Share News

కూటమి అభ్యర్థులు ఖరారు

ABN , Publish Date - Nov 16 , 2026 | 12:37 AM

Srikakulam Corporation Mayor seat goes to Jana Sena శ్రీకాకుళం కార్పొరేషన్‌, ఆమదాలవలస మునిసిపాలిటీలకు సంబంధించి కూటమి అభ్యర్థులు ఖరారయ్యారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ మేయర్‌ సీటును పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. మేయర్‌ అభ్యర్థిగా ‘జనసేన’ తరఫున డా. దానేటి శ్రీధర్‌ సతీమణి దానేటి రాధారాణికి టిక్కెట్‌ కేటాయిస్తూ పార్టీపరంగా ఉత్తర్వులు జారీచేసింది.

కూటమి అభ్యర్థులు ఖరారు
మంత్రి అచ్చెన్నాయుడును కలిసిన జనసేన మేయర్‌ అభ్యర్థి దానేటి రాధారాణి, డాక్టర్‌ శ్రీధర్‌, ఇన్‌సెట్‌లో ఆమదాలవలస టీడీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి కూన ప్రమీల

శ్రీకాకుళం కార్పొరేషన్‌ మేయర్‌ సీటు జనసేనకు

అభ్యర్థిగా దానేటి రాధారాణి

ఆమదాలవలసలో టీడీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా కూన ప్రమీల

రెండోరోజు ఊపందుకున్న నామినేషన్లు

శ్రీకాకుళం/ ఆమదాలవలస, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం కార్పొరేషన్‌, ఆమదాలవలస మునిసిపాలిటీలకు సంబంధించి కూటమి అభ్యర్థులు ఖరారయ్యారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ మేయర్‌ సీటును పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. మేయర్‌ అభ్యర్థిగా ‘జనసేన’ తరఫున డా. దానేటి శ్రీధర్‌ సతీమణి దానేటి రాధారాణికి టిక్కెట్‌ కేటాయిస్తూ పార్టీపరంగా ఉత్తర్వులు జారీచేసింది. డా.దానేటి శ్రీధర్‌.. వైసీపీని వీడి సార్వత్రిక ఎన్నికల వేళ జనసేనలో చేరారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ మేయర్‌ పదవి ‘జనరల్‌ మహిళ’కు కేటాయించారు. దీంతో కూటమిలో భాగంగా జిల్లా కేంద్రంలో మేయర్‌ సీటుకు ప్రత్యక్షంగా పోటీచేసే అవకాశం జనసేన నుంచి రాధారాణికి లభించింది. టిక్కెట్‌ ఖరారైన వెంటనే మేయర్‌ అభ్యర్థి రాధారాణి, తన భర్త దానేటి శ్రీధర్‌ ఆదివారం రాత్రి మంత్రి అచ్చెన్నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు.

ఆమదాలవలసలో

తెలుగుదేశం పార్టీ తరఫున ఆమదాలవలస మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా పీయూసీ చైర్మన్‌, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ సతీమణి కూన ప్రమీలను ఖరారు చేస్తూ టీడీపీ అధిష్ఠానం ఉత్తర్వులను జారీచేసింది. కూన ప్రమీల.. ఎంఏ పాలిటిక్స్‌ చదివారు. పొందూరు మండలం కోటిపల్లి ఎంపీటీసీగా 2001-2026 వరకు కొనసాగారు. 2001-2012 మధ్యకాలంలో పొందూరు ఎంపీపీగాను బాధ్యతలు నిర్వహించారు.

ఊపందుకున్న నామినేషన్లు

జిల్లాలోని శ్రీకాకుళం కార్పొరేషన్‌, ఆమదాలవలస మునిసిపాలిటీల్లో రెండో రోజు ఆదివారం నామినేషన్లు ఊపందుకున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు పోటీకి సై అంటున్నారు. శ్రీకాకుళం కార్పొరేషన్‌లో ఆదివారం మేయర్‌ పదవికి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా మంత్రి లక్ష్మి నామినేషన్‌ వేశారు. తొలిరోజు నాలుగు నామినేషన్లతో కలిపి మొత్తంగా మేయర్‌ స్థానానికి 5 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు స్పష్టం చేశారు. అలాగే ఆదివారం కార్పొరేటర్‌ స్థానాలకు 84 నామినేషన్లు దాఖలయ్యాయి. వైసీపీ తరపున 37, టీడీపీ - 31, బీజేపీ - 5, జనసేన - 5, సీపీఎం - 1, స్వతంత్ర అభ్యర్థులు ఐదుగురు నామినేషన్‌ వేశారు. మొదటి రోజు వచ్చిన 6 నామినేషన్లతో కలిపి ఇప్పటివరకు మొత్తం 90 వచ్చాయి.

ఆమదాలవలస మునిసిపాలిటీకి సంబంధించి రెండో రోజు ఆదివారం 38 నామినేషన్లు నమోదైనట్టు మునిసిపల్‌ కమిషనర్‌ తమ్మినేని రవి తెలిపారు. చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా టీడీపీ తరపున ఎమ్మెల్యే కూన రవికుమార్‌ సతీమణి కూన ప్రమీల రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే వార్డుల్లో కౌన్సిలర్‌ సభ్యులుగా.. టీడీపీకి సంబంధించి 18 మంది నామినేషన్లు వేశారు. వైసీపీ తరపునే 15 మంది, జనసేన నుంచి ఇద్దరు, స్వతంత్ర అభ్యర్థిగా ఒకరు నామినేషన్‌ వేశారని కమిషనర్‌ రవి వెల్లడించారు. ఇదిలా ఉండగా నామినేషన్‌ నేపథ్యంలో టీడీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి కూన ప్రమీల.. పట్టణంలోని పాలపోలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు.

Updated Date - Nov 16 , 2026 | 12:37 AM