Share News

ఆదిత్యా.. ఇదేమి సేవ!

ABN , Publish Date - Aug 30 , 2026 | 12:02 AM

Services declining at Arasavalli ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.. అరసవల్లిలో శ్రీ సూర్యనారాయణ స్వామికి నిర్వహించే సేవల తగ్గుదలపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్య కైంకర్యాలు, సేవలతో అనునిత్యం ఆలయ పరిసరాలు ఎంతో కోలాహలంగా ఉండేవి. స్వామికి నిర్వహించే పలు సేవల్లో భక్తులు పెద్దఎత్తున ఉత్సాహంగా పాల్గొనేవారు. నిత్యం భక్తుల తాకిడితో ఆలయ ఆదాయం ఏటా పెరుగుతూనే ఉంది. కానీ స్వామికి సేవల విషయంలో మాత్రం అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోంది.

ఆదిత్యా.. ఇదేమి సేవ!
అరసవల్లిలో ఆదిత్యాలయం

  • అరసవల్లిలో స్వామికి తగ్గుతున్న సేవలు

  • దేవునికి నివేదించకుండానే ప్రసాదం అమ్మకాలు?

  • ఆవేదన చెందుతున్న భక్తులు

  • అరసవల్లి, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.. అరసవల్లిలో శ్రీ సూర్యనారాయణ స్వామికి నిర్వహించే సేవల తగ్గుదలపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్య కైంకర్యాలు, సేవలతో అనునిత్యం ఆలయ పరిసరాలు ఎంతో కోలాహలంగా ఉండేవి. స్వామికి నిర్వహించే పలు సేవల్లో భక్తులు పెద్దఎత్తున ఉత్సాహంగా పాల్గొనేవారు. నిత్యం భక్తుల తాకిడితో ఆలయ ఆదాయం ఏటా పెరుగుతూనే ఉంది. కానీ స్వామికి సేవల విషయంలో మాత్రం అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోంది. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో.. ఉత్సాహంగా పాల్గొనే సహస్ర దీపాలంకరణ సేవ సుమారు రెండేళ్లుగా జరగడం లేదు. ప్రతీ నెల పౌర్ణమి రోజున భక్తులు స్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి, మండపంలో ఉంచి.. సహస్ర దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించేవారు. ఈ సేవలు నేడు మాయమైపోయాయి.

  • ఈ ఏడాది ఏప్రిల్‌లో స్వామి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. కాగా.. ఉత్సవమూర్తులను పల్లకీలో ఉంచి.. అరసవల్లి మాడవీఽధుల్లో ఊరేగించే తిరువీధి మహోత్సవాలు నేడు పూర్తిగా కనుమరుగయ్యాయి. భక్తులు, అరసవల్లి ప్రజలు ఎంతో ఆనందంగా జరుపుకునే ఈ ఉత్సవాలు ఎందుకు జరగడం లేదో..ఎవరికీ తెలియదు.

  • ఏడాదిగా ఆగిన దశవిధ హారతులు

  • స్వామికి నిత్యం సమర్పించే దశవిధ హారతులు ఏడాదిగా నిలిచిపోయాయి. రథసప్తమి నాడు స్వామిని దర్శించుకునేందుకు ఎత్తయిన ఫ్లాట్‌ఫారాలు వేశారు. భక్తులు ఇప్పటివీ వీటిపై నిల్చొని స్వామిని దర్శించుకుంటున్నారు. దీంతో హారతి సమయంలో భక్తుల నీడ పడుతుండడంతో హారతుల నివేదనను నిలిపివేశారు. దశవిధ హారతుల ప్రక్రియ మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతుందోనని భక్తులు ఎదురుచూస్తున్నారు.

  • స్వామికి నివేదించకుండానే ప్రసాదాల అమ్మకాలు?

  • గతంలో వంటస్వామి పులిహోర, లడ్డూ తయారుచేసి, స్వామికి నివేదించేవారు. అనంతరం ఆ ప్రసాదాలను వంటశాలలోకి తీసుకువెళ్లి.. అక్కడ భక్తులకు అమ్మేందుకు తయారుచేసిన పులిహోర, లడ్డూల్లో కలిపేవారు. ఆ ప్రసాదాలను భక్తులు అమ్మేవారు. కానీ ఆ సంప్రదాయం నేడు కనుమరుగైంది. వంటశాలలో తయారైన పదార్థాలు నేరుగా ప్యాకింగ్‌ చేసి, భక్తులకు ప్రసాదాల పేరిట అమ్మేస్తున్నారు. భక్తుల నమ్మకాలను కించపరిచేలా వ్యవహరిస్తున్నారు.

  • వైదిక కమిటీని సంప్రదించేవారేరీ?

  • స్వామికి అందించే వివిధ రకాల సేవలకు సంబంధించి ఆలయ అధికారులు వైదిక కమిటీని సంప్రదించాలి. వారి సూచనల మేరకు స్వామికి సేవలు, నివేదనలు, భక్తులకు దర్శన విధానాలు మొదలగు కార్యక్రమాలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించాలి. అయితే నేడు ఆలయానికి వైదిక కమిటీ ఒకటి ఉందనే విషయం కూడా అధికారులు మరిచిపోయారు.

  • మహా కుంభాభిషేకం ఎప్పుడో...?

  • ప్రతీ 12 సంవత్సరాలకోసారి మహా కుంభాభిషేకం నిర్వహిస్తారు. అదే సమయంలో ప్రపంచ శాంతి, క్షేమాన్ని ఆశిస్తూ మహా సౌరయాగం చేస్తారు. అయితే 12 ఏళ్లు దాటిపోయినా సరే నేటికీ ఈ విషయంలో అధికారులు, అర్చకులు, వేదపండితులు మౌనంగానే ఉన్నారు. ఏమైనా సరే సనాతన సాంప్రదాయాలను అనుసరిస్తూ, తమ మనోభావాలను గౌరవిస్తూ, ఆదిత్యాలయాన్ని మరింత అభివృద్ధి చెందేలా స్వామికి సేవలను పునరుద్ధరించాలని భక్తులు కోరుతున్నారు.

  • త్వరలోనే ప్రారంభిస్తాం

  • ఆదిత్యాలయంలో స్వామికి గతంలో సమర్పించిన సేవలన్నింటినీ త్వరలోనే మళ్లీ ప్రారంభిస్తాం. మహా కుంభాభిషేకం కూడా నిర్వహిస్తాం. నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరిగిన వెంటనే వారితో, వైదిక కమిటీతో చర్చించి, పూర్తి స్థాయిలో సేవలను పునరుద్ధరిస్తాం.

  • - కేఎన్‌వీడీవీ ప్రసాద్‌, ఈవో, అరసవల్లి

Updated Date - Aug 30 , 2026 | 12:02 AM