మంచుకొండల్లో సాహసయాత్ర
ABN , Publish Date - May 12 , 2026 | 12:40 AM
A young man riding a bike on the Umlingla Pass రణస్థలం మండలం పతివాడపాలెం గ్రామానికి చెందిన పతివాడ కిశోర్ అనే యువకుడు.. మంచుకొండల్లో సాహసయాత్ర చేస్తూ.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు.
ప్రపంచంలో ఎత్తైన ఉమ్లింగ్‌లాపాస్‌పై పతివాడపాలెం యువకుడు బైక్ రైడింగ్
సముద్ర మట్టానికి 19,024 అడుగుల ఎత్తులో ప్రయాణం
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో కిశోర్‌కు చోటు
రణస్థలం, మే 11(ఆంధ్రజ్యోతి): రణస్థలం మండలం పతివాడపాలెం గ్రామానికి చెందిన పతివాడ కిశోర్ అనే యువకుడు.. మంచుకొండల్లో సాహసయాత్ర చేస్తూ.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. ఓ వైపు ఆక్సిజన్ శాతం చాలా తక్కువ. మరోవైపు మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత నడుమ.. ప్రపంచంలోనే ఎత్తయిన జమ్ము-కశ్మీర్‌లోని లడఖ్ ప్రాంతంలో ఉమ్లింగ్‌లాపాస్‌పై బైక్ రైడింగ్ చేసి.. విజయం సాధించాడు. సిక్కోలు ఖ్యాతిని జాతీయస్థాయిలో ఇనుమడింపజేశాడు. ఆయన సాహసయాత్ర ప్రతిభను గుర్తిస్తూ.. ఈ నెల 6న గిన్నిస్‌బుక్ ప్రతినిధులు ధ్రువపత్రాన్ని అందజేశారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జమ్ముకశ్మీర్ నుంచి స్వగ్రామానికి బయలుదేరిన కిశోర్‌కు ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రపంచంలో ఎత్తయిన మోటారు మార్గం
ఉమ్లింగ్ లాపాస్.. ప్రపంచంలోనే ఎత్తైన మోటారు మార్గంగా గుర్తింపు పొందింది. దీనిని భారత సరిహద్దుల సంస్థ నిర్మించింది. వాహనాలు వెళ్లే మార్గంగా ఈ రహదారిని తీర్చిదిద్దారు. కానీ అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. దారిపొడవునా మంచుతో కప్పబడి ఉంటుంది. సముద్ర మట్టానికి 19,300 అడుగుల ఎత్తులో ఉంటుంది. కిశోర్ 19,024 అడుగుల ఎత్తువరకూ ప్రయాణించి ఈ ఘనత సాధించాడు. ఇక్కడ ఆక్సిజన్ శాతం చాలా తక్కువ. జూన్ నుంచి సెప్టెంబరు వరకూ మాత్రమే అక్కడకు వెళ్లేందుకు అనుకూల సమయం. మిగతా సమయాల్లో -40 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు పడిపోతాయి. ఇక్కడకు వెళ్లేందుకు కచ్చితంగా ఇన్నర్ లైన్ పర్మిట్ తప్పనిసరి. అటువంటి మార్గంలో సాహసయాత్ర చేపట్టి.. ఆదర్శంగా నిలిచాడు పతివాడ కిశోర్.
సాధారణ కుటుంబం
పతివాడ కిశోర్ తల్లిదండ్రులు కమల, నరసింహమూర్తులు సాధారణ వ్యవసాయ కూలీలు. కిశోర్ చిన్నప్పుడే తండ్రి నరసింహమూర్తి అనారోగ్యానికి గురయ్యారు. ఆ ప్రభావం కిశోర్ చదువుపై పడింది. పదో తరగతి వరకూ స్థానిక ఏపీ మోడల్ స్కూల్‌లో చదువుకున్నాడు. తరువాత ఇంటర్‌లో చేరాడు. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. దీంతో కిశోర్ ఉపాధి కోసం లారీ, వ్యాన్‌డ్రైవర్‌గా పనిచేయడం ప్రారంభించాడు. అదే సమయంలో బైక్ రైడింగ్‌పై కూడా దృష్టి పెట్టాడు. ఏదో సాధించాలనే తపనతో ఉమ్లింగ్ లాపాస్‌పై బైక్ రైడింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. రూ.3 లక్షల విలువచేసే బైక్‌ను కొనుగోలు చేశాడు. గత నెలలో రణస్థలం నుంచి జమ్ము-కశ్మీర్‌కు బైక్‌పై బయలుదేరాడు. ఈ నెల 6న అనుకున్నది సాధించడంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. తాను అనుకున్నది సాధించగలిగానని.. చదువుతో రాణించాలని అనుకుంటే కుటుంబ పరిస్థితులు కలిసిరాలేదని.. అందుకే బలమైన సంకల్పంతో గిన్నీస్ వరల్డ్ బుక్‌రికార్డులో చోటు దక్కించుకున్నట్టు పతివాడ కిశోర్ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.