కల్తీలు కాటేస్తాయ్!
ABN , Publish Date - Jan 31 , 2026 | 12:03 AM
Adulterated oils జిల్లాలో నూనె, నెయ్యిలో కల్తీ జరుగుతుందన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇటీవల జిల్లాకు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్న కల్తీ నూనె కాకినాడ జిల్లాలో దొరకడంతో నిజమని తేలింది. కొంతమంది నూనె యథేచ్ఛగా కల్తీ చేసి విక్రయిస్తూ.. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు.
జిల్లాకు పెద్ద ఎత్తున కల్తీ నూనెలు
ఇటీవల కాకినాడలో 840 కిలోల పట్టివేత
నెయ్యిదీ అదే పరిస్థితి..
తక్కువ ధరకు లభిస్తుండడంతో వినియోగం
ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం
రణస్థలం, జనవరి 30(ఆంధ్రజ్యోతి):
ఈ నెల 27న కాకినాడ జిల్లా ధర్మవరం సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు చేయగా.. కల్తీ నూనె పెద్ద ఎత్తున పట్టుబడింది. తొమ్మిది మందిని అరెస్టు చేసి.. వారి నుంచి 840 కిలోల నూనెను స్వాధీనం చేసుకున్నారు. గత నాలుగు నెలలుగా ఈ దందా కొనసాగుతోంది. మన జిల్లాలోని ఇచ్ఛాపురానికి కల్తీ నూనె తరలిస్తున్నట్టు పోలీసు విచారణలో తేలింది. నూనెలో క్రూడాయిల్ కలిపినట్టు తేలడం ఆందోళన కలిగిస్తోంది.
...............
జిల్లాలో నూనె, నెయ్యిలో కల్తీ జరుగుతుందన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇటీవల జిల్లాకు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్న కల్తీ నూనె కాకినాడ జిల్లాలో దొరకడంతో నిజమని తేలింది. కొంతమంది నూనె యథేచ్ఛగా కల్తీ చేసి విక్రయిస్తూ.. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. జిల్లాకు నాణ్యత లేని నెయ్యి, నూనె సరఫరా జరుగుతున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారు. జిల్లాలో ఎక్కువగా సన్‌ఫ్లవర్, పామాయిల్, రైస్‌బ్రాన్, వేరుశెనగ నూనెను ఎక్కువగా వినియోగిస్తుంటారు. అన్నీరకాలు కలిపి నెలకు దాదాపు 1700 టన్నుల నూనె విక్రయిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రతినెలా సుమారు రూ.15కోట్ల మేర నూనె వ్యాపారం సాగుతోంది. చిన్న, మధ్యతరహా హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాల్లో అధికంగా పామాయిల్, సన్‌ఫ్లవర్ నూనెను ఎక్కువగా వాడుతున్నారు. మిగిలిన వాటి కంటే తక్కువ ధరకు లభిస్తుండడంతో చాలామంది వీటికే మొగ్గు చూపుతున్నారు.
నెయ్యినీ వదలట్లే..
నెయ్యిలో కూడా కల్తీ జరుగుతున్నట్టు ఆరోపణలున్నాయి. సాధారణంగా నెయ్యిని రెండు రకాలుగా ఉత్పత్తి చేస్తారు. ఇళ్లలో పెరుగు చిలికే క్రమంలో వచ్చే వెన్నను కాయడం ద్వారా తయారు చేసేది 10 నెలలైనా నిల్వ ఉంటుంది. యంత్రంతో పాలుపోసి ఆడించిన తరువాత వచ్చే వెన్నను మరిగించి రెండో రకంగా నెయ్యిని తయారుచేస్తారు. దీని నాణ్యత నెల రోజుల తరువాత తగ్గిపోతుంది. జిల్లాలో రెండో రకం నెయ్యి ఉత్పత్తి, విక్రయాలు జరుగుతున్నాయి. అందులోనూ వనస్పతి, పామాయిల్ కలిపేసి కొందరు కల్తీ చేస్తున్నారు. బేకరీ, స్వీటుషాపు నిర్వాహకులు తక్కువ ఽధరకు లభించే కల్తీ నెయ్యి, నూనెను కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో నెలకు 50వేల లీటర్ల నెయ్యి విక్రయిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. రకం, నాణ్యత బట్టి కిలో నెయ్యి రూ.350 నుంచి రూ.1000 వరకూ అమ్ముతున్నారు. రూ.2.50 కోట్ల మేర వ్యాపారం జరుగుతోంది.
ఇద్దరే అధికారులు..
జిల్లాలో వేల టన్నుల నూనె, నెయ్యి విక్రయాలు జరుగుతున్నాయి. వందల కొలదీ వ్యాపారులు ఉన్నారు. కానీ ఆహార పదార్థాల కల్తీ నియంత్రణ అధికారులు మాత్రం కేవలం ఇద్దరే ఉన్నారు. ఒక్క శ్రీకాకుళం నగరంలోనే తోపుడుబండ్లు, చిన్న, మధ్యతరహా హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాలు సుమారు 1000వరకూ ఉన్నాయి. 30 మండలాల్లో ఆ సంఖ్య 8 వేల వరకూ ఉండొచ్చని ఒక అంచనా. నూనె, నెయ్యి సరఫరాదారులు 500 మంది వరకూ ఉంటారు. వీరందరి వద్ద కల్తీ జరగకుండా నియంత్రించాల్సిన ఇన్‌స్పెక్టర్లు కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఫలితంగా ఎక్కడా తనిఖీలు సక్రమంగా జరగడం లేదు. దీంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
ప్రాణాంతక వ్యాధులు..
కల్తీ నూనె, నెయ్యితో తయారుచేసే ఆహార పదార్థాలు తింటే కేన్సర్ సంబంధిత వ్యాధులు రావొచ్చు. శ్వాసకోస సమస్యలు తలెత్తుతాయి. వీటికి అదనంగా మలబద్దకం, ఒళ్లునొప్పులు, గుండెపోటు, పక్షవాతం వంటి రుగ్మతలు వస్తాయి. జీర్ణ వ్యవస్థ గాడి తప్పుతుంది. ఆరోగం పాడయ్యాక లక్షలు ఖర్చుపెట్టడం కంటే ముందే మేల్కోవడం ఉత్తమం.
- యుగంధర్, వైద్యుడు, రణస్థలం సీహెచ్‌సీ
ఫిర్యాదు చేయండి
నూనె, నెయ్యిలు కల్తీ జరిగాయని అనుమానం వచ్చిన వెంటనే ఫిర్యాదు చేయవచ్చు. శ్రీకాకుళంలోని కార్యాలయానికి సంప్రదించాలి. లేదంటే 9398467652 నంబరుకు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయాలి. తనిఖీ చేసి కల్తీ అని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఈ నెలలో కాలం చెల్లిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్న నాలుగు షాపుల యాజమానులపై కేసులు నమోదు చేశాం. మరో 5 షాపులపై కేసులు నమోదు చేశాం.
- సీహెచ్ లక్ష్మీనారాయణ, జిల్లా ఆహార భద్రతాధికారి, శ్రీకాకుళం