ఆదిత్యా.. అభివృద్ధి ఏదీ?
ABN , Publish Date - Jul 18 , 2026 | 12:05 AM
ఇదిగో ప్రసాద్ పథకం కింద నిధులు వచ్చేస్తున్నాయి. ఇక ఆలయ రూపురేఖలు మారిపోతాయి.
- కొండెక్కిన ‘ప్రసాద్’ పథకం
- మూలనపడ్డ మాస్టర్ ప్లాన్
- నాలుగేళ్లు అవుతున్నా కానరాని పనులు
- ఇదీ సూర్యనారాయణ దేవస్థానం పరిస్థితి
ఇదిగో ప్రసాద్ పథకం కింద నిధులు వచ్చేస్తున్నాయి. ఇక ఆలయ రూపురేఖలు మారిపోతాయి. భక్తులకు మెరుగైన సౌకర్యాలు, ఆధునిక వసతులు కల్పిస్తాం. మాస్టర్ ప్లాన్‌తో ఆలయాన్ని దేశంలోనే గొప్ప ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామంటూ గొప్పలు చెప్పారు. పనుల పేరిట హడావుడిగా ఉన్న భవనాలను కూల్చేశారు. అయితే, నాలుగేళ్లు అవుతున్నా ఆ పనులకు అతీగతి లేదు. అసలు ప్రసాద్ పథకంలో ఆ ఆలయాన్ని చేర్చలేదు. ఇదీ అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధి తీరు.
అరసవల్లి, జూలై 17(ఆంధ్రజ్యోతి): అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధి కేవలం మాస్టర్ ప్లాన్‌కే పరిమితమైంది. ప్రసాద్ (పిలిగ్రిమేజ్ రెజ్యువెనేషన్ అండ్ స్పిరిట్యువల్ ఆగ్‌మెంటేషన్) పథకం కింద రూ.100కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని నాలుగేళ్ల కిందట అధికారులు, పాలకులు గొప్పలు చెప్పారు. మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేశారు. కొత్త నిర్మాణాలు చేపడతామని పాత భవనాలు సైతం తొలగించారు. అయితే, ప్రసాద్ పథకంలో అరసవల్లి దేవాలయాన్ని కేంద్ర పర్యాటక శాఖ చేర్చలేదు. దీంతో ఆలయ అభివృద్ధి పనులు ముందుకు కదలడం లేదు. కేవలం ఇంద్ర పుష్కరిణికి సంబంధించి రూ.2కోట్ల దేవస్థానం నిధులు, రూ.2కోట్ల సీజీఎఫ్ నిధులతో టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించారు.
మాస్టర్ ప్లాన్ ఇలా..
ఇంద్ర పుష్కరిణిని అభివృద్ధి చేయడం. ఆలయానికి తూర్పు భాగంలో అమ్మవారి ఆలయం పక్క రోడ్డులో ప్రధాన ఆర్చి గేటు నిర్మాణం. ఒకేసారి వెయ్యిమందికి సరిపడా అన్నదాన భవనాన్ని నిర్మించడం. కేఖ ఖండన శాల నిర్మాణం. భక్తులకు పూర్తిస్థాయి సౌకర్యాలతో విశ్రాంతి భవనాలు. సరికొత్త క్యూలైన్లు(లైన్లలో భక్తులు కూర్చునేందుకు వీలుగా బెంచీలతో సహా) ఏర్పాటు. షాపుల కోసం సరికొత్త బ్లాక్ నిర్మాణం. విశాలమైన గోశాల. మరుగుదొడ్ల్లు, ఓపెన్ డయాస్, భక్తుల రద్దీని తట్టుకునేలా ప్రసాదం కౌంటర్లు, సుందరమైన రాజగోపుర నిర్మాణం. వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం వంటి వాటితో ప్రణాళికలు తయారు చేశారు. అయితే, ప్రసాద్ పథకంలో అరసవల్లి ఆలయాన్ని చేర్చకపోవడంతో మాస్టర్ ప్లాన్ ప్రకారం చేయాల్సిన అభివృద్ధి పనులు అలాగే ఉండిపోయాయి.
ఇంద్రపుష్కరిణి సుందరీకరణ
ఇంద్ర పుష్కరిణిని రూ.4కోట్లతో అభివృద్ధి చేసేందుకు గాను పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది డిసెంబరు చివరి నాటికి పుష్కరిణి నిర్మాణం పూర్తి చేసే విధంగా ప్రణాళిక తయారు చేశారు. పుష్కరిణికి నలువైపులా వాకింగ్ ట్రాక్‌ను నిర్మించనున్నారు. చుట్టూ పచ్చని పచ్చిక, పూలమొక్కలతో అందంగా తీర్చిదిద్దనున్నారు. నీటిని క్రమం తప్పకుండా మార్చేలా చర్యలు చేపట్టనున్నారు. పుష్కరిణి మధ్యలో ప్రత్యేక మండపాన్ని నిర్మించనున్నారు. సాయంత్రం వేళలో విద్యుత్తు కాంతుల్లో మెరిసే విధంగా ఎలక్ట్రిఫికేషన్ పనులు కూడా చేయనున్నారు.
పడగొట్టేశారు.. వదిలేశారు
గతంలో ఆలయంలో అన్నదానం, ప్రసాదాల పంపిణీ, షాపుల కోసం పక్కా భవనాలు ఉండేవి. గతేడాది ఆలయ అభివృద్ధి పేరిట ఆ భవనాలను హడావుడిగా తొలగించారు. అయితే వాటి స్థానంలో కొత్త నిర్మాణాలు మాత్రం చేపట్టలేదు. ఇప్పటికీ అన్నదాన కార్యక్రమం రేకుల షెడ్లలోనే జరుగుతోంది. ప్రసాదాల కౌంటర్లను కూడా బయటే నిర్వహిస్తున్నారు. ఇక వ్యాపారులు రోడ్లపైనే దుకాణాలు వేసుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. అభివృద్ధి మాట దేవుడెరుగు.. ఉన్న వాటిని కూలదోసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని భక్తులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా నాయకులు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, ఆదిత్యాలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.