ఉగ్రవాదులతో సంబంధం ఉందంటూ..
ABN , Publish Date - Jan 28 , 2026 | 12:13 AM
Threats in the name of digital arrest పాతపట్నంలో డిజిటల్ అరెస్టు వ్యవహారం కలకలం రేగింది. హర్యానాకు చెందిన ఓ వ్యక్తికి.. ఉగ్రవాదులతో సంబంధం ఉందంటూ ఫోన్‌లో బెదిరించి గుర్తుతెలియని వ్యక్తులు రూ.లక్షల్లో డబ్బులు డిమాండ్ చేశారు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హర్యానా వాసికి డిజిటల్ అరెస్టు పేరిట బెదిరింపులు
పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
ఆర్థికలావాదేవీల ఆధారంగా పాతపట్నం నెట్‌సెంటర్ నిర్వాహకుడు అరెస్టు
పాతపట్నం జనవరి 27(ఆంధ్రజ్యోతి): పాతపట్నంలో డిజిటల్ అరెస్టు వ్యవహారం కలకలం రేగింది. హర్యానాకు చెందిన ఓ వ్యక్తికి.. ఉగ్రవాదులతో సంబంధం ఉందంటూ ఫోన్‌లో బెదిరించి గుర్తుతెలియని వ్యక్తులు రూ.లక్షల్లో డబ్బులు డిమాండ్ చేశారు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్థికలావాదేవీల ఆధారంగా హర్యానా రాష్ట్ర పోలీసులు పాతపట్నంలోని రత్నాలపేట వీధికి చెందిన నెట్‌సెంటర్ నిర్వాహకుడు టంకాల శివకుమార్‌ను అరెస్టు చేశారు. పోలీసుల వివరాల మేరకు..
హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్ జిల్లా బాల్లాబాగ్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగి గంగాకాంత్ చౌదరికి.. గతేడాది డిసెంబరు 8న ఛండీగఢ్ పరిపాలన విభాగం అధికారుల పేరిట డిజిటల్ అరెస్టు ఫోన్‌కాల్ వచ్చింది. ‘మాకు పట్టుబడిన ఉగ్రవాదుల జాబితాలో మీ పేరు ఉంది. ఉగ్రవాదులు సుమారు రూ.8కోట్లు భారీ మనీల్యాండరింగ్ చేశారు. అందులో మీ కాతాకు పదిరెట్లు డబ్బులు బదిలీ చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలన్నీ ఉన్నాయి. మిమ్మల్ని అరెస్టు చేసేందుకు ఒక బృందం వస్తుంద’ని వారు చెప్పారు. మీ దగ్గర ఎంత డబ్బు ఉందో చెప్పాలని ఆరా తీశారు.
మరుసటి రోజు మరో రెండు నెంబర్లు నుంచి గంగాకాంత్ చౌదరికి ఫోన్ చేశారు. బ్యాంక్, సుప్రీంకోర్టు రిఫరెన్స్ ఆస్తి గుర్తింపు అరెస్ట్ పాయింట్ అంశాల పత్రాలను ఫోన్‌ద్వారా పంపారు. ఖాతాలో ఉన్న మొత్తం డబ్బులు ఇప్పుడే మేము చెప్పిన బ్యాంకు ఖాతాకు జమ చేయాలి. రెండు వారాల్లో దర్యాప్తు పూర్తయిన తర్వాత మీ డబ్బు మీకు తిరిగిచ్చేస్తాం. అలా చేయకపోతే వెంటనే అరెస్టు చేసి మొత్తం ఆస్తిని జప్తు చేయాల్సి ఉంటుంద’ని అధికారులుగా చెప్పుకునే వ్యక్తులు బెదిరించారు. వారి సూచన మేరకు గతేడాది డిసెంబరు 11న గంగాకాంత్ తన బ్యాంకు ఖాతా నుంచి వారు చెప్పిన యాక్సిస్ బ్యాంకు ఖాతాకు రూ.48 లక్షలు రెండు విడతల్లో జమ చేశారు. రెండు వారాల తర్వాత పలుమార్లు ఆ నెంబర్లకు గంగాకాంత్ ఫోన్ చేయగా.. ఎటువంటి స్పందన లేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించి.. ఈ నెల 11న ఎన్‌సీఆర్‌పీ పోర్టల్‌లో గంగాకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు హర్యానా రాష్ట్ర బల్లాబాఘ్ సైబర్ నేరవిభాగం పోలీసులు దర్యాప్తు చేశారు. గంగాకాంత్ డబ్బులు జమ చేసిన బ్యాంకు ఖాతానెంబర్(ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడిలో) పాతపట్నంలోని నెట్‌సెంటర్ నిర్వాహకుడు టంకాల శివకుమార్‌దిగా గుర్తించారు. హర్యానా నుంచి పీఎస్‌ఐ దినేష్, ఏఎస్‌ఐ ధర్మేంద్రసింగ్, ఏస్ మొనుసింగ్, పీసీ సచిన్.. మంగళవారం పాతపట్నం చేరుకున్నారు. స్థానిక ఎస్‌ఐ కె.మధుసూదనరావు సమక్షంలో శివకుమార్‌ను అరెస్ట్ చేశారు.
కాగా శివకుమార్ తనకు ఇదెలా జరిగిందో తెలియదని, తాను కూడా సైబర్‌మోసానికి గురైనట్టు చెబుతున్నాడు. తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామంటే పర్లాకిమిడిలోని యాక్సిస్ బ్యాంక్‌లో ఖాతా తెరిచానని పోలీసులకు చెప్పాడు. శివకుమార్ ఖాతా నుంచి రూ.1.48 కోట్ల మేర ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.