Share News

‘అమృత్‌ భారత్‌’.. ఆలస్యం

ABN , Publish Date - Jul 09 , 2026 | 11:55 PM

Delay in development works at Palasa పలాస రైల్వేస్టేషన్‌లో అభివృద్ధి పనులు ఆశించినస్థాయిలో జరగక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మూడేళ్ల కిందట ‘అమృత్‌ భారత్‌’ రైల్వేస్టేషన్‌గా గుర్తించి పలాసలో అభివృద్ధి కార్యక్రమాలకు రూ.24.5 కోట్లను రైల్వే మంత్రిత్వశాఖ కేటాయించింది. అప్పటి ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే భువనేశ్వర్‌ కేంద్రంగా పలాస రైల్వేస్టేషన్‌ ఉన్న సమయంలో అట్టహాసంగా పనులు ప్రారంభించారు. కానీ నత్తనడకన పనులు జరుగుతుండడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.

‘అమృత్‌ భారత్‌’.. ఆలస్యం
2, 3 ఫ్లాట్‌ఫారాల మధ్యలో నిలిచిన ఫుట్‌పాత్‌ నిర్మాణ పనులు

  • పలాస రైల్వేస్టేషన్‌లో నత్తనడకన అభివృద్ధి పనులు

  • జోన్‌ మార్పిడితో మరింత జాప్యం

  • పలాస, జూలై 9(ఆంధ్రజ్యోతి): పలాస రైల్వేస్టేషన్‌లో అభివృద్ధి పనులు ఆశించినస్థాయిలో జరగక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మూడేళ్ల కిందట ‘అమృత్‌ భారత్‌’ రైల్వేస్టేషన్‌గా గుర్తించి పలాసలో అభివృద్ధి కార్యక్రమాలకు రూ.24.5 కోట్లను రైల్వే మంత్రిత్వశాఖ కేటాయించింది. అప్పటి ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే భువనేశ్వర్‌ కేంద్రంగా పలాస రైల్వేస్టేషన్‌ ఉన్న సమయంలో అట్టహాసంగా పనులు ప్రారంభించారు. కానీ నత్తనడకన పనులు జరుగుతుండడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. విశాఖ సౌత్‌కోస్ట్‌ జోన్‌, విశాఖ డివిజన్‌ కేంద్రంలోకి వచ్చిన తరువాత పరిస్థితి మరీ దిగజారిపోయింది. పలాసతోపాటు శంకుస్థాపనలు జరిగిన ఇచ్ఛాపురం, బ్రహ్మపూర్‌, ఖుర్ధారోడ్‌, భువనేశ్వర్‌, కటక్‌ వంటి రైల్వేస్టేషన్లు యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అంతకన్నా ఎక్కువ నిధులు కేటాయించిన పలాసలో మాత్రం అభివృద్ధి అంతంతమాత్రంగానే ఉండడం విడ్డూరం. ఎంతో కష్టించి కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు పలాస నుంచి ఇచ్ఛాపురం వరకూ ఉన్న అన్నీ రైల్వేస్టేషన్లు సౌత్‌కోస్టులో కలిపి అభివృద్ధికి బీజం వేశారు. అయితే గతంలో ప్రారంభించిన పనుల వ్యవహారంపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఎక్కడిపనులు అక్కడే అన్నచందంగా నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

  • ఉదాహరణకు రైల్వేస్టేషన్‌ మధ్యలో భారీ ఫుట్‌బ్రిడ్జికి రెండేళ్ల కిందట శ్రీకారం చుట్టి ప్లాట్‌ఫారం మధ్యలో తవ్వకాలు చేపట్టారు. ఐరన్‌ ఫిల్లర్స్‌ సగం వరకూ బిగించి విడిచిపెట్టడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఫ్లాట్‌ఫారం కుచించుకోపోవడంతో రైలు వచ్చే సమయంలో ప్రమాదకరమైన పరిస్థితుల్లో రైలు ఎక్కాల్సి వస్తోంది. దీంతోపాటు ఫ్లాట్‌ఫారంపై పై కప్పులు వేయడానికి అంతా సిద్ధం చేసినా పనులు అరకొరగా చేపట్టి వదిలేశారు. ప్రస్తుతం ఆ ఫ్లాట్‌ఫారం పైనుంచి ప్రయాణికులు రాకపోకలు సాగించాలంటే భయాందోళన చెందుతున్నారు. సరైన మరుగుదొడ్లు కూడా నిర్మించకపోవడంతో ప్రయాణికుల అవస్థలు వర్ణణాతీతం. ఫ్లాట్‌ఫారం కొత్తది నిర్మించి ఆధునికీకరణకు టిక్కెట్‌ కార్యాలయం వద్ద ఉన్న పదో నెంబరు పట్టాలను ఎంచుకున్నారు. పనులు 20 శాతం వరకూ చేసి నిలిపేశారు. ఫ్లాట్‌ఫారం నిర్మిస్తారా లేదా అన్న సందేహాలను ప్రయాణికులు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విశాఖ డివిజన్‌ అధికారులు ఇక్కడ జరుగుతున్న పనులు చూసి.. ఇదేం అభివృద్ధి ఇంజనీరింగ్‌ అధికారులకు ప్రశ్నించడం కొసమెరుపు. ఇదిలా ఉండగా టిక్కెట్‌ కార్యాలయం ఆధునికీకరించినా వర్షం వస్తే నేరుగా నీరంతా కార్యాలయంలోనే నిల్వ ఉండడం ఉద్యోగులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యాలయాన్ని మార్చే యోచనలో అధికారులు ఉండడం.. ఇక్కడ అభివృద్ధి ఏ విధంగా ఉందో చెప్పకనే చెబుతోంది. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష స్వయంగా రంగంలోకి దిగితే తప్ప.. ఈ రైల్వేస్టేషన్‌ పూర్తిస్థాయిలో అభివృద్ధి జరగదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

Updated Date - Jul 09 , 2026 | 11:55 PM