Share News

మేయర్‌ పీఠంపై గురి

ABN , Publish Date - Oct 14 , 2026 | 12:14 AM

Municipal elections at srikakulam శ్రీకాకుళం నగరపాలక సంస్థకు 16 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మేయర్‌ పీఠంపై అధికార కూటమి, వైసీపీలోని ఆశావహులు దృష్టి సారించారు. వైసీపీ సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు తమ పార్టీలోని పాత నాయకులను పక్కనపెట్టి, గతంలో ప్రత్యర్థిగా ఉన్న గుండ లక్ష్మీదేవిని పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నం చేస్తుండగా.. టీడీపీలో అంధవరపు కుటుంబంతోపాటు పలువురు నేతలు మేయర్‌ పదవిపై ఆశలు పెట్టుకున్నారు.

మేయర్‌ పీఠంపై గురి

  • వైసీపీలో పాత నేతలను కాదని.. టీడీపీ వైపు ధర్మాన చూపు

  • వైసీపీలోకి రావాలని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికి ఆహ్వానం

  • టీడీపీ నుంచి మేయర్‌ రేసులో అంధవరపు కుటుంబం!

  • ఆమదాలవలసలో కూన రవికుమార్‌ సతీమణి పేరు!

  • శ్రీకాకుళం, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగరపాలక సంస్థకు 16 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మేయర్‌ పీఠంపై అధికార కూటమి, వైసీపీలోని ఆశావహులు దృష్టి సారించారు. వైసీపీ సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు తమ పార్టీలోని పాత నాయకులను పక్కనపెట్టి, గతంలో ప్రత్యర్థిగా ఉన్న గుండ లక్ష్మీదేవిని పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నం చేస్తుండగా.. టీడీపీలో అంధవరపు కుటుంబంతోపాటు పలువురు నేతలు మేయర్‌ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఆమదాలవలస మున్సిపాలిటీలో పీయూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌ సతీమణి పేరు కూడా తెరపైకి వచ్చింది. వార్డుల రిజర్వేషన్లు ఖరారైతే ఆశావహుల సంఖ్య, రాజకీయ సమీకరణాలు మరింత మారే అవకాశం ఉంది.

  • 16 ఏళ్ల తర్వాత ఎన్నికలు

  • శ్రీకాకుళం మున్సిపాలిటీకి ఘనమైన చరిత్ర ఉంది. 1856లో మున్సిపాలిటీగా ఏర్పడిన ఈ సంస్థకు 1987 వరకు పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. ప్రత్యక్ష ఎన్నికల పద్ధతిలో 1981 నుంచి 1992 వరకు కాంగ్రెస్‌ నేత అంధవరపు వరహానరసింహం మున్సిపల్‌ చైర్మన్‌గా కొనసాగారు. అనంతరం 1995-2000 మధ్య దూడ భవానీ శంకర్‌, 2000-2005 మధ్య తొలి మహిళా మున్సిపల్‌ చైర్మన్‌గా పైడిశెట్టి జయంతి, 2005-2010 మధ్య ఎంవీ పద్మావతి పదవులు నిర్వహించారు. పైడిశెట్టి జయంతి అంధవరపు వరహానరసింహం కుమార్తె.

  • మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోకి కొన్ని పంచాయతీలను విలీనం చేయడం, దీనిపై ఆయా పంచాయతీలు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. 2015లో శ్రీకాకుళం మున్సిపాలిటీని నగరపాలక సంస్థగా మార్చారు. అపఁటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. తాజాగా స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలన్న నీతి ఆయోగ్‌ సూచనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంగీకరించడంతో పెండింగ్‌లో ఉన్న నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగే అవకాశాలు ఏర్పడ్డాయి.

  • చర్చనీయాంశంగా ధర్మాన వ్యూహం

  • మాజీ మంత్రి, వైసీపీ సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు రాజకీయ వ్యూహం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి టీడీపీ తరపున గుండ లక్ష్మీదేవి, వైసీపీ తరపున ధర్మాన ప్రసాదరావు పోటీ చేశారు. 2014లో టీడీపీ విజయం సాధించగా, 2019లో ధర్మాన స్వల్ప ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. అయితే, 2024 ఎన్నికల్లో టీడీపీ గొండు శంకరరావును అభ్యర్థిగా నిలిపింది. తాజాగా గుండ లక్ష్మీదేవిని వైసీపీలోకి తీసుకురావాలని ధర్మాన ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఆమె పార్టీలోకి వస్తే రాజకీయ సమీకరణాలు అనుకూలించి, మేయర్‌ పీఠాన్ని దక్కించుకోవచ్చన్న అంచనాతో ఉన్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో టీడీపీ టికెట్‌ ఆశించిన లక్ష్మీదేవికి అవకాశం దక్కలేదు. అయితే, ఇంతకాలం తన వెంట ఉన్న ఎంవీ పద్మావతి, ఆమె కుమారుడిని పక్కనపెట్టి లక్ష్మీదేవిని పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం వైసీపీలో చర్చకు దారితీసింది. పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని, గతంలో ప్రత్యర్థిగా ఉన్న నాయకురాలికి ప్రాధాన్యం ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు సమాచారం. మేయర్‌ పీఠంపై ఆశలు పెట్టుకున్న వైసీపీ నేతలకు ఈ పరిణామాలు ఇబ్బందికరంగా మారే అవకాశముంది. అయితే లక్ష్మీదేవి మాత్రం సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.

  • టీడీపీలో అంధవరపు కుటుంబం పోటీ!

  • మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ అంధవరపు వరహానరసింహం కుటుంబం నుంచి ఆయన కుమారులు, కుమార్తె టీడీపీ తరఫున మేయర్‌ పీఠాన్ని ఆశిస్తున్నారు. కొంతకాలంగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకరరావుతో కలిసి వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వరహానరసింహం కుమార్తె పైడిశెట్టి జయంతి కూడా టీడీపీ తరపున ఎన్నికల బరిలో నిలవాలని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ తరపున 2024 ఎన్నికల్లో టికెట్‌ దక్కని గుండ లక్ష్మీదేవి కూడా ఈసారి మేయర్‌ పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. మరోవైపు అంధవరపు కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేతోపాటు జిల్లాకు చెందిన మంత్రులతోనూ సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న మరో ముగ్గురు సీనియర్‌ నేతలు తమ సతీమణులను రంగంలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్నారు. అధిష్ఠానం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. వార్డుల రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత కార్పొరేటర్‌ అభ్యర్థుల విషయంలోనూ పోటీ మరింత పెరిగే అవకాశముంది. మేయర్‌ పదవికి ఎవరిని ఎంపిక చేయాలన్న అంశం పార్టీ నాయకత్వానికి కీలకంగా మారనుంది.

  • ఆమదాలవలసలో కూన కుటుంబం నుంచి..

  • ఆమదాలవలస మున్సిపాలిటీలోనూ చైర్మన్‌ పదవిపై ఆసక్తి నెలకొంది. అక్కడ ఇతరులకు అవకాశం కల్పించడం కంటే, ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌ సతీమణిని బరిలోకి దించే ఆలోచన ఉన్నట్లు సమాచారం.

  • మొత్తంగా శ్రీకాకుళం నగరపాలక సంస్థతోపాటు మున్సిపాలిటీల ఎన్నికల నేపథ్యంలో కూటమిలో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు వైసీపీలో అభ్యర్థుల ఎంపిక, పాత నాయకులకు ప్రాధాన్యం వంటి అంశాలు అంతర్గత చర్చకు దారితీస్తున్నాయి. వార్డుల రిజర్వేషన్ల ప్రకటనతో ఈ రాజకీయ సమీకరణాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మేయర్‌ పీఠం ఎవరిని వరిస్తుందన్నది అప్పుడే తేలనుంది.

Updated Date - Oct 14 , 2026 | 12:14 AM