జైలుకు వెళ్లొచ్చి.. బైక్‌లు దొంగిలించి..
ABN , Publish Date - Jun 23 , 2026 | 12:36 AM
Inter-district thief arrested అంతర్‌జిల్లాల బైక్ దొంగ కాశీబుగ్గ పోలీసులకు పట్టుబడ్డాడు. గతంలో జైలుకు వెళ్లి వచ్చినా ఆయనలో మార్పు రాలేదు. జల్సాలకు అలవాటుపడి.. ద్విచక్ర వాహనాల దొంగతనం చేస్తూ.. వాటిని విక్రయించేవాడు. ఈక్రమంలో పోలీసులకు పట్టుబడగా.. ఆయన నుంచి 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
అంతర్ జిల్లాల దొంగ అరెస్టు
13 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
పలాస, జూన్ 22(ఆంధ్రజ్యోతి): అంతర్‌జిల్లాల బైక్ దొంగ కాశీబుగ్గ పోలీసులకు పట్టుబడ్డాడు. గతంలో జైలుకు వెళ్లి వచ్చినా ఆయనలో మార్పు రాలేదు. జల్సాలకు అలవాటుపడి.. ద్విచక్ర వాహనాల దొంగతనం చేస్తూ.. వాటిని విక్రయించేవాడు. ఈక్రమంలో పోలీసులకు పట్టుబడగా.. ఆయన నుంచి 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో ఏఎస్పీ(క్రైం) పి.శ్రీనివాసరావు వెల్లడించారు.
పలాస మండలం రెంటికోట గ్రామానికి చెందిన నాతమిరి రఘునాఽథన్.. చెడు వ్యసనాలకు బానిసై బైక్‌ల దొంగగా మారాడు. గతంలో కోల్‌కత్తా, అబుదాబి, విశాఖపట్నంలోని పలు కంపెనీల్లో వెల్డింగ్ పనులు చేస్తూ జీవనోపాధి పొందేవాడు. 2020 నుంచి మాత్రం బైక్‌ల దొంగతనానికి అలవాటుపడ్డాడు. ఇళ్ల వద్ద పార్కింగ్ చేసిన బైక్‌లు దొంగిలించి.. వాటిని తక్కువ ధరకు విక్రయిస్తూ.. ఆ డబ్బులతో జల్సాలు చేసేవాడు. ఈ క్రమంలో గత నెల 30న పలాస వివేకానందకాలనీలో కొర్రాయి షణ్ముఖరావు ఇంటివద్ద పార్కింగ్ చేసిన రాయల్‌ఎన్‌ఫీల్డ్ ద్విచక్ర వాహనాన్ని దొంగిలించి పరారీ అయ్యాడు. సోమవారం కంబిరిగాం రోడ్డులో మరో వాహనం చోరీకి రెక్కీ నిర్వహించాడు. అదే సమయంలో అక్కడ వాహనాలు తనిఖీ చేస్తున్న కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ, పోలీసులు.. అనుమానంతో రఘునాఽథన్‌ను ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. ఇటీవల ఆయన 13 ద్విచక్ర వాహనాలు దొంగిలించినట్టు విచారణలో తేలింది. పాతనేరస్థుడిగా గుర్తించారు. ఆయనపై కాశీబుగ్గ, సోంపేట, టెక్కలి, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో అనేక కేసులు నమోదయ్యాయి. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి, మల్కాపురం పోలీస్‌స్టేషన్లలో కూడా కేసులు ఉన్నాయి.
ఒడిశా రాష్ట్రం జరడా పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ద్విచక్రవాహనాల దొంగతనం కేసులో నిందితుడ్ని అప్పట్లో విచారించగా పదుల సంఖ్యలో ద్విచక్రవాహనాలు పట్టుబడ్డాయి. వీటిని బాధితులకు తక్షణమే అందించారు. గతంలో నిందితుడు రఘునాఽథన్‌పై 18 దొంగతనం కేసులు నమోదు కాగా విశాఖపట్నం సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించి ఈ ఏడాది జనవరి 8న వచ్చి తిరిగి గ్రామానికి చేరుకున్నాడు. సత్ప్రవర్తనతో ఉంటాడనుకుంటే మళ్లీ బైక్‌లను చోరీ చేసి పట్టుబడ్డాడని ఏఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కేసులో బైక్‌లతోపాటు నిందితుడ్ని పట్టుకున్న సీఐ వై.రామకృష్ణ, ఎస్‌ఐలు నర్సింహమూర్తి, సునీల్, సీసీఎస్ సీఐ చంద్రమౌళి, మందస ఎస్‌ఐ కృష్ణప్రసాద్, సీసీఎస్ ఎస్‌ఐలు రాజేష్, భరత్, కాశీబుగ్గ పోలీసులను ఆయన అభినందించారు. సమావేశంలో డీఎస్పీ టి.భవాని, పోలీసులు పాల్గొన్నారు.