అడ్మిషన్ల వేట
ABN , Publish Date - Apr 18 , 2026 | 11:51 PM
Admission scam in private schools ‘ఈ ఏడాది మా విద్యా సంస్థలో మీ సర్వీసులు కొనసాగించాలంటే ఒక్కొక్కరూ ఖచ్చితంగా 20 అడ్మిషన్లు చేయాలి. లేదంటే మీ సేవలు మాకు అవసరం లేదు’ అని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులకు, సిబ్బందికి ఆయా యాజమాన్యాలు లక్ష్యాలు నిర్దేశిస్తున్నాయి. దీంతో వేసవి సెలవులు ప్రారంభానికి ముందే గ్రామాల్లో అడ్మిషన్ల వేట మొదలైంది.
ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ప్రవేశాల దందా
విద్యార్థులకు రాయితీల గాలం
చేరికలపై ఉపాధ్యాయులు, సిబ్బందికి లక్ష్యాలు
నరసన్నపేట, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): ‘ఈ ఏడాది మా విద్యా సంస్థలో మీ సర్వీసులు కొనసాగించాలంటే ఒక్కొక్కరూ ఖచ్చితంగా 20 అడ్మిషన్లు చేయాలి. లేదంటే మీ సేవలు మాకు అవసరం లేదు’ అని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులకు, సిబ్బందికి ఆయా యాజమాన్యాలు లక్ష్యాలు నిర్దేశిస్తున్నాయి. దీంతో వేసవి సెలవులు ప్రారంభానికి ముందే గ్రామాల్లో అడ్మిషన్ల వేట మొదలైంది. ‘మా స్కూల్‌లో చేర్పించండి.. మీ పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దుతాం. ఫీజు రాయితీలు కూడా కల్పించి నాణ్యమైన విద్యనందిస్తా’మంటూ ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది.. విద్యార్థుల తల్లిదండ్రులకు గాలం వేస్తున్నారు. పట్టణాలు, పల్లెల్లో ఉదయం 8 గంటల నుంచే ఇంటింటికీ తిరుగుతూ అడ్మిషన్ల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. గ్రామాల్లో అడ్మిషన్లు ఇచ్చేవారికి కొంత పారితోషికం గుడ్‌విల్‌గా అందజేస్తామని ఆశ చూపుతున్నారు.
విస్తృత ప్రచారం
జిల్లాలో ఏటా కొత్త ప్రైవేటు విద్యాసంస్థలు వెలుస్తున్నాయి. ప్లేస్కూల్ నుంచి పదోతరగతి వరకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు ఎన్నో నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం, నరసన్నపేట, పలాస-కాశీబుగ్గ, టెక్కలి తదితర పట్టణాల్లో అడ్మిషన్లు ఎక్కువగా వచ్చేందుకు వీలుగా ఇంటర్నేషనల్, సీబీఎస్‌ఈ, స్టేట్ సిలబస్ కేటగిరీల వారీగా ప్రత్యేక కరిక్యులం పేరుతో విస్తృత ప్రచారం చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు తమ పాఠశాలలు ప్రత్యేకతను వివరిస్తూ.. వారి పిల్లలను చేర్పించేలా ప్రైవేటు ఉపాధ్యాయులు, పీఆర్వోలు ఒత్తిడి చేస్తున్నారు. మరికొన్ని విద్యాసంస్థలు టాలెంట్ పరీక్ష పేరుతో విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎక్కువ స్కోర్ చేశారో వారికి ఫీజులో రాయితీ ఇస్తున్నారు. మరికొందరు సామాజిక మాధ్యమాల్లో కూడా ప్రచారం చేస్తూ.. అడ్మిషన్ల కోసం పాట్లు పడుతున్నారు. ఫీజుల కోసం ఆలోచించవద్దని.. పిల్లల ఉజ్వల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని తమ పాఠశాలలో చేర్చాలని తల్లిదండ్రులు నచ్చజెబుతున్నారు.
మా కాలేజీలో చేర్పించండి
మరోవైపు పదో తరగతి పరీక్షలు పూర్తికావడంతో.. ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు కూడా ఇంటర్ విద్యార్థుల అడ్మిషన్ల కోసం అన్వేషణ సాగిస్తున్నాయి. కళాశాలలు, పీఆర్వోల నుంచి విద్యార్థుల తల్లిదండ్రులకు మెస్‌జ్‌లు, కాల్స్ వస్తున్నాయి. ముందుగానే అడ్మిషన్ కన్‌ఫర్మ్ చేసుకుంటే ఫీజులో రాయితీ వర్తిస్తుందని చెబుతున్నారు. తమ పిల్లలు బాగా చదువుకొని ఐఐటీ, ఎన్‌ఐటీ, నీట్‌లో మంచి స్కోర్‌సాఽధిచాలన్న ఆశతో రూ.లక్షలు వెచ్చించి కార్పొరేట్ విద్యాసంస్ధల్లో చేర్చేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు.