ముంచుకొస్తున్న తుఫాన్
ABN , Publish Date - Oct 24 , 2026 | 12:12 AM
Anxiety among farmers అన్నదాతలను తుఫాన్ గుబులు వెంటాడుతోంది. ఏటా మాదిరి ఈ ఏడాది కూడా పంట చేతికి అందే సమయంలో తుఫాన్ కలవరం రేగుతోంది. వరి పంట ఎన్నుదశలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో వారం రోజుల్లో కోతకు సిద్ధం కానుంది.
రైతుల్లో కలవరం
పంటకు ముప్పు తప్పదని ఆందోళన
నరసన్నపేట, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): అన్నదాతలను తుఫాన్ గుబులు వెంటాడుతోంది. ఏటా మాదిరి ఈ ఏడాది కూడా పంట చేతికి అందే సమయంలో తుఫాన్ కలవరం రేగుతోంది. వరి పంట ఎన్నుదశలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో వారం రోజుల్లో కోతకు సిద్ధం కానుంది. కాగా.. ఈ నెల 27 నుంచి తుఫాన్ ప్రభావంతో ఈదురుగాలులతోపాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారులను అప్రమత్తం చేసింది. వరిపంట కోత దశలో తుఫాన్ ప్రభావంతో చూపితే తమకు నష్టం తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో ఈ ఏడాది 3.80 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. మరో 18వేల ఎకరాల్లో మొక్కజొన్న, మరో 12వేల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేశారు. జిల్లాలో పాతపట్నం, సారవకోట, నరసన్నపేట, జలుమూరు, ఎల్.ఎన్.పేట, సరుబుజ్జిలి తదితర మండలాల్లో ఇప్పుడిప్పుడే వరి కోతలు చేపడుతున్నారు. ఆమదావలస, గార, శ్రీకాకుళం రూరల్, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి తదితర మండలాల్లో వరిపైరు మరో వారం రోజుల్లో కోత దశకు రానుంది. ఈ సమయంలో గాలులు వీస్తే.. పంటకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. అలాగే లావేరు. ఎచ్చెర్ల, రణస్థలం, జి.సిగడాం, పొందూరు తదితర మండలాల్లో మొక్కజొన్న సాగుచేసిన రైతులు కూడా కలవరపడుతున్నారు.
అప్రమత్తంగా ఉండాల్సిందే : కలెక్టర్
జిల్లాకు తుఫాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ‘ఈ నెల 27 నుంచి 29 వరకు జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయి. 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. డివిజన్ కేంద్రాల్లో కంట్రోల్‌రూమ్‌లను ఏర్పాటు చేసి, నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. తుఫాన్, వరద ముప్పు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించాలి. 26 నుంచి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లడాన్ని నిషేధించాలి. బోట్లను సురక్షిత ప్రాంతాల్లో ఉంచి, మెరైన్ పోలీసుల సమన్వయంతో గస్తీ నిర్వహించాలి. రైతులు కోత దశకు వచ్చిన పంటలను కాపాడుకోవాలి, ధాన్యాన్ని సురక్షిత గోదాములకు తరలించాలి. పాఠశాలలు, ఆసుపత్రులు, మొబైల్ టవర్లు, పునరావాస కేంద్రాలలో జనరేటర్లు అందుబాటులో ఉండేలా చూడాలి. విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలి. 108 అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచాలి. తాగునీరు కలుషితం కాకుండా చూడాలి. పోలింగ్ కేంద్రాలు, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల’ని కలెక్టర్ ఆదేశించారు.