Share News

సిక్కోలులో అల్యూమినియం స్మెల్టర్‌?

ABN , Publish Date - Oct 02 , 2026 | 12:14 AM

Preparations for setting up an aluminium smelter సిక్కోలు తీరానికి భారీ ప్రాజెక్టు వచ్చే అవకాశం ఉంది. ఉప్పు భూముల్లో ‘అల్యూమినియం స్మెల్టర్‌’ను ఏర్పాటుకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు చేసిన ప్రతిపాదనకు కేంద్రం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సిక్కోలులో అల్యూమినియం స్మెల్టర్‌?

మూలపేట, పూండి ప్రాంతాల్లో ఏర్పాటుకు సన్నాహాలు

6,800 ఎకరాల ఉప్పు భూముల వినియోగానికి ప్రణాళిక

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కోరిన రామ్మోహన్‌ నాయుడు

వారంలో రానున్న కేంద్ర గనుల శాఖ అధికారులు

శ్రీకాకుళం, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): సిక్కోలు తీరానికి భారీ ప్రాజెక్టు వచ్చే అవకాశం ఉంది. ఉప్పు భూముల్లో ‘అల్యూమినియం స్మెల్టర్‌’ను ఏర్పాటుకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు చేసిన ప్రతిపాదనకు కేంద్రం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో కేంద్ర గనుల శాఖ మంత్రి జి కిషన్‌రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమైన రామ్మోహన్‌ నాయుడు.. జిల్లాలో ప్రాజెక్టు అనుకూలతలను వివరించారు. మూలపేట ప్రాంతంలో 5వేల ఎకరాలు, పూండిలో 1,800 ఎకరాలు.. వెరసి 6,800 ఎకరాల ఉప్పు భూములు అందుబాటులో ఉన్నాయని కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అల్యూమినియం స్మెల్టర్‌ వంటి భారీ పరిశ్రమకు మౌలిక వసతులు, రవాణా సదుపాయాలు అత్యంత కీలకం. ఈ విషయంలో మూలపేట-పూండి ప్రాంతం భౌగోళికంగా అత్యంత అనుకూలంగా ఉందని రామ్మోహన్‌ నాయుడు వివరించారు. ఈ ప్రాంతానికి జాతీయ రహదారి, రైల్వే కనెక్టివిటీతో పాటు భవిష్యత్తులో విమానయాన సదుపాయాలు అదనపు బలాన్ని చేకూరుస్తాయని తెలిపారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు.. ఈ ప్రాజెక్టు భారీ స్థాయి సరుకు రవాణాకు వెన్నెముకలా నిలుస్తుందని స్పష్టం చేశారు. స్మెల్టర్‌కు అవసరమైన ‘అల్యూమినా’ను పొరుగునే ఉన్న ఒడిశాలోని అంగుల్‌ ప్రాంతం నుంచి సరఫరా చేసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నారు. దీనిద్వారా ఒడిశాలోని అల్యూమినా పరిశ్రమను.. ఆంధ్రప్రదేశ్‌లోని పోర్టు, తీర ప్రాంత మౌలిక వసతులతో అనుసంధానం చేసినట్లు అవుతుందని వివరించారు. దీనిపై కిషన్‌రెడ్డి సానుకూలంగా స్పందించడంతో పాటు, క్షేత్రస్థాయి పరిశీలనకు వారం రోజుల్లోనే అధికారుల బృందాన్ని పంపేందుకు అంగీకరించారు. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే జిల్లా ముఖచిత్రం పూర్తిగా మారుతుందని, వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు. వారంలో కేంద్ర గనుల శాఖ అధికారులు ఇక్కడికి వచ్చి భూములు, మౌలిక వసతులు తదితర వాటిని పరిశీలించి నివేదిక సమర్పిస్తారు. తర్వాత ఉప్పు భూముల వినియోగం, పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి కేంద్ర పరిశ్రమల ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య శాఖ (డీపీఐఐటీ)తో పాటు రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ తదుపరి చర్యలు చేపట్టనున్నారు.

Updated Date - Oct 02 , 2026 | 12:14 AM