అమ్మో.. జూలై 1
ABN , Publish Date - Jun 28 , 2026 | 12:09 AM
Implementation of tax on cashew nuts begins జూలై ఒకటో తేదీ సమీపిస్తున్న వేళ.. పలాసలోని జీడి వ్యాపారుల గుండెల్లో గుబులు పుడుతోంది. మార్కెటింగ్ శాఖ(ఏఎంసీ)కు జీడిపిక్కలపై ఇప్పటికే ఒక శాతం పన్ను వ్యాపారులు కడుతున్నారు. కాగా 2018లో వచ్చిన ఆదేశాలను అనుసరించి జూలై ఒకటో తేదీ నుంచి జీడిపప్పుపై కూడా పన్ను చెల్లించాలని నోటీసులు జారీ చేయడంతో వ్యాపారుల్లో అలజడి రేగుతోంది.
జీడిపప్పుపై పన్ను అమలుకు శ్రీకారం
రద్దు చేయాలంటూ వ్యాపారుల ఆందోళన
మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి సమస్య
సందిగ్ధంలోనే వ్యవహారం
పలాస, జూన్ 27(ఆంధ్రజ్యోతి): జూలై ఒకటో తేదీ సమీపిస్తున్న వేళ.. పలాసలోని జీడి వ్యాపారుల గుండెల్లో గుబులు పుడుతోంది. మార్కెటింగ్ శాఖ(ఏఎంసీ)కు జీడిపిక్కలపై ఇప్పటికే ఒక శాతం పన్ను వ్యాపారులు కడుతున్నారు. కాగా 2018లో వచ్చిన ఆదేశాలను అనుసరించి జూలై ఒకటో తేదీ నుంచి జీడిపప్పుపై కూడా పన్ను చెల్లించాలని నోటీసులు జారీ చేయడంతో వ్యాపారుల్లో అలజడి రేగుతోంది. ఇటీవల దీనిపై అవగాహన కల్పించేందుకు మార్కెటింగ్‌శాఖ జేడీ యత్నించగా.. ఆయనతోనే వ్యాపారులు వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. దేశంలో ఎక్కడా ఈ విధానం అమల్లో లేదని, జీడిపప్పుపై పన్ను చెల్లించబోమని, ఇలా అయితే వ్యాపారాలు బంద్ చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి వ్యాపారులంతా మంత్రి అచ్చెన్నాయుడు వద్దకు వెళ్లి సమస్య విన్నవించారు. పన్నుల భారంతో తామంతా నష్టాల్లో మునిగిపోతామని, రాష్ట్రంలో జీడిపప్పుపై మార్కెట్ సెస్ రద్దు చేయాలని కోరారు. దీనిపై మంత్రి అచ్చెన్న సానుకూలంగా స్పందిస్తూ వ్యాపారులకు న్యాయం చేస్తామని తెలిపారు. కాగా.. ఒకటో తేదీ సమీపిస్తుండడంతో దీనిపై వ్యవసాయ మార్కెట్ కమిటీ నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి నిర్ణయం ప్రకటించకపోవడంతో వ్యాపారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇదీ పరిస్థితి
పలాస-కాశీబుగ్గ జీడికి ప్రసిద్ధి. ఇక్కడ వందలాది పరిశ్రమల్లో ఎంతోమంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. రుచికి, నాణ్యతకు ప్రసిద్ధి కావడంతో ఇక్కడి నుంచే జీడిపప్పు ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతుంది. కాగా పన్నుల భారం వ్యాపారులను వెంటాడుతోంది. జీడిపిక్కలపై ఇప్పటికే వ్యవసాయ మార్కెటింగ్ పరిధిలో ఒక శాతం సెస్ వసూలు చేస్తున్నారు. ఏటా ఒక్క పలాస వ్యవసాయ మార్కెటింగ్‌కు రూ.70లక్షల వరకూ ఆదాయం వస్తోంది. జీడిపప్పుపై కూడా ఒకశాతం పన్ను పెరిగితే ఆదాయం రెట్టింపువుతుంది. జీడిపప్పు అనేది వ్యవసాయ మార్కెటింగ్‌కు సంబంధం లేని వ్యవహారమని, పప్పుపై జీఎస్టీ కడుతుండగా మార్కెటింగ్ పన్ను ఎందుకు చెల్లించాలన్నది వ్యాపారుల ప్రశ్న. అయితే 1950లో చట్టం చేసినప్పుడు వ్యాపారుల శ్రేయస్సు దృష్ట్యా దీనిపై ఎటువంటి పన్ను విధించలేదు. కాగా 2018లో ఆన్‌లైన్‌లో వ్యాపారుల వివరాలు నమోదు చేస్తూ జీడిపప్పుపై కూడా ఒక శాతం పన్ను వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తరువాత వచ్చిన ప్రభుత్వాలు కూడా వ్యాపారుల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వాటిని ఇప్పటివరకూ అమలు చేయలేదు. ఇటీవల కూటమి ప్రభుత్వం జీడిపప్పుపై పన్ను వ్యవహారాన్ని తెరపైకి తీసుకువచ్చింది. జూలై ఒకటో తేదీ నుంచి ఆన్‌లైన్‌లో నమోదు చేసిన మేరకు ఏఎంసీలకు జీడిపప్పుపై కూడా పన్ను చెల్లించాలని వ్యాపారులకు నోటీసులు అందించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలోనే జీడిపప్పుపై కూడా పన్నులు తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 19న అమరావతిలోని సచివాలయంలో వ్యవసాయశాఖ కమిషనర్, ముఖ్య కార్యదర్శులను పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆధ్వర్యంలో వ్యాపారులంతా కలిసి వినతులు సమర్పించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యాపారులకు పన్నుల విధానంపై అవగాహన కలిగించి శాంతింపజేసినా వ్యవహారం మరింత ముదిరిపోయింది. జూలై ఒకటో తేదీ సమీపిస్తుండడంతో దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.
ఎటువంటి నిర్ణయమూ రాలేదు
వ్యాపారుల ఆందోళనపై రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి తీసుకువెళ్లాం. వ్యాపారులకు న్యాయం జరుగుతుందనే విశ్వాసం మాకు ఉంది. ఎవరికీ ఇబ్బందులు లేకుండా నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నాం. వ్యాపారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
- మల్లా శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్మన్, పలాస
సందేహాలు నివృత్తి చేయాలి
వ్యాపారులకు అనేక సందేహాలు ఉన్నాయి. ఇప్పటికే జీడిపప్పుపై ఒక శాతం పన్నుపై అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పొరుగురాష్ట్రాల్లో ఎటువంటి అదనపు పన్నులు లేకుండా వ్యాపారాలు జరిగితే.. ఇక్కడ అదనంగా పన్ను కట్టి వారితో ఏ విధంగా పోటీ పడగలం. రాయితీలు ఇవ్వాల్సింది పోయి పాత చట్టాలను తిరగరాయడం సరికాదు. వ్యాపారులకు న్యాయం చేస్తేనే కొత్త వ్యాపారులు వస్తారు. సంప్రదాయమైన వ్యాపారం జరుగుతుంది.
- మల్లా రామేశ్వరరావు, అధ్యక్షుడు, వ్యాపార సంఘం, జీడి పారిశ్రామికవాడ
ఒకటే పన్ను విధానం అమలుచేయాలి
ఒకటే దేశం.. ఒకటే పన్ను విధానం ప్రకటించారు. కానీ ఇక్కడ మాత్రం జీడిపప్పుపై లేని సెస్‌ను అమలు చేయాలని చూస్తున్నారు. దీనిపై ప్రభుత్వ పెద్దలు పునరాలోచించాలి. ఈ విధానం అమలైతే మేము తీవ్రంగా నష్టపోతాం. ఇతర రాష్ట్ర వ్యాపారులతో పోటీ పడలేక జీడి ఉనికికే ప్రమాదంగా మారే పరిస్థితి ఉంది.
- మల్లా కాంతారావు, రాష్ట్ర జీడి వ్యాపారుల సంఘం ఉపాధ్యక్షుడు