Share News

ఆదిత్యాలయం.. భక్తజన సంద్రం

ABN , Publish Date - Feb 01 , 2026 | 11:48 PM

Arasavalli Crowd అరసవల్లిలోని ఆదిత్యాలయం ఆదివారం భక్తజన సంద్రమైంది. ఆలయం లోపల, పరిసరాలు, క్యూలైన్లు, ఇంద్ర పుష్కరిణి వద్ద ఎక్కడ చూసినా భక్తులతో కిటకిటలాడాయి.

ఆదిత్యాలయం.. భక్తజన సంద్రం
అరసవల్లిలో భక్తుల రద్దీ

  • అరసవల్లిలో క్యూలైన్లు కిటకిట

  • అరసవల్లి, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): అరసవల్లిలోని ఆదిత్యాలయం ఆదివారం భక్తజన సంద్రమైంది. ఆలయం లోపల, పరిసరాలు, క్యూలైన్లు, ఇంద్ర పుష్కరిణి వద్ద ఎక్కడ చూసినా భక్తులతో కిటకిటలాడాయి. మాఘమాసం ఆదివారం కావడం.. మరోవైపు వత్సవలస రాజమ్మతల్లి జాతరకు వెళ్లే భక్తులు కూడా అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచే భక్తులు పెద్దఎత్తున ఆలయానికి చేరుకున్నారు. కొంతమంది ఇంద్రపుష్కరిణిలో పవిత్ర స్నానాలు ఆచరించి, స్వామిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో బారులుదీరారు. ప్రత్యేక దర్శన క్యూలైన్‌ బొంపాడ వీధి దాటి ముందుకు సాగింది. భక్తుల రద్దీ.. మినీ రథసప్తమిని తలపించింది. అన్నప్రసాదం క్యూలైన్లు కూడా కిక్కిరిసిపోయాయి. సూర్యనమస్కారాల మండపం భక్తులతో నిండిపోయింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు, సిబ్బంది చర్యలు చేపట్టారు.

  • ఒక్కరోజు ఆదాయం రూ.18.33లక్షలు

  • అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామికి ఆదివారం ఒక్క రోజు రికార్డు స్థాయిలో రూ.18,33,261 ఆదాయం లభించింది. ఇందులో టిక్కెట్ల అమ్మకం ద్వారా రూ.11,65,200, విరాళాల రూపంలో రూ.1,71,271 సమకూరింది. ప్రసాదాల ద్వారా రూ.3,99,090, ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ ద్వారా రూ.97,700 ఆదాయం లభించిందని ఆలయ అధికారులు తెలిపారు.

Updated Date - Feb 01 , 2026 | 11:48 PM