అంబటీ.. నోరు అదుపులో పెట్టుకో
ABN , Publish Date - Jan 31 , 2026 | 11:51 PM
Minister achhenna warning వైసీపీ నేత అంబటి రాంబాబు తీరుపై వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. శనివారం సంతబొమ్మాళి మండలంలోని తాళ్ళవలస, చిల్లపేట, రెయ్యపేట గ్రామాల్లో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు.
తిరుమల పవిత్రతను దెబ్బతీస్తే సహించం
వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం, జనవరి 31(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత అంబటి రాంబాబు తీరుపై వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. శనివారం సంతబొమ్మాళి మండలంలోని తాళ్ళవలస, చిల్లపేట, రెయ్యపేట గ్రామాల్లో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయిడిపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత నీచంగా ఉన్నాయని మండిపడ్డారు. చంద్రబాబు అంటేనే రాష్ట్ర ప్రజల గౌరవానికి, హుందాతనానికి ప్రతీక అని, ఆయనపై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదని స్పష్టం చేశారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అంబటి రాంబాబు ముందు తన చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకువిఘాతం కలిగించేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదన్నారు. ప్రజల రక్షణ తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశమని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజా సంక్షేమం ఎంత ముఖ్యమో, శాంతి భద్రతల పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని, సీఎం చంద్రబాబు ఈ విషయంలో నిబద్ధతతో ఉన్నారని గుర్తుచేశారు.
పాపాల నుంచి తప్పించుకునేందుకే..
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు, రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని మంత్రి అచ్చెన్న పేర్కొన్నారు. రూ.250 కోట్లకు పైగా జరిగిన స్కామ్‌ల నుంచి తప్పించుకునేందుకే వైసీపీ నేతలు ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా ఎవరు వ్యవహరించినా కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.