Share News

అమ్మో.. క్యాన్సర్‌

ABN , Publish Date - Apr 25 , 2026 | 12:14 AM

Cancer disease spreading in Srikakulam ఉద్దానం కిడ్నీవ్యాధుల భయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జిల్లావాసులను మరో మహమ్మారి కమ్మేస్తోంది. పచ్చని పొలాలకు, స్వచ్ఛమైన గాలికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే సిక్కోలులో సైలెంట్‌ కిల్లర్‌.. క్యాన్సర్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది.

అమ్మో.. క్యాన్సర్‌

  • సిక్కోలులో విస్తరిస్తున్న ప్రాణాంతక వ్యాధి

  • ఎన్‌సీడీ 4.0 స్ర్కీనింగ్‌ నివేదికలో విస్తుపోయే నిజాలు

  • వేలసంఖ్యలో అనుమానిత కేసులు

  • బెంబేలెత్తిస్తున్న రొమ్ము, గర్భాశయ, నోటిక్యాన్సర్‌ గణాంకాలు

  • విచ్చలవిడిగా పురుగుమందులు, రసాయనాల వాడకమే ఈ దుస్థితికి కారణం

  • ఇటీవల జడ్పీ సమావేశంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌

  • మేల్కోకపోతే పదేళ్లలో మరో ‘పంజాబ్‌’ కావడం ఖాయమని హెచ్చరిక

  • జిల్లాకు క్యాన్సర్‌ ముప్పు పొంచి ఉంది. అనారోగ్యానికి గురైన ప్రతి పది మందిలో ఒకరికి క్యాన్సర్‌ లక్షణాలు కనిపిస్తుండటం వైద్య వర్గాలను సైతం కలవరపరుస్తోంది. ఇటీవల రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్‌సీడీ 4.0 స్ర్కీనింగ్‌ నివేదిక ప్రకారం.. జిల్లాలో వేలసంఖ్యలో అనుమానిత కేసులు గుర్తించడం కలకలం రేపుతోంది. వ్యవసాయంలో మోతాదుకు మించిన రసాయనాల వినియోగమే.. క్యాన్సర్‌ వ్యాప్తికి కారణమని తెలుస్తోంది. మేల్కోకపోతే భవిష్యత్‌లో మరో పంజాబ్‌ కావడం ఖాయమనే హెచ్చరికలు జిల్లావాసులను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

  • శ్రీకాకుళం, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): ఉద్దానం కిడ్నీవ్యాధుల భయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జిల్లావాసులను మరో మహమ్మారి కమ్మేస్తోంది. పచ్చని పొలాలకు, స్వచ్ఛమైన గాలికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే సిక్కోలులో సైలెంట్‌ కిల్లర్‌.. క్యాన్సర్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. మనం రోజూ తినే అన్నం, కూరగాయాలే ఇప్పుడు ప్రాణాలను హరిస్తున్నాయి. అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలవుతున్న ప్రతి పది మందిలో ఒకరికి క్యాన్సర్‌ లక్షణాలు కనిపిస్తుండటం వైద్య వర్గాలను సైతం నివ్వెరపరుస్తోంది. ఇటీవల రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ ప్రతిష్టాత్మకకంగా చేపట్టిన నాన్‌-కమ్యూనికేబుల్‌ డిసీజెస్‌ (ఎన్‌సీడీ 4.0) స్ర్కీనింగ్‌ నివేదిక ఈ చేదు నిజాన్ని బట్టబయలు చేసింది. ఈ గణాంకాలను ఇటీవల జరిగిన జిల్లాపరిషత్‌ సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర పబ్లిక్‌ అండర్‌ టేకింగ్స్‌ కమిటీ(పీయూసీ) చైర్మన్‌, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అధికారుల దృష్టికి తెచ్చారు. ‘జిల్లాలో ఈ స్థాయిలో క్యాన్సర్‌ కేసులు నమోదు కావడానికి ప్రధాన కారణం వ్యవసాయంలో వస్తున్న మార్పులే. పంటలకు పురుగుమందుల వాడకాన్ని నియంత్రించకపోతే.. రాబోయే ఐదు, పదేళ్లలో క్యాన్సర్‌ రోగుల సంఖ్యలో శ్రీకాకుళం జిల్లా పంజాబ్‌ రాష్ట్రాన్ని అధిగమిస్తుంది’ అని కూన రవికుమార్‌ హెచ్చరించారు. రాబోయే పెనుముప్పుపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ స్పష్టం చేశారు.

  • నివ్వెరపరుస్తున్న గణాంకాలు ఇవీ

  • గతేడాది సెప్టెంబరు 17 నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ 5 వరకు జిల్లావ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ విస్తృతస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించింది. జిల్లాలో 19,22,773 మందికి స్ర్కీనింగ్‌ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు 9,67,956 మందికి (50.34 శాతం) పరీక్షలు పూర్తి చేశారు. ఈ సగం మందికి సంబంధించిన డేటాలోనే క్యాన్సర్‌ భూతం కోరలు చాచిన తీరు స్పష్టమవుతోంది.

  • స్ర్కీనింగ్‌ చేసిన వారిలో అత్యధికంగా 34,793 మంది (3.59 శాతం) నోటి(ఓరల్‌) క్యాన్సర్‌ అనుమానితులుగా (సస్పెక్ట్‌) నమోదయ్యారు. ఇందులో వైద్యాధికారులు 26 వేల మందికిపైగా పరీక్షించి, వ్యాధి నిర్ధారణస్త్ర కోసం పై ఆసుపత్రులకు రిఫర్‌ చేశారు.

  • మహిళల్లో ఏకంగా 17,972 మంది (1.86 శాతం) రొమ్ము(బ్రెస్ట్‌) క్యాన్సర్‌ ప్రాథమిక లక్షణాలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. మరో 21,790 మంది(2.25 శాతం) మహిళల్లో గర్భాశయ (సర్వైకల్‌) క్యాన్సర్‌ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించారు. దీనికి తోడు 42,839 మందికి హైపర్‌ టెన్షన్‌(బీపీ), 29,004 మందికి డయాబెటిస్‌(మధుమేహం) ఉన్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది.

  • మేల్కోకపోతే మరో పంజాబే..!

  • వ్యవసాయ పంటలు విషతుల్యమవుతున్నాయి. అధిక దిగుబడి కోసం రైతులు మోతాదుకు మించి యూరియా, డీఏపీ వంటి రసాయనిక ఎరువులను వాడుతున్నారు. తెగుళ్ల నివారణ పేరిట అత్యంత ప్రమాదకరమైన పురుగుమందులను యథేచ్ఛగా పిచికారీ చేస్తున్నారు. ఈ రసాయనాలు నేలలో ఇంకిపోయి, ఆ పంటల ద్వారా నేరుగా మానవ శరీరంలోకి చేరుతున్నాయి. క్రమక్రమంగా ఇవి కణాల్లో మార్పులు తెచ్చి క్యాన్సర్‌కు దారితీస్తున్నాయి. దీనికితోడు యువత, గ్రామీణుల్లో గుట్కా, ఖైనీ, పొగాకు ఉత్పత్తుల వినియోగం పెరగడం నోటి క్యాన్సర్‌ బారిన పడేలా చేస్తోంది. పంజాబ్‌లో హరిత విప్లవం పేరుతో రసాయనాలను విపరీతంగా వాడటం వల్ల, నేడు ఆ రాష్ట్రంలోని భటిండా తదితర ప్రాంతాల నుంచి రాజస్థాన్‌కు వెళ్లే రైలును ‘క్యాన్సర్‌ ట్రెయిన్‌’గా పిలుచుకునే దుస్థితి వచ్చింది. ఇప్పుడు సిక్కోలు కూడా అదే పతనపుటంచున నిలబడిందని వైద్య నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • ప్రభుత్వం తక్షణమే చేపట్టాల్సిన చర్యలు

  • పంటలకు, ముఖ్యంగా కూరగాయలు, ఆకుకూరలు, మొక్కజొన్న తదితర వాటికి పురుగుమందులు పిచికారీ చేసిన వెంటనే కోతలు కోయకుండా.. కనీసం 14 రోజుల విరామం (వెయిటింగ్‌ పీరియడ్‌) పాటించేలా వ్యవసాయ శాఖ విస్త్రత అవగాహన కల్పించాలి.

  • ప్రస్తుతం గుర్తించిన వేలాదిమంది అనుమానిత కేసుల బాధితులకు ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్ల ద్వారా కౌన్సిలింగ్‌ ఇవ్వాలి. వెంటనే వారికి బయాప్సీ, మామోగ్రామ్‌, ప్యాప్‌ స్మియర్‌ వంటి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహించాలి.

  • నిషేధిత రసాయనాలు విక్రయిస్తే డీలర్ల లైసెన్సులు రద్దు చేయాలి. జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌(జీబీఎన్‌ఎఫ్‌) చేసే రైతులకు ప్రోత్సాహకాలు పెంచాలి.

  • జిల్లాలో పెరుగుతున్న కేసుల దృష్ట్యా, శ్రీకాకుళం లేదా పలాస కేంద్రంగా అత్యాధునిక క్యాన్సర్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రీట్మెంట్‌ సెంటర్‌ను ప్రభుత్వం తక్షణమే మంజూరు చేయాలి.

  • తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • రైతులు పంటలకు పురుగుమందులు కొట్టిన వెంటనే దిగుబడులను మార్కెట్‌కు తరలించరాదు. కనీసం రెండు వారాలు ఆగిన తర్వాతే పంటను కోయాలి. మార్కెట్‌ నుంచి తెచ్చిన కూరగాయలను ఉప్పు, పసుపు వేసిన గోరువెచ్చని నీటిలో కడిగిన తర్వాతే ప్రజలు వండుకోవాలి. పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. శరీరంలో గడ్డలు వచ్చినా, నోటిలో పుండ్లు మానకపోయినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. సామూహికంగా మేల్కొనకపోతే భవిష్యత్తు తరాలకు సిక్కోలును ‘క్యాన్సర్‌ మృత్యుకుహరం’గా మిగిల్చిన పాపం మూటగట్టుకోవాల్సి వస్తుంది. పల్లెల్లో ప్రతి ఇంటికీ ఈ ముప్పు పొంచి ఉన్నందున తక్షణ కార్యాచరణే ఏకైక మార్గం.

Updated Date - Apr 25 , 2026 | 12:14 AM