అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా
ABN , Publish Date - Mar 14 , 2026 | 11:58 PM
అక్షరమే ఆయుధంగా ఎన్నో ప్రజా సమస్యల పరిష్కారంలో కీలక భూమిక పోషించిన ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్’ మరోసారి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
నేడు నరసన్నపేటలో ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ఆధ్వర్యంలో నిర్వహణ
వేదిక : పల్లిపేట జంక్షన్‌లోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహం
హాజరుకానున్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
నరసన్నపేట, మార్చి 14(ఆంధ్రజ్యోతి): అక్షరమే ఆయుధంగా ఎన్నో ప్రజా సమస్యల పరిష్కారంలో కీలక భూమిక పోషించిన ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్’ మరోసారి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆదివారం నరసన్నపేటలో ‘అక్షరం అండ గా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. పల్లిపేట జంక్షన్‌లో ఆర్‌అండ్‌బీ అతిథిగృహం ఆవరణలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు సదస్సు నిర్వహించనుంది. ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఇందిరానగర్, హడ్కోకాలనీల్లో నెలకొన్న ప్రజా సమస్యలపై చర్చించి.. వాటికి పరిష్కార మార్గం చూపనుంది. ఈ కార్యక్రమానికి నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. మేజర్‌పంచాయతీ ఈవో పల్లి దాక్షాయణి, ఎంపీడీవో వెంకటేష్ ప్రసాద్, తహసీల్దార్ ఆర్.సత్యనారాయణ, వంశధార ఈఈ మురళీమోహనరావు, నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ ఏఈతోపాటు వివిధ శాఖల అధికారులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొనున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయనున్నారు.
నరసన్నపేట మేజర్ పంచాయతీ పరిధిలోగల 20వ వార్డులో ఇందిరానగర్, హడ్కో కాలనీల్లో ఏళ్ల తరబడి అనేక సమస్యలు పేరుకుపోయాయి. ‘ఆంధ్రజ్యోతి’ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించనున్న ‘అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమంలో వీటి పరిష్కారం దిశగా అడుగులు వేయాలని సంకల్పించింది. ఈ నేపథ్యంలో సమస్యలను ఒకసారి పరిశీలిస్తే..
ఒకటో వీధిలో నిత్యం ట్రాఫిక్
ఇందిరానగర్, హడ్కోకాలనీలకు వెళ్లేందుకు వెళ్లే ప్రధాన మార్గంలో నిత్యం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. రోడ్ల మీద వాహనాలు నిలిపివేయడంతో ఆ మార్గంలో ఉన్న ఆసుపత్రి, కళాశాలలు, ఇళ్లకు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. షాపుల పక్కనే పార్కింగ్ చేయడంతో అత్యవసర సమయంలో వాహనాలు వెళ్లేందుకు మార్గం లేక వేరే మార్గంలో ప్రధాన రహదారి మీదకు చేరుకుంటున్నారు. అలాగే హడ్కో కాలనీలో వీధుల్లో పార్కింగ్ చేయడంతో అత్యవసర సమయంలో 108 వాహనం లాంటివి వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు.
కుళాయి రాకుంటే మంచినీరు కొనాల్సిందే
ఇందిరానగర్, హడ్కో కాలనీలో కుళాయిలు ఉన్నాయి. రక్షిత మంచినీటి పథకం వద్ద ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే తాగునీటి కోసం ఇతర ప్రాంతాలకు పరుగులు పెట్టాల్సిందే. వంశధార కాలువలో నీరు ప్రవహిస్తే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వద్ద గల బోరు నుంచి నీరు వస్తుంది. లేదంటే ఉత్సవ విగ్రహాన్ని తలపిస్తుంది. ఇక వంశధార 11ఆర్ కిళ్లాం కాలువ పక్కనే రెండు బోర్లు ఉన్నా తాగునీరు పనికిరావడం లేదని హడ్కో కాలనీ వాసులు చెబుతున్నారు. ఇందిరానగర్‌లో సిద్ధాశ్రమం వద్ద తప్ప బోరుబావి ఎక్కడా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు.
ప్రమదాలను ఆహ్వానిస్తూ..
ఇందిరానగర్- హడ్కోకాలనీ వద్ద గల సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వద్ద విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ తక్కువ ఎత్తులో ఉంది. ట్రాన్స్‌ఫార్మర్‌కు దిగువ భాగంలో చిన్నపిల్లలకు అందేటంత ఎత్తులో ఫ్యూజు బ్యాక్సులను ఏర్పాటు చేశారు. ఈ ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ తీగలు చుట్టుకున్నాయి. పిల్లలు ఆటలు ఆడేసమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే భారీ మూల్యం చెల్లించకోక తప్పదు.
కాలువే డంపింగ్ యార్డు
హడ్కో కాలనీలోని 11ఆర్ కిళ్లాం కాలువ సమీపంలో గల ఇళ్లలో చెత్త, చెదారం నిత్యం కాలువలో పడేస్తున్నారు. దీంతో పక్కనే ఉన్న వారు దుర్వాసన, దోమలతో ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం రోగాల బారిన పడుతున్నారు. భూగర్భ జలాలు కూడా దుర్వాసన వెదజల్లుతున్నాయి. కాలువ గట్లపై చెత్తకుండీలు ఏర్పాటు చేస్తే ఈ సమస్యను పరిష్కరించవచ్చు.