Share News

ఏజెన్సీలో రక్తహీనత

ABN , Publish Date - Sep 01 , 2026 | 12:15 AM

No Nutrition among tribals జిల్లాలో పౌష్టికాహార లోపం, రక్తహీనత సమస్యలతో అధికశాతం మంది ప్రజలు బాధపడుతున్నారు. ఏజెన్సీలో రక్తహీనత అధికంగా ఉండడంతో మాతాశిశు మరణాలు తరచూ సంభవిస్తున్నాయి. గిరిజన ప్రాంతాల్లో గర్భిణులు, బాలింతలకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా సక్రమంగా పౌష్టికాహారం అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

ఏజెన్సీలో రక్తహీనత
మెళియాపుట్టి : అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులు

  • గిరిజనుల్లో పౌష్టికాహార లోపం

  • అవగాహనలేక ఇళ్ల వద్ద ప్రసవాలపై ఆసక్తి

  • ఆస్పత్రులకు వెళ్లేందుకు వెనుకంజ

  • నేటి నుంచి జాతీయ పౌష్టికాహార వారోత్సవాలు

  • మెళియాపుట్టి మండలం బాణాపురం పంచాయతీ జగన్నాఽథపురం గ్రామానికి చెందిన ఓ గిరిజన మహిళ కొన్నాళ్ల కిందట గర్భం దాల్చింది. పౌష్టికాహార లోపం కారణంగా గర్భంలోనే శిశువు మృతి చెందింది. ఇదే మండలం రింపి గ్రామంలోనూ ఇటీవల ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. 18 ఏళ్లకే పెళ్లయిన ఓ గిరిజన యువతి గర్భం దాల్చగా తీవ్ర రక్తహీనతతో బాధపడింది. దీంతో గర్భంలోనే శిశువు మృతి చెందింది.

  • మెళియాపుట్టి, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పౌష్టికాహార లోపం, రక్తహీనత సమస్యలతో అధికశాతం మంది ప్రజలు బాధపడుతున్నారు. ఏజెన్సీలో రక్తహీనత అధికంగా ఉండడంతో మాతాశిశు మరణాలు తరచూ సంభవిస్తున్నాయి. గిరిజన ప్రాంతాల్లో గర్భిణులు, బాలింతలకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా సక్రమంగా పౌష్టికాహారం అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది సూపర్‌వైజర్లు అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

  • జిల్లాలో 16 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 3,385 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటి ద్వారా 75,187 మంది చిన్నారులకు, 9,908 మంది గర్భిణులకు, 9,821 బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. ప్రతినెలా గర్భిణులకు బాలసంజీవని కిట్‌తోపాటు 3కిలోల బియ్యం, కిలో కందిపప్పు, అరకేజీ నూనె, ఐదు లీటర్ల పాలు, 30 కోడిగుడ్లు పంపిణీ చేస్తున్నారు. కానీ, గిరిజనులకు అవగాహన లేక వీటిని సరిగా తినక పోవడంతో.. రక్తహీనత, పౌష్టికాహార లోపం కనిపిస్తోంది. అధికంగా గర్భిణులు, చిన్నారుల్లో రక్తం తగ్గుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల జిల్లాలో 5 నుంచి 9 ఏళ్లలోపు చిన్నారులు 42,706 మందికి వైద్యఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్యపరీక్షలు చేయగా.. 14,002 మంది రక్తహీనతతో బాధపడుతున్న తేలింది.

  • గిరిజన ప్రాంతాల్లో మాతాశిశు మరణాలు తగ్గించాలనే ఉద్దేశంతో టీడీపీ ప్రభుత్వ హయాంలో గర్భిణుల వసతిగృహాలు ఏర్పాటు చేశారు. దూరప్రాంతాల్లో గర్భిణులను ఇక్కడకు తీసుకువచ్చి వసతితోపాటు వైద్యసేవలు అందించేలా చర్యలు చేపట్టారు. కానీ, అవగాహన లేక వసతిగృహాలకు ఎవరూ వెళ్లడంలేదు. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. చాలామంది గిరిజనులు ఇప్పటికీ ఇళ్ల వద్ద ప్రసవాలకే మొగ్గు చూపుతున్నారు. ఆస్పత్రులకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో ప్రసవాల సమయంలో కొన్నిసార్లు మాతాశిశు మరణాల ఘటనలు సంభవిస్తున్నాయి. యుక్తవయసు రాకుండానే కొంతమందికి వివాహాలు చేయడం, ఆపై గర్భం దాల్చడంతో పలువురు అనారోగ్యం బారిన పడుతున్నారు.

  • తల్లిపాలు మేలు..

  • నవజాత శిశువుల సగటు బరువు సాధారణంగా 2.5 నుంచి 3.5 కిలోల మధ్య ఉండాలి. 3 నెలల వయసులో సుమారు 5 నుంచి 6 కిలోలు. 6 నెలల వయసులో దాదాపు 7 నుంచి 8 కిలోలు. 9 నెలల వయసులో 9 కిలోలు.. ఏడాదికి పది కిలోల బరువు ఉండాలి. కాగా చాలామంది శిశువులు నిర్ణీత బరువు లేక అనారోగ్యంతో బాధపడుతున్నారు. ‘బిడ్డ పుట్టిన అరగంట లోపలే తల్లిపాలు పెట్టాలి. తల్లిపాలు బిడ్డకు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. ఆరునెలలు తర్వాత తల్లిపాలతో పాటు అదనపు ఆహరం ఇవ్వాలి. తల్లిపాలు తాగితే సులభంగా జీర్ణం అవుతుంది. విరోచనాలు, న్యూమోనియా వంటి వ్యాధులకు దూరంగా ఉంటారు. ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలు తగ్గుతాయి. పిల్లలతోపాటు తల్లులకు ప్రయోజనమే. రొమ్ము, అండాశయం క్యాన్సర్‌ ముప్పు తగ్గుతుంద’ని వైద్యులు చెబుతున్నారు.

  • ఆహరపు అలవాట్లు మారాలి

  • సరైన పౌష్టికాహారం తీసుకోకపోతే గర్భిణులకు అనారోగ్య సమస్యలు తప్పవు. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. పాలు, ఆకుకూరలకు ప్రాధాన్యమివ్వాలి. పుట్టిన చిన్నారులకు తల్లిపాలు ఇవ్వడం తల్లీబిడ్డకు శ్రేయస్కరం.

    - వేణుగోపాలరావు, చిన్నపిల్లల వైద్యుడు, పాతపట్నం

  • అదనంగా పౌష్టికాహారం

  • పట్టణ ప్రాంతాలకన్నా ఐటీడీఏ సబ్‌ప్లాన్‌ మండలాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో గిరిజనులకు అదనంగా పౌష్టికాహారం అందజేస్తున్నాం. బెల్లం, వేరుశనగ పలుకుల చక్కీ, ఎండు ఖర్జూరం, అటుకులు, రాగిపిండి, పాలు, గుడ్లు పంపిణీ చేస్తున్నాం. పౌష్టికాహార లోపం, రక్తహీనత నివారణకు చర్యలు చేపడుతున్నాం.

    - అమరావతి, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌, మెళియాపుట్టి

Updated Date - Sep 01 , 2026 | 12:15 AM