేంద్రం రూ.2 వేలు, రాష్ట్ర సర్కారు రూ.5 వేలు చొప్పున మొత్తం రూ.7వేలు జమ చేయనున్నాయి. ఈ మేరకు జిల్లాలో 2,79,100 మంది రైతులకు రూ.183 కోట్లు విడుదల చేయనున్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.139 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వం రూ.44 కోట్లు మంజూరు చేయనున్నాయి. మొత్తంగా మూడు విడతలుగా రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ కింద రూ.6 వేలు, అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.14 వేలు జమ కానుంది. ఈ సందర్భంగా నియోజవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, కీలక ప్రజాప్రతినిధులతో సభలతోపాటు రైతుసేవాకేంద్రం స్థాయిలో రైతులతో సమావేశాల నిర్వహణకు వ్యవసాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం: మంత్రి అచ్చెన్న

కోటబొమ్మాళి, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): ‘అన్నదాతకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. సాగు పెట్టుబడి కష్టాల నుంచి రైతును గట్టెక్కించేందుకు ప్రవేశ పెట్టిన అన్నదాత సుఖీభవ పథకానికి శ్రీకారం చుట్టింది.’ అని రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్‌ సీజన్‌కు ముందే రైతులకు అండగా నిలిచేందుకు తొలివిడత నిధులను విడుదల చేస్తుందని, శనివారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో ఈ నిధులను జమచేయనున్నారని తెలిపారు. రైతులకు కేవలం పెట్టుబడి సాయమే కాకుండా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం పలు రాయితీలను అమల్లోకి తెచ్చిందన్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉచితంగా బిందు, తుంపర్ల సేద్యం యూనిట్లను పంపిణీ చేసేందుకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలిపారు.

Updated Date - Jun 20 , 2026 | 12:36 AM