ఆ భూముల్లో వ్యవసాయ గోదాములు
ABN , Publish Date - Jul 16 , 2026 | 12:31 AM
మండలంలోని నారువ గ్రామంలో గతంలో రసాయన పరిశ్రమ ఏర్పాటు కోసం కేటాయించిన ప్రభుత్వ భూముల్లో ఇకపై భారీ వ్యవసాయ గోదాములు నిర్మించన్నారు.
- నారువలో రూ.16.50 కోట్ల పెట్టుబడి
- 20వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మాణం
- ఇక రసాయన పరిశ్రమ లేనట్టే
- జీవో జారీ చేసిన రెవెన్యూ శాఖ
రణస్థలం, జూలై 15 (ఆంధ్రజ్యోతి): మండలంలోని నారువ గ్రామంలో గతంలో రసాయన పరిశ్రమ ఏర్పాటు కోసం కేటాయించిన ప్రభుత్వ భూముల్లో ఇకపై భారీ వ్యవసాయ గోదాములు నిర్మించన్నారు. ఈ మేరకు సంబంధిత రసాయన పరిశ్రమ యాజమాన్యానికి తన కార్యకలాపా లను మార్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు గత నెల 29న జరిగిన ఏపీ ల్యాండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఈ నెల 14న జీవో జారీ చేశారు.
అసలేం జరిగిందంటే..
సప్తగిరి ఇండస్ట్రీయల్ కెమికల్ సంస్థకు 2016 ఆగస్టులో ప్రభుత్వం నారువ గ్రామంలోని సర్వే నెంబరు 9-9లో 1.86 ఎకరాల బంజరు భూమిని, సర్వే నెంబరు 11-6లో 5.89 ఎకరాల గయాల భూమిని కేటాయించింది. అప్పట్లో ఎకరానికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.38.75లక్షలను సదరు సంస్థ చలానా ద్వారా ప్రభుత్వానికి చెల్లించి, ఆ భూములను తన ఆధీనంలో ఉంచుకుంది. అయితే కొవిడ్ పరిస్థితులు, వ్యాపార వ్యూహాల్లో మార్పులు, ముడి సరుకు కొరత, పర్యావరణ నిబంధనల కారణంగా అక్కడ కెమికల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో ఫార్మా యూనిట్‌కు బదులుగా వ్యవసాయ, అనుబంధ ఉత్పత్తుల నిల్వ కోసం గోదాములను నిర్మిస్తామని సంస్థ యాజమాన్యం ప్రభుత్వానికి ప్రతిపాదించింది.
రూ.16.50 కోట్లతో ప్రాజెక్టు..
పరిశ్రమల శాఖకు ఆ సంస్థ సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక ప్రకారం 7.75 ఎకరాల విస్తీరణంలో రూ.16.50 కోట్ల పెట్టుబడితో 1.44లక్షల చదరపు అడుగుల మేర భారీ గోదాములను నిర్మించనున్నారు. వీటి సామర్థ్యం 20 వేల మెట్రిక్ టన్నుల ఉంటుంది. కలెక్టర్, పరిశ్రమల శాఖ అధికారుల నివేదికల ఆధారంగా లైన్ ఆఫ్ యాక్టివిటీ మార్పునకు ప్రభుత్వం అంగీకరించింది. అయితే భూమి వ్యత్యాసం కింద సంస్థ అదనంగా మరో రూ.54.25లక్షలు ప్రభుత్వానికి చెల్లించాలని జీవోలో స్పష్టం చేసింది.
పలు నిబంధనలు..
జీవో 571 నింబంధనలకు లోబడి ఈ భూ కేటాయింపులు కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. రెవెన్యూ శాఖ ముందస్తు అనుమతి లేకుండా ఈ భూమిని ఏ ఇతర సంస్థకు బదిలీ చేయడం, లీజ్‌కు ఇవ్వడం, విక్రయించడం చేయరాదు. కేటాయించిన అవసరాలకు మాత్రమే భూమిని వినియోగించాలి. ఉత్తర్వులు వెలువడిన మూడు సంవత్సరాల వ్యవధిలోపు గోదాముల నిర్మాణాన్ని పూర్తి చేసి వినియోగంలోకి తేవాలి. స్థానికంగా ఉన్న రోడ్లు, పర్యావరణం పరంగా సున్నితమైన ప్రాంతాలకు ఎలాంటి ఆటంకం కలిగించకూడదు. నీటి వనరుల సహజ ప్రవాహానికి అడ్డుకట్ట వేయకూడదు. షరతులు ఉల్లంగించిన, నిర్ణీత వ్యవధిలోగా భూమిని సద్వినియోగం చేసుకోక పోయినా కేటాయింపులు రద్దు చేసి, ఆ భూమి వెనక్కి తీసుకునే పూర్తి అధికారం జిల్లా కలెక్టర్‌కు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.