జాతర్లలో ‘కల్తీ’ కాటు!
ABN , Publish Date - Apr 05 , 2026 | 12:05 AM
Sales of inferior drinks and ice creams పండుగలు, జాతర్లలో ఆనందంగా గడపాల్సిన క్షణాలు.. కొందరి వ్యాపారుల కాసుల కక్కుర్తికి, అధికారుల నిర్లక్ష్యానికి ప్రాణసంకటంగా మారుతున్నాయి. తక్కువ ధర ఆశచూపి.. నాసిరకం, కల్తీ ఆహార పదార్థాలను అంటగడుతున్న వ్యాపారుల వలకు అమాయక ప్రజలు బలవుతున్నారు.
పండుల పూట ప్రాణాలతో చెలగాటం
నాసిరకం డ్రింక్స్, ఐస్‌క్రీమ్‌లు, రంగుల పదార్థాల విక్రయాలు
ఆసుపత్రుల పాలవుతున్న ప్రజలు
నిద్రావస్థలో ఫుడ్ సేఫ్టీ, పంచాయతీ అధికారులు
సింగుపురం ఘటనతోనైనా కళ్లు తెరిచేనా?
శ్రీకాకుళం, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): పండుగలు, జాతర్లలో ఆనందంగా గడపాల్సిన క్షణాలు.. కొందరి వ్యాపారుల కాసుల కక్కుర్తికి, అధికారుల నిర్లక్ష్యానికి ప్రాణసంకటంగా మారుతున్నాయి. తక్కువ ధర ఆశచూపి.. నాసిరకం, కల్తీ ఆహార పదార్థాలను అంటగడుతున్న వ్యాపారుల వలకు అమాయక ప్రజలు బలవుతున్నారు. ఇటీవల శ్రీకాకుళం మండలం సింగుపురంలో కొండమ్మతల్లి జాతరలో ఫుడ్ పాయిజన్ ఘటనే ఇందుకు సజీవ సాక్ష్యం. రూ.10కే బాదం పాలు వస్తున్నాయన్న ఆశతో వాటిని తాగి.. సుమారు 80 మందికిపైగా అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైన ఉదంతం జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. ఇలాంటి ఘటనలు జిల్లాలో ఎక్కడో ఒకచోట నిత్యం జరుగుతూనే ఉన్నా... సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
జిల్లాలో గ్రామదేవతల పండుగలు, జాతరలు, యాత్రలకు వేలాది ప్రజలు వస్తుంటారు. ఇటువంటి ప్రాంతాలే లక్ష్యంగా కొంతమంది వ్యాపారులు కల్తీ దందా సాగిస్తున్నారు. తోపుడు బండ్లపై రంగురంగుల పానీయాలు, నాసిరకం ఐస్‌క్రీమ్‌లు, కృత్రిమరంగులు అద్దిన ఫాస్ట్‌ఫుడ్స్, చవకరకం శీతల పానీయాలు, కెమికల్స్‌తో తయారుచేసే బాదంపాలు తదితర వాటిని విక్రయించి సొమ్ము చేసుకుంటుంటారు. పది.. ఇరవై అంటూ చవక ధరలతో ఆశ చూపి.. విక్రయాలు సాగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అవి వికటించి.. వాంతులు, విరోచనాలు, తీవ్ర జ్వరంతో ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారు. ఈలోపే వాటిని విక్రయించిన వ్యాపారులు అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. తీరా ఆసుపత్రి పాలైన తర్వాత బాధితులు లబోదిబోమంటున్నారు.
అధికారుల పర్యవేక్షణ ఏదీ..?
జాతర్లలో ఆహార పదార్థాల నాణ్యతపై ఫుడ్ సేఫ్టీ అధికారులు, స్థానిక పంచాయతీ అధికారుల పర్యవేక్షణ శూన్యమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సింగుపురం లాంటి ఘటనలు జరిగి, ప్రజలు ఆసుపత్రుల పాలయ్యాక హడావిడి చేయడం మినహా.. ముందస్తు నివారణ చర్యలు తీసుకోవడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమవుతోంది. కల్తీ ఆహార పదార్థాలు విక్రయించేవారిపై కఠినచర్యలు తీసుకుంటేనే ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట పడుతుంది.
ప్రజలూ.. అప్రమత్తంగా ఉండాలి
అధికారుల నిర్లక్ష్యం ఒక ఎత్తైతే.. ప్రజల అవగాహన లోపం కూడా ఈ అనర్థాలకు కారణమవుతోంది. పండుగల వాతావరణంలో బయట దొరికే ప్రతి వస్తువును కొనుగోలు చేయరాదు. ముఖ్యంగా పిల్లలకు రంగురంగుల డ్రింక్స్, నాసిరకం ఐస్‌క్రీమ్‌లు కొనివ్వకూడదు. తక్కువ ధరకు వస్తోంది కదా అని ఆశపడితే.. ఆసుపత్రి బిల్లుల రూపంలో వేలాది రూపాయలు వదులుకోవడమే కాకుండా, ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందనే విషయాన్ని గ్రహించాలి. సింగుపురం ఘటనను ఒక హెచ్చరికగా తీసుకుని.. కల్తీ ఆహారానికి దూరంగా ఉండాలి.