ఫీజుల మోత
ABN , Publish Date - Jun 09 , 2026 | 12:02 AM
పిల్లల చదువు అనగానే కొందరు తల్లిదండ్రులు తమ ఆర్థిక స్థోమతను మరిచి ఎంత ఖర్చయినా ఫర్వాలేదని.. మంచి స్కూల్‌లో చేర్పించాలని అనుకుంటుంటారు.
- ఒకటో తరగతికే రూ.50వేలు
- ప్రైవేట్ పాఠశాలల్లో దోపిడీ
- పుస్తకాలు, యూనిఫాంకు అదనంగా..
- వసతులు మాత్రం అధ్వానం
- సొంత సిలబస్‌తో పాఠ్య పుస్తకాలు
- కొరవడిన విద్యాశాఖ పర్యవేక్షణ
- శ్రీకాకుళం పట్టణంలో ఒక కార్పొరేట్ పాఠశాలలో సరైన సౌకర్యాలు లేవు. ఇరుకైన తరగతి గదులు.. సరిగా వెలుతురు కూడా ఉండదు. పిల్లలు ఆడేందుకు మైదానం కూడా లేదు. కానీ ఫీజులు మోతతో విద్యార్థుల తల్లిదండ్రులు భోరుమంటున్నారు. ఒకటో తరగతికే ట్యూషన్ ఫీజు, ఇతర ఫీజులు కలిపి రూ.50 వేలు వసూలు చేస్తున్నారు.
- నరసన్నపేట పట్టణంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఇటీవల పుస్తకాలు విక్రయిస్తుండగా విద్యార్థి సంఘాల ఫిర్యాదు మేరకు విద్యాశాఖ అధికారులు పరిశీలించారు. విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించి పుస్తకాలను విక్రయిస్తున్నట్లు గుర్తించి రెడ్ హ్యాండ్‌గా పట్టుకున్నారు. అంతే కాకుండా ఒకటోతరగతి నుంచి ఐదోతరగతి వరకు రాష్ట్ర సిలబస్ కాకుండా ఇతర సిలబస్ పుస్తకాలను విక్రయించడంపై పాఠశాల యాజమాన్యాన్ని హెచ్చరించారు.
- పలాస పట్టణంలోని ఒక ప్రైవేటు పాఠశాల ఇప్పటికే అడ్మిషన్లు అయిపోయాయని, కొన్ని సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయని తక్షణమే ప్రవేశాలు పొందాలంటూ ప్రకటనలు చేస్తూ విద్యార్థులను చేర్చుకుంటుంది. జిల్లాలోని అన్ని ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు ఇలాగే అడ్మిషన్లు చేపడుతున్నాయి.
నరసన్నపేట, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): పిల్లల చదువు అనగానే కొందరు తల్లిదండ్రులు తమ ఆర్థిక స్థోమతను మరిచి ఎంత ఖర్చయినా ఫర్వాలేదని.. మంచి స్కూల్‌లో చేర్పించాలని అనుకుంటుంటారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఒకటో తరగతికే రూ.50వేలు ఫీజు అంటే దోపిడీ ఏస్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. మొదట అడ్మిషన్ ఫీజు పేరుతో రూ.2వేల నుంచి రూ.10వేల వరకు లాగేస్తున్నాయి. ఆ తరువాత ట్యూషన్ ఫీజు, స్పెషల్ ఫీజు, స్కూల్ డెవలప్‌మెంట్ ఫీజు, బిల్డింగ్ ఫీజు, కంప్యూటర్ ఫీజు, స్మార్ట్ క్లాసులు.. ఇలా ఫీజులు చిట్టా విప్పి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నాయి. కొత్తగా అడ్మిషన్ తీసుకుంటే రెగ్యులర్ ఫీజుతో పాటు అదనపు భారాన్ని మోయాల్సిందే. అతి కష్టం మీద ఈ ఫీజులు చెల్లించిన తరువాత పుస్తకాలు, యూనిఫాం, షూలు, అట్టలు ఇలా వాటి జాబితా కూడా చాంతాడంత ఉంటోంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఫస్ట్‌టర్మ్ ఫీజు 60శాతం చెల్లించి బతుకుజీవుడా అనుకుంటూ బయటపడేలోపే రెండో టర్మ్ ఫీజు చెల్లించాలని, లేదంటే పరీక్షలు రాయించమని పిల్లల డైరీల్లో రాసి పంపిస్తున్నారు. కనీస సదుపాయాలు లేని పాఠశాలలు సైతం ఫీజుల విషయంలో నిక్కచ్చిగా ఉంటున్నాయి. ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఆ స్థాయిలో సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదు. పేరుకే కార్పొరేట్ పాఠశాలలుగా చెప్పుకుంటున్నా అక్కడ వాస్తవ పరిస్థితుల్లో ఇరకు భవనాల్లో నడుపుతున్నారు. క్రీడా మైదానాలు కనిపించవు. విద్యార్ధుల సంఖ్యకు తగ్గట్టు మరుగుదొడ్లు ఉండడం లేదు. ఇలాంటి స్కూళ్లపై విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు ఉన్నాయి.
ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు ఇలా..
ప్రభుత్వ నిబంధనల మేరకు ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు గ్రామీణ ప్రాంతాల్లో రూ.6వేలు, మండల కేంద్రాల్లో ఉన్న పాఠశాలల్లో రూ.7,500, పట్టణాల్లో 8,600, జిల్లా కేంద్రంలో రూ.10వేలు వసూలు చేయాలి. 4, 5 తరగతులకు గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి రూ.9వేలు, పట్టణాల్లో రూ.10,500, జిల్లా కేంద్రంలో రూ.12వేలు ఆరో తరగతికి గ్రామీణ ప్రాంతాల్లో రూ.9వేలు, మండల కేంద్రాల్లో 9,500, పట్టణాల్లో రూ.11,100గా నిర్ణయించారు. పాఠశాల స్టార్ రేటింగ్ మేరకు ఈ ఫీజులను నిర్ణయించారు. అయితే ఈ ఫీజులతో తాము పాఠశాలలు నడపలేమని ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు చెబుతున్నాయి.
అమలు కానీ నిబంధనలు
కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులపై అధ్యయనం చేయడానికి ఐఏఎస్ అధికారులతో ప్రభుత్వం గతంలో ఓ కమిటీని నియమించింది. ఏ పాఠశాలలో ఎంత ఫీజు వసూలు చేస్తున్నారో ప్రాంతాల వారీగా ఈ కమిటీ పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి అందించింది. పాఠశాలల్లో మౌలిక వసతులు, బోధన, బోధనేతర సిబ్బంది తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని గ్రామాలు, పట్టణాల్లో పాఠశాలలను ఐదు కేటగిరీలుగా విభజించారు. మొత్తం 474 స్కూళ్లకు రేటింగ్‌లు ఇచ్చారు. స్టార్ రేటింగ్ స్కూళ్లకు సంబంధించి ఒకటి నుంచి పదో తరగతి వరకు ఫీజులు కూడా నిర్ధారిస్తూ ఈ కమిటీ సిఫారసు చేసింది. అలాగే ఎంత ఫీజు వసూలు చేస్తున్నారు.. ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు.. పాఠశాలలకు ఉన్న ప్రత్యేకతలు ఏమిటి? తదితర సౌకర్యాల వివరాలను తల్లిదండ్రులకు కనిపించేలా బోర్డులో ప్రదర్శించాలి. పాఠశాలలో వసూలు చేసే ఫీజులన్నిటికీ రసీదులు ఇవ్వాలి. ఇలా పలు రకాల నిబంధనలు విధించారు. కానీ, ఈ నిబంధనలేవీ అమలు కావడం లేదు.
సొంత సిలబస్‌తో పాఠ్యపుస్తకాలు..
జిల్లాలో కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తూ పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలను విక్రయిస్తున్నాయి. ఒకటో తరగతి నుంచి ఐదోతరగతి వరకు పాఠ్యపుస్తకాలకు రూ.10వేలు నుంచి రూ.12వేలు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్యపుస్తకాలు కాకుండా ఒక్కొక్క పాఠశాల ఒక్కొక్క పబ్లికేషన్ పుస్తకాలను ఐటీఐ ఒరియంటెడ్ పేరుతో విక్రయాలు చేపడుతూ వాటినే బోధిస్తున్నాయి. నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన పుస్తకాలను బోధించాలి. కానీ, ఐదో తరగతి వరకు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇక ఆరో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు ఇంటర్ స్థాయిలో ఉండే సిలబస్‌ను జోడించి సొంతంగా పుస్తకాలను తయారు చేయించి విక్రయాలు చేపడుతున్నారు. డైరీ, కంప్యూటర్, ఐఐటీ, నీట్ తదితర పుస్తకాలను వేలాది రూపాయిలకు అమ్మకాలు చేస్తున్నారు.
నిబంధనలు పాటించకుంటే చర్యలు
ప్రైవేటు పాఠశాలల్లో ఎటువంటి నోట్‌పుస్తకాలు, పాఠ్యపుస్తకాలను విక్రయించకూడదు. ప్రభుత్వ నిబంధన మేరకు పాఠ్య ప్రణాళికలు అనుసరించి సిలబల్ ఉండాలి. నిబంధనలు పాటించన పాఠశాలలకు నోటీసులు జారీ చేస్తాం. విద్యాశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాల్సిందే.
-రవిబాబు, డీఈవో, శ్రీకాకుళం