Share News

సాగు భేష్‌.. పరిశ్రమ ఉఫ్‌!

ABN , Publish Date - Jan 13 , 2026 | 12:46 AM

Srikakulam progress revealed in CM review రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వర్ణాంధ్ర-2047’ లక్ష్య సాధనలో జిల్లా పనితీరు అటూ ఇటూగా ఉంది. వ్యవసాయం, సేవా రంగాల్లో జిల్లా యంత్రాంగం సత్తా చాటినా.. అభివృద్ధికి కీలకమైన పారిశ్రామిక రంగంలో మాత్రం చతికిలపడింది.

సాగు భేష్‌.. పరిశ్రమ ఉఫ్‌!
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్పీ మహేశ్వరరెడ్డి తదితరులు

  • సీఎం సమీక్షలో తేలిన శ్రీకాకుళం ప్రోగ్రెస్‌

  • వ్యవసాయ, సేవా రంగాల్లో ‘ఏ’ గ్రేడ్‌

  • పారిశ్రామిక ప్రగతిలో మాత్రం వెనుకబాటు

  • రాష్ట్రంలో 21వ స్థానానికి పరిమితం

  • డేటా ఎంట్రీలోనూ నిర్లక్ష్యమే..

  • శ్రీకాకుళం, జనవరి 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వర్ణాంధ్ర-2047’ లక్ష్య సాధనలో జిల్లా పనితీరు అటూ ఇటూగా ఉంది. వ్యవసాయం, సేవా రంగాల్లో జిల్లా యంత్రాంగం సత్తా చాటినా.. అభివృద్ధికి కీలకమైన పారిశ్రామిక రంగంలో మాత్రం చతికిలపడింది. సోమవారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన కలెక్టర్ల సమీక్షలో ప్రణాళికా విభాగం నివేదిక ఈ విషయాలను స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి 15 శాతానికి పైగా వృద్ధి రేటు సాధించాల్సిందేనని.. శతశాతం లక్ష్యాలు చేరుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. వెనుకబడిన పారిశ్రామిక రంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, డీఆర్వో లక్ష్మణమూర్తి, సీపీఓ లక్ష్మీప్రసన్న, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో పథకాల అమలు తీరును, ప్రగతిని ముఖ్యమంత్రికి వివరించారు.

  • వ్యవసాయం.. టాప్‌-5

  • జిల్లా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన వ్యవసాయం, అనుబంధ రంగాల్లో అధికారులు, రైతుల కృషి ఫలించింది. ఖరీఫ్‌, రబీ సీజన్ల నిర్వహణ, ఉద్యాన పంటల సాగు, పశుసంవర్ధక శాఖల పనితీరును 40 సూచీల ఆధారంగా మదింపు చేయగా.. జిల్లాకు 88 స్కోరు దక్కింది. ‘ఏ’ గ్రేడ్‌ సాధించి రాష్ట్రస్థాయిలో 5వ స్థానంలో నిలిచింది. కాకినాడ, అనకాపల్లి వంటి జిల్లాలు మాత్రమే మనకంటే ముందున్నాయి.

  • సేవా రంగం.. ఫర్వాలేదు..

  • రవాణా, కమ్యూనికేషన్‌ వంటి సేవా రంగాల్లో (సర్వీస్‌ సెక్టార్‌) కూడా జిల్లా పనితీరు గౌరవప్రదంగా ఉంది. మొత్తం 7 కీలక అంశాల్లో పనితీరు ఆధారంగా జిల్లాకు 85 స్కోరు లభించింది. ఈ విభాగంలోనూ ‘ఏ’ గ్రేడ్‌ దక్కించుకుని.. రాష్ట్రస్థాయిలో 11వ స్థానంలో నిలిచింది.

  • పరిశ్రమలు.. డేంజర్‌ బెల్స్‌..

  • జిల్లాను ప్రధానంగా వేధిస్తున్నది పారిశ్రామిక వెనుకటబాటుతనమేనని గణాంకాలు స్పష్టం చేశాయి. మైనింగ్‌, తయారీ రంగం, విద్యుత్‌ వంటి 6 కీలక సూచీల్లో జిల్లా పనితీరు పేలవంగా ఉంది. ఈ విభాగంలో జిల్లాకు కేవలం 65స్కోరు మాత్రమే వచ్చింది. ‘బీ’ గ్రేడ్‌కు పరిమితమైంది. రాష్ట్రస్థాయిలో 21వ స్థానానికి పడిపోయింది. విశాఖపట్నం (99 స్కోరు), అనకాపల్లి (70 స్కోరు) జిల్లాలతో పోలిస్తే మనం చాలా వెనుకబడి ఉన్నాం.

  • డేటాఎంట్రీ.. డెడ్‌లైన్‌ దాటినా...

  • ప్రభుత్వ పథకాలు, పనుల పురోగతిని ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలోనూ జిల్లా యంత్రాంగం అలసత్వం ప్రదర్శిస్తోంది. నిబంధనల ప్రకారం ప్రతి నెలా 8వ తేదీ నాటికి డేటాఎంట్రీ పూర్తి కావాలి. కానీ.. ఈ నెల 12 నాటికి కూడా జిల్లాలో 94.74 శాతం పనులు మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదయ్యాయి. మిగిలిన 5 శాతానికి పైగా పెండింగ్‌లో ఉండటంతో పనితీరు నివేదికల నమోదులో జిల్లా.. రాష్ట్రంలో 19వ స్థానంలో నిలిచింది.

  • గ్రేడ్లు ఎలా ఇస్తారంటే..?

  • జిల్లా పనితీరును ప్రణాళికా శాఖ ఈ కింది స్కోర్ల ఆధారంగా గ్రేడింగ్‌ ఇస్తోంది.

  • ఏ+ గ్రేడ్‌: 90 శాతం నుంచి 100 శాతం స్కోరు (అత్యుత్తమం)

  • ఏ గ్రేడ్‌ : 75 శాతం నుంచి 89 శాతం స్కోరు (బాగుంది)

  • బీ గ్రేడ్‌ : 50 శాతం నుంచి 74 శాతం స్కోరు (మెరుగుపడాలి)

  • సీ గ్రేడ్‌ : 50 శాతం కంటే తక్కువ (ప్రమాదకరం)

Updated Date - Jan 13 , 2026 | 12:46 AM