Share News

ఆంధ్రా ఇసుక ఒడిశాకు

ABN , Publish Date - Aug 21 , 2026 | 12:35 AM

Sand transportation to Odisha using tippers and tractors ఆంధ్రా- ఒడిశా సరిహద్దులో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. హిరమండలం, కొత్తూరు మండలాల్లో అధికంగా వంశధార నదిలో రేవుల నుంచి ట్రిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా ఒడిశాకు ఇసుక అక్రమంగా తరలిపోతోంది. ఇక్కడ ఉచిత ఇసుక విధానం అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది.

ఆంధ్రా ఇసుక ఒడిశాకు
మెళియాపుట్టి, పాతపట్నం మీదుగా ఒడిశాకు తరలిస్తున్న ఇసుక

  • టిప్పర్లు, ట్రాక్టర్లతో తరలింపు

  • సరిహద్దులో ఇసుక దొంగలు

  • కొందరు నాయకుల పేరిట పబ్బం

  • అధికారులు, పోలీసులదీ ప్రేక్షకపాత్ర

  • వంశధారలో యథేచ్ఛగా తవ్వకాలు

  • మెళియాపుట్టి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): ఆంధ్రా- ఒడిశా సరిహద్దులో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. హిరమండలం, కొత్తూరు మండలాల్లో అధికంగా వంశధార నదిలో రేవుల నుంచి ట్రిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా ఒడిశాకు ఇసుక అక్రమంగా తరలిపోతోంది. ఇక్కడ ఉచిత ఇసుక విధానం అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. కొత్తూరు మండలంలోని పొన్నుటూరు, కడుమ, గ్రామాల సమీపంలో వంశధార నదీ తీరం నుంచి ఆంధ్రా- ఒడిశా ప్రాంతాలకు ఇసుక తరలిస్తున్నారు. సిరుసవాడ, కుంటిభద్ర, వసప, అంగూరు, మదనపురం, నివగాం, మాతల తీర గ్రామాల నుంచి అధికంగా ట్రాక్టర్లు ద్వారా ఇసుకను ఒడిశాకు రవాణా చేస్తున్నారు. హిరమండలంలో గొట్టాబ్యారేజీ దిగువన జోరుగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. సమీప తోటల్లో నిల్వలు చేసి.. ట్రాక్టర్లు, టిప్పర్లతో రవాణా సాగిస్తున్నారు. కొత్తూరు మండలం నుంచి అడ్డుబంగి వైపుగా కొన్ని వాహనాల ద్వారా రాణిపేట, పదుపురం, గుమ్మ వరకు ఇసుక తరలిస్తున్నారు. హిరమండలం నుంచి పాతపట్నం-పర్లాఖిమిడికి అక్రమ రవాణా సాగిస్తున్నారు. మెళియాపుట్టి మీదుగా పట్టుపురం జంక్షన్‌ నుంచి గారబంద వైపు ప్రతిరోజు తరలిస్తున్నారు. ఇటీవల ఒడిశాకు చెందిన మైనింగ్‌ అధికారులు.. ఆంధ్రాకు చెందిన టిప్పర్లను అడ్డుకుని.. అపరాధ రుసుం విధించారు. కాగా ఒడిశాకు చెందిన కొంతమంది ట్రాక్టర్లు, టిప్పర్ల యాజమానులు.. అక్కడ కొంతమంది పోలీసులు, రెవెన్యూ అధికారులకు మామూళ్లు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈక్రమంలో ఇసుక అక్రమ రవాణాను కొన్ని సందర్భాల్లో చూసీచూడనట్టు వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

  • ఒడిశాలో అధిక డిమాండ్‌

  • ప్రస్తుతం ఒడిశా వర్షాలు లేవు. మహేంద్రతనయతో పాటు కాశీనగర్‌ వద్ద వంశధార, నేరడి వద్ద ఇసుక నిల్వలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఆంధ్రా ఇసుకపై ఆధారపడుతున్నారు. అక్కడ రోడ్లు, ఇళ్ల నిర్మాణానికి ఇక్కడ నుంచి ఇసుక రవాణా చేస్తున్నారు. ట్రాక్టర్‌ ఇసుకలోడు రూ.15వేలు, టిప్పర్‌లోడు రూ.50వేలకుపైగా విక్రయిస్తున్నారు. కొంతమంది అధికార పార్టీ నాయకుల పేరు చెబుతూ.. ఇసుకను సరిహద్దు దాటిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయమై మెళియాపుట్టి తహసీల్దార్‌ బి.పాపారావు వద్ద ప్రస్తావించగా.. ‘మెళియాపుట్టి మీదుగా ఒడిశాకు ఇసుక తరలిస్తే చర్యలు తీసుకుంటాం. గతంలో కొన్ని ఇసుక ట్రాక్టర్లు పట్టుకుని కేసులు నమోదు చేశాం. ఇసుక అక్రమ రవాణాపై మరింత నిఘా పెడతామ’ని తెలిపారు.

  • నగరంలోనే ఇళ్లమధ్య ఇసుక పోగులు

  • శ్రీకాకుళం అర్బన్‌: ఇసుక రీచ్‌ను తలపించేలా నగరంలోని బ్యాంకర్స్‌ కాలనీ ఐదో లైన్‌ వద్ద భారీగా ఇసుక నిల్వలు కనిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలించి ప్రైవేటు స్థలంలో నిల్వచేసి విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఉచితంగా ఇసుక అందిస్తామని ప్రకటించింది. ఈ విధానాన్ని కొందరు దళారులు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. నదీ తీరాల్లోని రీచ్‌ల నుంచి ఇసుకను తరలించి నిల్వచేసి భవన నిర్మాణదారులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. శ్రీకాకుళం రూరల్‌ మండలం గూడెం గ్రామానికి చెందిన వ్యక్తి రీచ్‌ల నుంచి ఇసుకను తరలించి బ్యాంకర్స్‌ కాలనీలోని ఓ ప్రైవేటు స్థలంలో నిల్వ చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. భవన నిర్మాణదారుల నుంచి ఆర్డర్లు వచ్చినప్పుడు ఈ ఇసుకను విక్రయిస్తున్నారని వారు చెబుతున్నారు. కొన్ని రోజులుగా ఇసుక నిల్వలు అక్కడే ఉన్నా సంబంధిత సచివాలయ సిబ్బంది, వీఆర్వో, ఇతర అధికారులు కూడా పట్టించుకోకపోవడంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Aug 21 , 2026 | 12:35 AM