ఆ కేసులో నిష్పాక్షిక దర్యాప్తు
ABN , Publish Date - Jul 20 , 2026 | 12:24 AM
మందస మండలం పితా తోలి జంక్షన్ వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంపై సామాజిక మాద్యమాలు, కొన్ని పత్రికల్లో వస్తున్న వదంతులను ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తీవ్రంగా ఖండించారు.
పక్కా సాంకేతిక ఆధారాలతో విచారణ
మందస రోడ్డు ప్రమాదంపై తప్పుడు ప్రచారం తగదు
అవాస్తవాలతో పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బ తీయొద్దు
వాస్తవాలు వెల్లడించిన ఎస్పీ మహేశ్వరరెడ్డి
శ్రీకాకుళం క్రైమ్, జూలై 19(ఆంధ్రజ్యోతి): మందస మండలం పితా తోలి జంక్షన్ వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంపై సామాజిక మాద్యమాలు, కొన్ని పత్రికల్లో వస్తున్న వదంతులను ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఎలాంటి ఒత్తిళ్లు తలొగ్గకుండా, నిష్పాక్షికంగా, సాంకేతిక ఆధారాలతోనే దర్యాప్తు నిర్వహించారని స్పష్టం చేశారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన విలేకరులకు ఈ వివరాలు వెల్లడించారు.
ప్రమాదం జరిగిందిలా..
జూలై 13న పెద్దలోహరిబందకు చెందిన మురపాల తులసమ్మ(43), తన అక్క కుమారుడు నర్తు వెంకటరమణతో కలిసి ద్విచక్ర వాహనంపై మందస వెళ్లి పనులు ముగించుకుని తిరిగి వస్తున్నారు. మధ్యాహ్నం 1.45 గంటలకు మందస- హరిపురం బీటీ రోడ్డులో పితాతోలి బస్టాండ్ వద్ద ఎదురుగా వచ్చిన ఎరుపు రంగు లగేజీ ఆటో డ్రైవర్. అతివేగంగా.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో తులసమ్మ తల, ముక్కు భాగంలో గాయాలు కాగా, బైక్ నడుపుతున్న వెంకటరమణ తలకు, ఎడమ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ గుడ్డిభద్ర సునీల్.. క్షతగాత్రులను తన ఆటోలోనే హరిపురం సీహెచ్‌సీకి తరలించాడు. అక్కడి నుంచి వెంకటరమణను మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం మెడికవర్‌కు తరలించారు. ఈ ఘటనపై 13 తేదీ సాయంత్రం 4 గంటలకు ముందస పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 106/2026గా బీఎన్‌ఎస్ సెక్షన్లు 125(ఏ), 125(బి) కింద ప్రాథమిక కేసు నమోదైంది.
చికిత్స పొందుతూ మృతి.. సెక్షన్ల మార్పు..
మెడికవర్‌లో చికిత్స పొందుతున్న వెంకటరమణను జూలై 14న డిశ్చార్జ్ చేసి అదేరోజు సాయంత్రం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి 9.15 గంటలకు అతను మృతి చెందాడు. మృతుడి భార్య నర్తు రోజా (అలియాస్ నర్సిమి రోజా) ఫిర్యాదు మేరకు పోలీసులు జూలై 15న ఉదయం 7 గంటలకు కేసులో బీఎన్‌ఎస్ సెక్షన్ 106(1)ను చేర్చి కేసును ఆల్టర్ చేశారు. మందసకు చెందిన గుడ్డిభద్ర సునీల్ ఈ ఆటోను నడిపినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
సీసీటీవీ, కాల్ డేటాతో ఆధారాలు ఇవే..
ఈకేసు దర్యాప్తులో మందస పోలీసులు ప్రత్యక్షసాక్షుల వాంగ్మూలాలతో పాటు సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటాను విశ్లేషించారు. సీసీటీవీ ఫుటేజీల ప్రకారం.. ఆటో డ్రైవర్ సునీల్ కాశీబుగ్గ నుంచి బయలుదేరి, కోసంగిపురం సిమెంట్ ఇటుకల పరి శ్రమ వద్దకు చేరుకుని, అక్కడి నుంచి జాతీయ రహదారిపై ప్రవేశించి.. పితాతోలి జంక్షన్‌కు చేరుకున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే అతడు గార కృష్ణ అనే వ్యక్తి కి రెండుసార్లు ఫోన్ చేశాడు. గార కృష్ణ ఉదయం నుంచే మందసలో ఉన్నాడని, సునీల్ ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చిన తర్వాతే (మధ్యాహ్నం 1.55 గంటలకు) హరిపురం ఆస్పత్రికి చేరుకున్నాడని సీడీఆర్ ఆధారంగా దర్యాప్తులో తేలింది.
పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దు
వాస్తవాలు వక్రీకరించి ప్రచారంచేయడం, పోలీసుల విధినిర్వహణపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని ఎస్పీ హితవుపలికారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజలను తప్పుదోవ పట్టించినట్లు అవుతుందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మవద్దని, అధికారిక సమాచారాన్ని విశ్వసించాలని విజ్ఞప్తి చేశారు.