Share News

ఆదుకుంటున్న అన్న క్యాంటీన్లు

ABN , Publish Date - Apr 03 , 2026 | 12:20 AM

Hotels closing down.. prices rising ఇరాన్‌-ఇజ్రాయెల్‌, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా గ్యాస్‌ నిల్వలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ దెబ్బకు వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో.. జిల్లాలో హోటళ్ల రంగం కుదేలైంది.

ఆదుకుంటున్న అన్న క్యాంటీన్లు

యుద్ధం నేపథ్యంలో జిల్లాలో గ్యాస్‌ కొరత

మూతపడుతున్న హోటళ్లు.. పెరిగిన ధరలు

ఆందోళనలో సామాన్య ప్రజలు

అండగా నిలుస్తున్న ప్రభుత్వ క్యాంటీన్లు

శ్రీకాకుళం, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): ఇరాన్‌-ఇజ్రాయెల్‌, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా గ్యాస్‌ నిల్వలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ దెబ్బకు వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో.. జిల్లాలో హోటళ్ల రంగం కుదేలైంది. గ్యాస్‌ దొరక్క, బ్లాక్‌ మార్కెట్‌ ధరలు భరించలేక వందలాది హోటళ్లు మూతపడ్డాయి. కొన్ని హోటళ్లలో కట్టెలపొయ్యితో వంటలు సాగిస్తున్నా.. నిర్వహణ భారం పేరిట ధరలు పెంచేశారు. ఈ కష్టకాలంలో పేద, మధ్యతరగతి ప్రజల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘అన్న క్యాంటీన్లు’ ఆదుకుంటున్నాయి.

ఇదీ పరిస్థితి

జిల్లా కేంద్రానికి ప్రతిరోజూ సుదూర ప్రాంతాల నుంచి వేలాదిమంది జనం వస్తుంటారు. విద్యార్థులు, చిరు వ్యాపారులు, ఆసుపత్రిలకు వచ్చే రోగుల బంధువుల, చిరుద్యోగులు, అసంఘటితరంగ కార్మికులు.. ఉదయం అల్పాహారానికి, మధ్యాహ్న భోజనానికి హోటళ్ల పైనే ఆధారపడతారు. కాగా గ్యాస్‌ కొరత కారణంగా చాలా హోటళ్లలో దోశ వేయడం నిలిపేశారు. భోజనంలో కూరలు కూడా సగానికి సగం తగ్గించేశారు. ధరలు మాత్రం పెంచేయడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లా కేంద్రంలోనే కాకుండా మండల కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో చాలామంది అందుబాటులో ఉన్న అన్న క్యాంటీన్లను ఆశ్రయిస్తున్నారు. కేవలం రూ.5 చెల్లించి కడుపునిండా భోజనం చేస్తున్నారు. గ్యాస్‌ కష్టాల దెబ్బకు.. ఉదయం టిఫిన్‌ మొదలుకుని మధ్యాహ్నం భోజనం వరకు అన్న క్యాంటీన్లకు వచ్చే వినియోగదారుల సంఖ్య అమాంతం పెరిగింది. రద్దీకి తగ్గట్టుగానే ప్రతి ఒక్కరికి భోజనం అందేలా నిర్వాహకులు పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళంలో రెండు అన్న క్యాంటీన్లు ఉండగా.. ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ, టెక్కలి తదితర ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు విజయవంతంగా నడుస్తున్నాయి. మార్చి నెలలో 37,625 మందికి అల్పాహారం, 45,741 మందికి మధ్యాహ్న భోజనం, 11,677 మందికి రాత్రి భోజనాన్ని నిర్వాహకులు పెట్టారు. గ్యాస్‌ కష్టాల వేళ.. అన్నక్యాంటీన్లలో భోజనం చేసేవారి సంఖ్య మరింత పెరుగుతోందని వారు చెబుతున్నారు.

అన్న క్యాంటీన్‌.. వరం

నేను రోజువారీ పనుల కోసం పల్లెటూరి నుంచి శ్రీకాకుళం వస్తుంటాను. ఇప్పుడు హోటళ్లలో భోజనం రేట్లు చూస్తే భయమేస్తోంది. రోజుకు రూ.100 పెట్టి భోజనం చేసే స్థోమత మాకు లేదు. ఈ కష్టకాలంలో ఐదు రూపాయలకే కడుపునిండా నాణ్యమైన అన్నం పెడుతున్న అన్య క్యాంటీన్‌ మా లాంటోళ్లకు దేవుడిచ్చిన వరం లాంటిది

- ఎస్‌.రాములు, దినసరి కూలీ

బయట టిఫిన్‌ చేసే పరిస్థితి లేదు! :

శ్రీకాకుళంలో తోపుడు బండి మీద వస్తువులు అమ్ముకుని బతుకుతున్నాను. గ్యాస్‌ లేదని హోటళ్లలో దోశలు వేయడం మానేశారు. ఇడ్లీ, పూరీ రేట్లు డబుల్‌ చేసేశారు. బయట టిఫిన్‌ చేయాలంటేనే జేబులు ఖాళీ అయిపోతున్నాయి. ఇప్పుడు రోజు ఉదయం, మధ్యాహ్నం అన్న క్యాంటీన్‌ దగ్గరే నా భోజనం. ఐదు రూపాయలకే కడుపు నిండుతుండటంతో పస్తుల బాధ తప్పింది.

- కె.అప్పన్న, చిరు వ్యాపారి

Updated Date - Apr 03 , 2026 | 12:20 AM